ఫుల్‌ మీల్స్‌

లీలగా… తన నాన్న ‘అన్నం పర బ్రహ్మ స్వరూపం’ అని ఎప్పుడూ చెప్పేది గుర్తుకొచ్చింది. ఎవరైనా అన్నం వథా చేస్తే గట్టిగా చీవాట్లు పెట్టేవాడు.
ఆయన భోజనం చేసేటప్పుడు కంచం పక్కన చిన్న పుల్ల, నీళ్ళ గిన్నె ఉంచుకునేవాడు. చుట్టూ రాలిన అన్నం మెతుకులను పుల్లతో తీసి నీళ్ళలో అద్ది మళ్ళీ కంచంలో వేసుకుని తినడం కళ్ళ ముందర కదలాడింది.
‘అయ్యో… హోటల్‌ కి వచ్చేవాళ్లు ప్లేట్ల చుట్టూ రాల్చిన, తిని మిగలబెట్టిన అన్నం మెతుకులు ఎంతోమంది కడుపులు నింపుతాయి కదా… ‘అన్నమో రామచంద్రా’ అనే దీనుల ప్రాణాలు నిలబెడుతుంది కదా…’ అని బాధపడ్డాడు.

”ఇక్కడ పెర్మినెంట్‌, గిర్మినెంట్‌ అంటూ ఏమీ ఉండవు. చేసినన్నాళ్లు చేయొచ్చు. పని చేసిన రోజులకి ఫుడ్డు, పైసలూ…”
”మీకు జ్వరమొచ్చి పనికి రాకపోతే… మీరు చేయాల్సిన పనులన్నీ ఎవరు చేస్తారు?” అని అమాయకంగా అడిగింది అరుంధతి.
”మెతుకులు చల్లితే కాకులకు కొదువా? మనం కాకపోతే ఎవరో ఒకర్ని పనిలో పెట్టుకుంటారు” అనిబదులిచ్చింది ఆదిలక్ష్మి.
”మా పాపకి మీ తాజా హోటల్‌ లో పాత్రలు కడిగే పని ఇవ్వండి సారూ..” అని దీనంగా అడిగింది ఓ యువతి.
ఆమె పక్కన పావడ, జాకెట్టు వేసిన పన్నెండేళ్ళ అరుంధతి నిలబడి ఉంది. గోడ మీద రాసిన ఆహార ధరల పట్టికను చూస్తూ ఉంది.
తన ఛాంబర్‌లోని రివాల్వింగ్‌ చైర్‌లో పేపర్‌ చదువుతున్న యజమాని మణికంఠ తల ఎత్తి చూశాడు.
”అదెలా సాధ్యం? మీ పాప మైనర్‌. ఈ వయసు వాళ్ళ చేత పని చేయిస్తే మమ్మల్ని జైల్లో వేస్తారు, హోటల్‌ మూసేస్తారు” మొహమాటం లేకుండా చెప్పాడు.
కన్నులార్పకుండా క్యాష్‌ కౌంటర్‌ టేబిల్‌ మీది ఆపిల్‌ పళ్ళ వైపే చూస్తోంది అరుంధతి.
చేతులు జోడిస్తూ… అరుంధతి అమ్మ ”మాకు నలుగురు ఆడపిల్లలు. సంసారం సాగించడం కష్టమవుతోంది సార్‌! మీలాంటి మనసున్న మారాజులు సహాయం చెయ్యకపోతే మాలాంటోళ్ళు బతికేది ఎట్లా? కొంచెం పెద్ద మనసుతో సాయం చేయండి సార్‌…” అని ప్రాధేయపడింది.
”ఈరోజు మీమీద మేం జాలి చూపిస్తే, రేపు మా మీద జాలి చూపే వాళ్ళెవరూ ఉండరు” అంటూ లేచి నిలబడ్డాడు మణికంఠ.
”మీ కాళ్ళు పట్టుకుంటాను సార్‌. కుదరదని చెప్పకండి…” తడి కళ్ళతో ప్రాధేయపడింది.
గోడ మీది దేవుళ్ళ ఫొటోల వైపు చూస్తూ ”సరే, రేపటి నుంచి పంపండి” అని చెప్పాడుమణికంఠ.
బయటికి వస్తూ ఉన్న అరుంధతి కళ్ళకి కాఫీ మేకర్‌ వద్ద ఉన్న చక్కెర గిన్నె కనబడింది. ఎవ్వరూ గమనించకుండా ఓ స్పూను చక్కెర తీసుకుని నోట్లో వేసుకుంది.
‘తప్పు… అలా చేయకూడదు’ అన్నట్లుగా ఉరిమి చూసింది తల్లి.
తనని కాదన్నట్లుగా దిక్కులు చూస్తూ తియ్యటి చక్కెర ముక్కల్ని చప్పరించింది అరుంధతి.
—-
తాజా హోటల్‌ చక్కటి భోజనానికి ప్రసిద్ధి. రుచికరమైన ఆహారాన్ని వేడివేడిగా అరటి ఆకుల్లో వడ్డించడం వారి ప్రత్యేకత. పట్టణంలో జనసమర్ధమున్న నాలుగు రోడ్ల కూడలిలో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది.
అంత పెద్ద హోటల్‌ లో తనకి పని దొరకడంతో రంగు పావడ, కొప్పు జాకెట్టు వేసుకుని నవ్వుకుంటూ వెళ్ళింది అరుంధతి.
వెనుక డోర్‌ నుంచి లోపలికి పనికి పంపారు.
వేడివేడి పెసరపప్పు పొంగలి వాసనలు ముక్కుకి మధురంగా తగిలాయి. తియ్యటి గుటకలు మింగింది అరుంధతి.
చాలా ఏండ్లుగా అక్కడే పని చేస్తున్న ఆదిలక్ష్మి వచ్చి ఎప్పుడు ఏ పని చేయాలో చెప్పడంతో పని ప్రారంభించింది అరుంధతి.
చేతికి చక్రాలున్నట్లుగా చకచకా పని చేయసాగింది. తనతో పాటు పని చేస్తున్న వాళ్ళ ద్వారా ‘నెలకి మూడు వేల జీతం, మధ్యాహ్నం ఫ్రీ మీల్స్‌’ అని తెలుసుకుంది. ‘ఫర్లేదు, మంచి జీతమే. అన్నం పెట్టి రోజుకు వంద రూపాయల సంపాదన…’ అని సంబరపడింది.
టీవీలో పాత తెలుగు సినిమా ప్రసారమవుతోంది.
మధ్యాహ్న భోజనం వేళయ్యింది.
పాత్రలు కడిగే వాళ్ళందరూ భోజనం తట్టలు చేతిలోకి తీసుకుని క్యూ లో నిలబడ్డారు.
మణికంఠ అటూఇటూ తిరుగుతున్నాడు.
తట్టలో కొన్ని నీళ్ళు ఉంటే, అరుంధతి దాన్ని కింద పారబోసింది.
‘క్యూ’ లో ముందర నిలబడి ఉన్న ఆదిలక్ష్మిని అడిగింది ”మీది పర్మినెంట్‌ ఉద్యోగమా?” అని.
”ఇక్కడ పెర్మినెంట్‌, గిర్మినెంట్‌ అంటూ ఏమీ ఉండవు. చేసినన్నాళ్లు చేయొచ్చు. పని చేసిన రోజులకి ఫుడ్డు, పైసలూ…”
”మీకు జ్వరమొచ్చి పనికి రాకపోతే… మీరు చేయాల్సిన పనులన్నీ ఎవరు చేస్తారు?” అని అమాయకంగా అడిగింది అరుంధతి.
”మెతుకులు చల్లితే కాకులకు కొదువా? మనం కాకపోతే ఎవరో ఒకర్ని పనిలో పెట్టుకుంటారు” అనిబదులిచ్చింది ఆదిలక్ష్మి.
‘నిజమే కదా… ఈ పెద్ద పట్టణంలో పనోళ్ళకు కరువా…’ అనుకుంది అరుంధతి.
కొద్దిసేపయ్యాక చిన్నగా అడిగింది అరుంధతి-”మనకు పెట్టేది ప్లేట్‌ మీల్సా? ఫుల్‌ మీల్సా?” అని.
ఆదిలక్ష్మి, అరుంధతిని ఎగాదిగా చూస్తూ ”పనికి కొత్త కదా నువ్వు… ఇక్కడ ప్లేట్‌ మీల్స్‌ ఉండదు. అందరికీ ఫుల్‌ మీల్సే. ఎంత తిన్నా, కాదనేవాళ్లెవ్వరూ ఉండరు” అని చెప్పింది.
అరుంధతి ”హై” అని ఒక్క ఎగురు ఎగిరింది. అందరూ తన వైపే చూడటంతో సర్దుకుని తనకి కావల్సినవన్నీ వడ్డించుకుని కడుపారా తిన్నది. ఎదురుగా అన్నపూర్ణాదేవి ఫొటో ఉంటే కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది.
తినడం పూర్తి అయ్యాక టేబిల్‌ మీద పెట్టి ఉన్న తియ్యటి పుత్తూరు వక్కపొడి పలుకులు నోట్లో వేసుకుంది. ‘భలేభలే’ అనుకుంది.
—-
కడుపు నిండా భోజనం దొరకడంతో రెండింతల ఉత్సాహంగా పని చేసేది. ఇద్దరి పని తనే చేయగలుగుతోందని పేరు తెచ్చుకుంది.
రాత్రిళ్ళలో ఇంటికి వెళ్ళాక తన చెల్లెళ్ళతో ఏ రోజుకారోజు హోటల్‌ లో జరిగిన విషయాలన్నీ కథలుకథలుగా చెప్పేది. భోజనంతో పాటు గడ్డ పెరుగు పెడతారని చెబితే వారు ఆశ్చర్యపోయేవారు. ఎంతో అదష్టం చేసి ఉంటే కానీ హోటళ్ళలో ఉద్యోగం దొరకదని గొప్పలు పోయేది. అది విన్న చిన్న చెల్లెలు ‘నాకు బిరియానీ హోటల్‌ లో ఉద్యోగం ఇప్పించు దేవుడా… ‘జ్యాం జ్యాం’ అని రోజూ చికెన్‌ పులుసు, చేపల పులుసు తినొచ్చు …’ అని మనసులోనే దేవుణ్ణి వేడుకుంది.
పనులన్నీ అయ్యాక చేతులు కడుక్కోడానికి వాసనొచ్చేలోషన్‌ ఇస్తారని చెప్పి ”కావాలంటే వాసన చూడండి” అని చెప్పి తన అర చేతులు వాళ్ళ ముక్కులకు తాకించింది అరుంధతి. ‘మనకెప్పుడు దొరుకుతుందబ్బా ఈ అదష్టం…’ అనుకునేవారు చెల్లెళ్ళు.
ఎప్పుడో ఒకరోజు తమని తీసుకెళ్ళి ఇడ్లీ దోశెలు తినిపించమని అడిగారు. మొదటి నెల జీతం వచ్చాక ఇంట్లో అందరినీ హోటల్‌ కి తప్పక తీసుకు వెళ్తానని చేతిలో చెయ్యేసి చెప్పింది.
—-
ఓ ఆదివారం నాడు- తట్టలు చేతిలో పెట్టుకుని వరుసగా నిలబడి ఉన్నారు వర్కర్లు. అందరికీ వెజిటబుల్‌ బిరియాని కొసరికొసరి వడ్డిస్తున్నారు. పక్కనే నిలబడ్డ మణికంఠ అందరికీ చిన్న గిన్నెల్లో పాయసం పోసి ఇస్తున్నాడు. బిరియాని, పాయసం చూసిన అరుంధతి ముఖం మిలమిలా మెరిసింది.
‘ఏ మెతుకు మీద ఎవరి పేరు రాసి ఉందో…’అని ఎవరి తట్టలో ఎంతెంత బిరియానీ పడుతోందో కండ్లు పెద్దవి చేసి చూసింది.
తన తట్టలో వేసిన పెద్ద అప్పడాన్ని పలపలమని విరిచి ‘కరుం కరుం’ అని నమిలి తింటోంది. అందరూ అరుంధతిని విచిత్రంగా చూస్తున్నారు.
పక్కనున్న ఆదిలక్ష్మి ఇలా అడిగింది ”బడికెళ్ళి బాగా చదువుకోకుండా పాత్రలు కడిగే పనికెందుకు వచ్చినావు?” అని.
‘ఇది కూడా తెలియదా…’ అన్నట్లుగా ఆమె వైపు చూసింది అరుంధతి.
”రోజూ నాకు అన్నం పెట్టి చదివించేంత కూలీ డబ్బులు మా అమ్మానాన్నలకు రాదు. మా ఇంట్లో నాతో పాటు ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. మా అందరికీ కడుపారా అన్నం ఎక్కడి నుంచి తెచ్చి పెడ్తారు?” అని ఎదురు ప్రశ్న వేసింది.
”అదేమిటే, అలా చెబుతావు? మీ ఇంట్లో వాళ్ళకంటే అంత స్తోమత లేదు నిజమే.. అయితే గవర్నమెంట్‌ వాళ్ళు బడిలో మధ్యాహ్న భోజనం పుష్టిగా పెడతారు కదా, కోడిగుడ్డుతో సహా!” అని అడిగింది.
”నిజమే అక్కా! బడి ఉంటే భోజనం పెడతారు. ఆదివారాల్లో, శెలవు దినాల్లో పెట్టరు కదా. అందుకే పనిలో చేరా… డబ్బుకి డబ్బు… తిండికి తిండి..” నవ్వుతూ బదులిచ్చింది.
‘అన్నం దొరకబోతుందా…’ అని అల్లాడే అరుంధతి మాటలకు ‘ఆ’ అని నోరు తెరిచింది ఆదిలక్ష్మి.
అక్కడే ఉండి అంతా విన్న మణికంఠ మనసు చిన్నగా మూలిగింది.
‘విద్యాభివద్ధికి ఎంతో చేస్తున్న ప్రభుత్వం, శెలవుదినాల్లో కూడా పిల్లలకు పిడికెడు అన్నం పెడితే బాగుంటుంది కదా! లేకుంటే పిల్లలు ఇలా చిన్నచిన్న పనుల్లో చేరి మంచి భవిష్యత్తు నాశనం చేసుకుంటారు కదా. ఈ ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలేదో…’ అనుకున్నాడు.
లీలగా… తన నాన్న ‘అన్నం పర బ్రహ్మ స్వరూపం’ అని ఎప్పుడూ చెప్పేది గుర్తుకొచ్చింది. ఎవరైనా అన్నం వథా చేస్తే గట్టిగా చీవాట్లు పెట్టేవాడు.
ఆయన భోజనం చేసేటప్పుడు కంచం పక్కన చిన్న పుల్ల, నీళ్ళ గిన్నె ఉంచుకునేవాడు. చుట్టూ రాలిన అన్నం మెతుకులను పుల్లతో తీసి నీళ్ళలో అద్ది మళ్ళీ కంచంలో వేసుకుని తినడం కళ్ళ ముందర కదలాడింది.
‘అయ్యో… హోటల్‌ కి వచ్చేవాళ్లు ప్లేట్ల చుట్టూ రాల్చిన, తిని మిగలబెట్టిన అన్నం మెతుకులు ఎంతోమంది కడుపులు నింపుతాయి కదా… ‘అన్నమో రామచంద్రా’ అనే దీనుల ప్రాణాలు నిలబెడుతుంది కదా…’ అని బాధపడ్డాడు.
వెంటనే… మిగిలిన అన్నాన్ని కాలువల్లో పడవేయవద్దని వర్కర్లకి చెప్పాడు. ఇకపై దాన్ని గంపల్లో వేసి గుడుల వద్ద ఉండే భిక్షగాళ్ళకు పంచమని గట్టిగా చెప్పాడు.
—-
సాయంత్రమయ్యింది.
అరుంధతి అమ్మను మణికంఠ హోటల్‌ కి పిలిపించాడు.
”ఈ పాపను బడికి పంపించండి. లీవుల్లో, ఖాళీ సమయాల్లో వచ్చి పని చేయమనండి. పని చేసినదానికి డబ్బులిస్తాను. భోజనం అంటారా…అరుంధతి ఎప్పుడైనా వచ్చి తిని వెళ్ళొచ్చు.. బడికి పంపడం మాత్రం ఆపకండి” అని చెప్పి పంపాడు.
—-
మరుసటి రోజు ఉదయం-
యూనిఫారం వేసుకుని చెంగు చెంగుమని ఎగురుకుంటూ బడికి వెళ్తోంది అరుంధతి. హోటల్‌ లో ఉన్న మణికంఠ, అరుంధతిని చూసి గబగబా బయటికి వచ్చి ఓ ఆపిల్‌ పండును చేతికిచ్చాడు.
పండును కొరికి తింటూ సంతోషంగా బడి వైపు అడుగులేసింది అరుంధతి.
– ఆర్‌.సి.కష్ణస్వామి రాజు, 9393662821

Spread the love