హైదరాబాద్ లో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. 2024, మే 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం బీభత్సం చేసింది. ఈదురు గాలులతో వర్షం పడింది. గాలుల తీవ్రతకు రోడ్లపై ఉన్న చిన్న చిన్న దుకాణాలపై ఉన్న కవర్లు ఎగిరిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు కూలిపోయాయి. హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, చందానగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ప్రగతినగర్, నిజాంపేట, శేరిలింగంపల్లి, కీసర, ఘట్ కేసరి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. బీభత్సం చేసింది. ఇక సికింద్రాబాద్ ఏరియాలోనూ భారీ వర్షం పడుతుంది. బేగంపేట, రాణిగంజ్, పద్మారావు నగర్, మారేడ్ పల్లి, బోయినపల్లి ఏరియాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. హైదరాబాద్ సిటీలో భారీ వర్షంతో.. ట్రాఫిక్ జాం అయ్యింది. చాలా చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపై ఆగిపోయాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వందలాది వాహనాలు ఆగిపోయాయి. దీనికితోడు భారీ వర్షం కావటంతో.. రోడ్లపై నీళ్లు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు రావటంతో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి.

Spread the love