ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే, ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది.

Spread the love