శాయంపేటలో భారీ వర్షం

– కల్లాలలో తడిసిన వరి ధాన్యం
– సైడ్ కాల్వ లేక రోడ్డెక్కిన వరద నీరు
నవతెలంగాణ – శాయంపేట
మండల పరిధిలోని గ్రామాలలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అన్నదాతలు కుదేలయ్యారు. పంట కోసి పంట క్షేత్రంలో ఆరబెట్టుకుంటున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. శాయంపేటలో కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో దేవుని చెరువు ఆయకట్టులో పండించిన ధాన్యాన్ని రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి వర్షం భారీ నుండి పంటను కాపాడుకున్నారు. శాయంపేట నుండి ఆత్మకూరు వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణంతో శాయంపేటలో సైడ్ కాలువ నిర్మాణం లేక వరద నీరు రోడ్డెక్కింది. కూరాకుల కుమారస్వామి ఇంటికి వెళ్లే దారి నీటితో నిండిపోయి చిన్నపాటి తటకాన్ని తలపించింది. మండలంలో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఊరట చెందారు. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు పెరగడం, ఎండల తాకిడికి తట్టుకోలేని ప్రజలు వర్షంతో ఉపశమనం చెందారు.

Spread the love