సృజనాత్మకత తాత్వికత గుల్జార్

Creativity Philosophy Gulzarగుల్జార్‌ 1936, ఆగష్టు 18 న ప్రస్తుత పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న జీలం జిల్లా ‘దీన’ పట్టణం లోని సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంత్యాక్షరీ ఆడడంలో ఆసక్తి ఉన్న గుల్జార్‌ అప్పటినుండే భాష పట్ల, పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. దీనికితోడు హిందుస్తానీ సంగీతం పట్ల ఉన్న ఆసక్తి తో గుల్జార్‌ ”రవిశంకర్‌, అలీ అక్బర్‌ ఖాన్‌” ల కచేరీలకు వెళ్ళేవాడు. అయితే గుల్జార్‌ కుటుంబం దేశ విభజన తరువాత సొంత వూరు విడిచి అమృత్‌సర్‌ కి వలస వచ్చింది. పదమూడేళ్ళ వయస్సులోనే అక్కడ తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్‌ షాప్‌ లో పనిచేశారు. పుస్తకాలు చదవడంలో ఆసక్తి కలిగిన గుల్జార్‌ సమీపంలో ఉన్న బుక్‌స్టాల్‌ నుండి అపరాద పరిశోధక నవలలు, మాజిక్‌ ఫాంటసీ రచనల్ని అద్దెకు తెచ్చుకుని చదివేవాడు. అక్కడ వారానికి ఇంత అని నిర్ణయించిన రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది. దాంతో గుల్జార్‌ షాప్‌లో పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు, మూడు పుస్తకాలు తెచ్చుకుని చదవడం చేసేవాడు. అయితే కొన్ని రోజులకు ఆ షాప్‌లోని పుస్తకాలు దాదాపుగా అయిపోవడంతో బుక్‌ స్టాల్‌ యజమాని ఇట్లా ఎన్ని పుస్తకాలు చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. అది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన ‘గార్డనర్‌’. ఆ బుక్‌ చదివిన తర్వాత గుల్జార్‌లో పుస్తకాలు చదివే దృక్పథమే మారిపోయింది. తర్వాత ఠాగూర్‌ గొప్పతనానికి పునాది వేసిన చాలా అనువాదాలను చదవడంతో పాటు ప్రేమ్‌చంద్‌ తదితర గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. అప్పుడే గుల్జార్‌ కు (ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌) ప్రగతిశీల రచయితల కళాకారులతో పరిచయం కలగడం, వారు నిర్వహించే కార్యక్రమాలల్లో పాల్గొనడం చేసేవాడు. దీంతో ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి కలగడం ఆరంభమయింది. ఆ సమయంలో తన స్నేహితుడైన శైలేంద్ర గుల్జార్‌ లోని ఆసక్తిని గమనించి ‘బందిని’ చిత్రాన్ని నిర్మిస్తున్న బిమల్‌రారు వద్దకు వెళ్ళి కలవమని చెప్పడం, బిమల్‌రారు మొదటి సినిమా పాట రాసే అవకాశం ఇవ్వడం ద్వారా గుల్జార్‌ సినీరంగ ప్రవేశం చేశాడు.
కొందరు అతన్ని అత్యంత ప్రసిద్ధ కవి అని పిలుస్తారు, కొందరు అతన్ని గొప్ప గీత రచయిత అని పిలుస్తారు, మరికొందరు అతని స్క్రిప్ట్‌ రైటింగ్‌ నైపుణ్యాన్ని హైలైట్‌ చేస్తారు. నిస్సందేహంగా గుల్జార్‌ గొప్ప రచయిత, కవి, సినీ గేయ రచయిత, సినీ దర్శకుడు కూడా. గుల్జార్‌ రచనలు, సినిమాలు, గజల్స్‌ అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ ఉండి ఆయనలోని సున్నితత్వాన్ని సరళత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇలా వివిధ రంగాల్లో తనదైన ముద్రను చాటుకున్న గుల్జార్‌ ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల అనువాద రచనలో కూడా ఉన్నతమయిన కృషి చేస్తున్నాడు. ఆగస్ట్‌ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్‌ లో వున్న జీలం జిల్లా దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించిన గుల్జార్‌ అసలు పేరు సంపూర్ణసింగ్‌ కల్రా. గుల్జార్‌ అన్నది ఆయన కలం పేరు. ఆ పేరుతోనే దేశవ్యాప్తంగా సాహిత్యాభిమానులను మురిపించారు. ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్‌ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడుతాడు. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ చిత్రంలో గుల్జార్‌ రాసిన ‘జై హో’ గీతం ప్రపంచ వ్యాప్తంగా సంగీతప్రియులను ఎంతగానో అలరించడమే కాకుండా, ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆస్కార్‌ అవార్డు’ను గెలుచుకుని గుల్జార్‌ ఆస్కార్‌ అందుకున్న తొలి భారతీయునిగా చరిత్రలో నిలిచాడు. ఎ.ఆర్‌. రహమాన్‌ బాణీల్లో రూపొంది ఈ అవార్డును అందుకున్నారు. ఇక గుల్జార్‌ కలం నుండి జాలువారిన పాటలు ఐదు నేషనల్‌ అవార్డ్స్‌, 22 ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ సొంతం చేసుకున్న గుల్జార్‌ ఆగస్టు 18 న 87వ వసంతంలోకి అడుగుపెదుతున్న సందర్భంగా నవతెలంగాణ ”సోపతి” పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.

సినీ గేయ రచయితగా
బిమల్‌రారు దర్శకత్వంలో రూపొందుతున్న ‘బందిని’ చిత్రానికి ”మేర గోరా అంగ లయిలే..” అనే తొలి పాటతో గేయ రచనకు శ్రీకారం చుట్టి సినీ గేయ రచయితగా గుల్జార్‌ ఆరంగ్రేటం చేశాడు. ఈ చిత్రం విజయవంతం కావడంతో బిమల్‌రారు కోరిక మేరకు మెకానిక్‌ షాప్‌కు వెళ్ళకుండా గేయ రచనల పైన దృష్టి సారించిన గుల్జార్‌ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించి బిమల్‌రారు వద్ద పూర్తి స్థాయి సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హృషికేష్‌ ముఖర్జీ, అసిత్‌ కుమార్‌ సేన్‌ వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు రచనను అందించాడు. అసిత్‌ సేన్‌కు 1968లో ‘దో దూని చార్‌’, 1969లో ‘ఖామోషి’, 1970లో ‘సఫర్‌’ చిత్రాలకు, హృషికేష్‌ ముఖర్జీకి 1970లో ‘ఆనంద్‌’, 1971లో ‘గుడ్డీ’, 1972లో ‘బావర్చి’, 1973లో ‘నమక్‌ హరం’ చిత్రాలకు సంభాషణలు రాసాడు. గేయ రచయితగా 100 కు పైగా చిత్రాలకు పాటలు రాసిన గుల్జార్‌ ప్రస్థానం ‘బందిని’ తో మొదలయి ”సలిల్‌ చౌదరి, ఎస్‌.డి.బర్మన్‌, ఆర్‌.డి.బర్మన్‌, మదన్మోహన్‌, విశాల్‌ భరద్వాజ్‌, ఎ.ఆర్‌. రెహమాన్‌” తదితర ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది.
దర్శకుడుగా..
గుల్జార్‌ గురించి, ఆయన పాటల గురించి భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. గుల్జార్‌ 1971లో ‘మేరే అప్నే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తపన్‌ సిన్హా ”అపంజన్‌” ఆధారంగా, నిరుద్యోగులు, నిరాశకు గురైన యువకుల రెండు వీధి ముఠాల మధ్య చిక్కుకున్న వృద్ధురాలి కథాంశంతో ఈ చిత్రం రూపొందించబడింది. తర్వాత 1972 లో ‘పరిచరు’, ‘కోశిష్‌’ చిత్రాలను రూపొందించాడు. మానవీయ దృక్పధంతో వచ్చిన ‘కోశిష్‌’ చిత్రంలో ప్రధాన భూమికల్ని పోషించిన సంజీవ్‌ కుమార్‌, జయభాధురి ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ లాగా అత్యంత సహజంగా నటించారు. ఈ చిత్రంలో మూగ చెవిటి వాళ్ళ జీవితం, వారు ఎదుర్కొన్న సమస్యలను గుల్జార్‌ చక్కగా చూపించాడు. ఈ చిత్రం తర్వాత సంజీవ్‌ కుమార్‌ తో ఏర్పడిన స్నేహం అనేక చిత్రాల నిర్మాణానికి తోడ్పడింది. వీరిద్దరి భాగస్వామ్యంలో 1975 లో వచ్చిన ”మౌసం, ఆంధీ”, 1982 లో ”అంగూర్‌, నామ్‌కీన్‌” చిత్రాలు క్లాసిక్‌ గా నిలిచి, సంజీవ్‌ కుమార్‌కు నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చి పెట్టాయి. జితేంద్రతో ”పరిచరు, ఖుష్బు, కినారా”, వినోద్‌ ఖన్నాతో ”అచానక్‌, మీరా, లేకిన్‌”, హేమామాలిని తో ఖుష్బు, కినారా, మీరా” లాంటి విజయవంతమయిన చిత్రాలను రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్‌ ”కితాబ్‌, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్‌, సునేయే, ఆల్కా, ఇజాజత్‌, లిబాస్‌, మాచిస్‌, హు తూ.. తూ” లాంటి సినిమాలు రూపొందించాడు. 1999 లో వచ్చిన గుల్జార్‌ చివరి చిత్రం ‘హు తూ.. తూ’ ఫెయిల్‌ అయినప్పటికీ, 1988 లో వచ్చిన టెలివిజన్‌ చిత్రం ”మీర్జా గాలిబ్‌” సీరియల్‌ ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది భారతీయ టెలివిజన్‌ చరిత్ర లో మైలురాయిగా నిలిచింది. కవి మీర్జా గాలిబ్‌ జీవితం పై రూపొందించబడిన ఈ సీరియల్‌ ‘నసీరుద్దీన్‌ షా’ టైటిల్‌ రోల్‌ పోషించగా, గాయకుడిగా జగ్‌ జీత్‌ సింగ్‌ లు లో తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్‌ భావుకత, నిబద్దత ప్రధాన పాత్రను పోషించాయి. గుల్జార్‌ ”అమ్జాద్‌ ఖాన్‌, పండిట్‌ భీంసేన్‌ జోషి” పై డాక్యుమెంటరీలతో పాటు మీనా కుమారి ఆధారంగా రూపొందించిన ”షైరా” చిత్రానికి దర్శకత్వం వహించాడు.
గుల్జార్‌ కవిత్వం
ఉర్దూ, పంజాబీ భాషలలో కవిత్వం రాసే గుల్జార్‌ బ్రజ్‌ భాషా, ఖరీబోలి, హర్యాన్వి, మార్వారీ వంటి అనేక ఇతర భాషలతో పాటు, ఆయన కవిత్వం త్రివేణి తరహా చరణంలో ఉంటుంది. గుల్జార్‌ కవితలు మూడు సంకలనాల్లో ప్రచురించబడ్డాయి. అవే… ”చాంద్‌ పుఖరాజ్‌ కా, రాత్‌ పష్మినీ కి, పంద్రాV్‌ా పాంచ్‌ పచత్తర్‌.” అతని చిన్న కథలు ‘రావి-పార్‌’ (పాకిస్తాన్‌లో దుస్త్‌ఖాట్‌ అని కూడా పిలుస్తారు) ధువాన్‌లో ప్రచురించబడ్డాయి. ఉదారవాద కవి అయిన గుల్జార్‌ ఉర్దూ కథా సంకలనం ధువాన్‌కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భారతదేశం, పాకిస్థాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్తంగా ప్రారంభించిన శాంతి ప్రచారం కోసం, గుల్జార్‌ ”నాజర్‌ మైన్‌ రెహ్తే హౌ” అనే గీతాన్ని రాసాడు. దీనిని శంకర్‌ మహదేవన్‌, రహత్‌ ఫతే అలీ ఖాన్‌ రికార్డ్‌ చేశారు. గుల్జార్‌ గజల్‌ మాస్ట్రో జగ్జిత్‌ సింగ్‌ ఆల్బమ్‌లు ”మరాసిమ్‌”, ”కోయి బాత్‌ చలే” కోసం గుల్జార్‌ గజల్స్‌ రాసాడు.
మీనా కుమారి మరణించిన తరువాత ఆమె రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చు వేశాడు. వీటిని తను మరణించిన తరువాత అచ్చువేయాలని ఆమె తనకు సన్నిహితుడైన గుల్జార్‌ను కోరింది. ప్రముఖ మరాఠీ రచయిత అమృతా ప్రీతమ్‌ రచనలకు కూడా గుల్జార్‌ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్‌ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక నజ్మ్‌ (హైకూ)రాసే కొత్త పద్ధతికి గుల్జార్‌ శ్రీకారం చుట్టాడు.
గుల్జ్జార్‌ రాసిన రచనలు భారతీయ హిందీ, ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి. ఆయన రవీంద్రనాథ్‌ రచనల్ని అనేకం అనువాదం చేసారు. సస్పెక్టే డ్‌ పోయెమ్స్‌, జిందగీ నామా, హాఫ్‌ ఎ రూపీ, సేలేక్తేడ్‌ పోయెమ్స్‌, 100 లిరిక్స్‌, మేరా కుచ్‌ సమ్మాన్‌, సైలేన్సేస్‌, టూ లాంటి ఎన్నో రచనలు పాఠకుల ప్రశంసలను అందుకున్నాయి.
వ్యక్తిగత జీవితం
గుల్జార్‌ ఆనాటి అందాల నటి రాఖీని వివాహమాడాడు. ఈ దంపతులకు ”మేఘనా గుల్జార్‌” అనే కుమార్తె జన్మించింది. మేఘన పుట్టిన ఒక సంవత్సరం తర్వాత, రాఖీ, గుల్జార్‌ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి తర్వాత రాఖీ నటనకు స్వస్తి చెప్పాలని గుల్జార్‌ భావించడమే అందుకు కారణం. అయినప్పటికీ, ఆమె చాలా సంవత్సరాలు అతనిని ఒప్పించడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో రాఖీ ఎన్నో స్క్రిప్ట్‌లను సైతం తిరస్కరించింది. చివరకు యష్‌ చోప్రా చిత్రం ”కభీ కభీ”కి సంతకం చేయడం ద్వారా గుల్జార్‌తో ఆమె వివాహ సంబంధానికి గుడ్‌ బై చెప్పింది. అయితే కుమార్తె మేఘన వారి విడిపోవడాన్ని అంగీకరించలేదు. అందుకే వారు విడాకులు తీసుకోలేదు. మేఘనా గుల్జార్‌ సైతం తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకురాలిగా మారారు. మేఘనా న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్‌ మేకింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత, ఆమె ”ఫిల్హాల్‌, తల్వార్‌, రాజీ, ఛపాక్‌” వంటి చిత్రాలతో తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నారు. 2004లో ఆమె తండ్రి గుల్జార్‌ జీవిత చరిత్రను ‘బకాస్‌ హి ఈస్‌’ పేరుతో రచించింది.
పురస్కారాలు
హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్‌ 1999 లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నుండి రాష్ట్రీయ కిషోర్‌ కుమార్‌ సమ్మాన్‌ అవార్డు, 2002లో ఉర్దూ కథా సంకలనం ధువా కు ‘సాహిత్య అకాడమీ అవార్డు’ను, 2004 లో భారత ప్రభుత్వపు ‘పద్మభూషణ్‌’ పురస్కారాన్ని పొందాడు. 2009 లో ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్‌ అవార్డు’ను బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో పొందాడు. 2010 లో గ్రామీ అవార్డు, 2012లో ‘ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం’ అందుకున్న గుల్జార్‌, 2013 లో ‘అస్సాం యూనివర్సిటీకి ఛాన్సలర్‌’ గా నియమితులయ్యాడు. 2013లో ‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం’, 2014లో ‘హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ’ నుండి గుల్జార్‌ ‘డాక్టరేట్‌’ అందుకున్నాడు. వీటితో పాటు గుల్జార్‌ కలం నుండి జాలువారిన 5 పాటలకు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆయనను 22 ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ వరించాయి.
1970-80ల మద్య కాలంలో హింసాత్మక చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో గుల్జార్‌ సినిమాలు, సున్నితమైన, సాహిత్యం విజయవంతమయ్యాయి. ఇప్పటికీ తన దరి చేరిన అవకాశాల్లో సాహితీ విలువలు వీడకుండా వీనులకు ఆనందం పంచే పాటలు రాస్తున్నారు గుల్జార్‌. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్‌ ‘బంటీ ఆర్‌ బబ్లూ’ చిత్రంలో ‘కజరారే..’, దిల్‌ సే చిత్రంలో ”చయ్య చయ్య చయ్యా” వంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
ఆస్కార్‌ అందుకున్న గుల్జార్‌
దర్శకుడిగా, రచయితగా, లిరిసిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుకున్న గుల్జార్‌.. 2009 లో ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ సినిమాకి గాను బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. ”జయహో” సాంగ్‌ లిరిక్స్‌కి గాను ఆయన ఆస్కార్‌ గెలిచారు.
సంస్కృత ప్రభావం నుండి తెలుగు భాష తప్పించుకోలేనట్టే, ఉర్దూ పదాలు లేకుండా హిందీ భాష శోభించదు. ఈ విషయం తెలిసిన వారు ఉర్దూను అందంగా, హిందీ సాహిత్యంలో చొప్పిస్తున్నారు. ఇలా ఎంతో మంది హిందీ చిత్ర గీతరచయితలు ఉర్దూ పదాలు చొప్పిస్తున్నారు. అయితే వారిలో గుల్జార్‌ బాణీ ప్రత్యేకమైనది. ఆయన కేవలం పాటలతోనే కాకుండా, మాటలతోనూ మురిపించి.. కథకునిగానూ కట్టపడేసి, దర్శకత్వంలోనూ రాణించారు.

Spread the love