ముత్యాలమ్మకు బోనం

‘అగడుబడ్ద ముత్తేలమ్మ మొగడ్ని మింగిందంట’ అని ఆత్రగాళ్లని మోటుశాస్త్రంతో పోలుస్తూ అనేది మా అమ్మమ్మ. కానీ ‘ముత్తేలమ్మ మయిమ గల్ల తల్లి’ అని కొనియాడేది.
కలిగినోల్లు అన్ని పండుగల్ని జరుపుకుంటుంటే మేం వాళ్ళ పిండివంటల మొకాల్ని చూస్తూ పండుగని పక్కకు జరుపుకునేవాళ్ళం. కానీ ముత్యాలమ్మ పండుగకు ఏ ఇల్లూ వెనుకాడేదే ల్యా.
‘వారప్పోయటానికి కల్లు సీస త్యాపో’, ‘కోడి పుంజుని త్యాపో’, ‘నయ్యేజ్యానికి పులగమొండాల, పెసరపప్పు గావాల, నేతిబొట్టు గావాల’, ‘ఇడుపున బెట్టటానికి, బోణానికి సుట్టటానికి కోడి కాలికి గట్టటానికి శెట్టెక్కి యాప మండలు ఇరస్కరాపో’, ‘అగో గా ఉతికిన తువ్వాలు దీస్కోని సుట్టకుదురు జేసి నెత్తిన బెట్టుకొని బోణం నిలుపుకో’, ‘ఇంట్లనుంచి బైలెల్లి బయిటికి రాంగనే ఇగో నువ్వొచ్చి గా బిందెడు నీళ్ళు కళ్లకి బొయ్యి’ అత్తలు, అమ్మలు, పెళ్ళాలు, మొగుళ్ళ హడావుడి ఇగో ఇంత ఉండేది మా వాడకట్టులో. అలా ముత్యాలమ్మ పండుగ ప్రకటనలు ఆదేశాలు జారీ అవుతుంటే మేం ఉరుక్కుంటపోయి ఆ పనులు చేసేటోళ్లం. మహత్తు దేవీ దేవతలకు ఉందో లేదో గానీ పండుగలకు మహత్యం ఉందని మేం సాక్ష్యం పలికేవాళ్లం. పండుగ మా ఒంటిమీద చినిగిన బట్టల్ని మాయం చేసి కలరా ఉండలవాసనల కొత్త లాగూ, అంగీల్ని తొడిగేది. అందుకే పండుగలు పిల్లలకు సంతోషానందాలు కలిగించే స్నేహితులు. పెద్దలకు ఖర్చులు పెట్టించే చుట్టాలు. మొదటివారం చాకలోళ్లు ప్రారంభించాక మరుసటి వారం నుంచి మొదలయ్యేవి మా వాడకట్టులో శ్రావణ బోణాలు. ఏటా ఆషాఢం పూర్తయ్యాకనే ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించటం ఆనవాయితీ.
చర్చ్‌ కాంపౌండ్‌ లో ఇంకా వేరే ప్రాంతాల్లో స్థానిక ముత్యాలమ్మలు ఉంటే ఉండొచ్చుగానీ, ఊరికి దక్షిణ సరిహద్దు మా ముత్యాలమ్మ. పట్టణం ఏర్పడినప్పుడు శాంతికోసం సరిహద్దు దేవతల్ని ఏర్పాటు చేశారంట. అలా దక్షిణ దిక్పాలికగా పొలిమేర ముత్యాలమ్మ తల్లి నియమించబడింది. గుడి నిర్వహణ అంతా చాకలులదే. భక్తుల నుదుటిన బండారు బొట్టు పెట్టే పూజారులూ వాళ్ళే. బలిచ్చేదీ వాళ్ళే. ‘భద్రక్కా ఇంగో కొబ్బరి చిప్పలు’ అంటూ గుడి పూజారిణి, చాకలోళ్ల మంగమ్మ మా అమ్మమ్మకు తెచ్చిచ్చేది. అమ్మమ్మది ఇడ్లీ హోటల్‌ కనుక చట్నీలో వేసేందుకు వాటిని వాళ్ల నుంచి కొనుగోలు చేసేది. వందేళ్లకు పైబడి ముత్యాలమ్మ గుడి పక్కనే శిలువకు వేళాడుతూ త్యాగ పూరిత శాంతి గీతం ప్రభోదిస్తున్నాడు ఏసయ్య. ఆయనకు సమీప దూరానే మసీదు బోధ.. సర్వ మతాల సమ్మిళిత కూడలి చర్చ్‌ కాంపౌండ్‌. ‘ఎయ్యిగండ్ల (వెయ్యి కళ్లు) తల్లి అమ్మకు బోణం జేస్తె పిల్లాపాప, గొడ్డుగోద సల్లంగుంటరు’ అని ప్రతి ఒక్కరూ నమ్మేవాళ్లు.
1980 దశకం చివరిదాక జనాలది పేద ముఖం, వాళ్ల ఇళ్లది సంప్రదాయ రూపం. దాదాపు మా వీధిలో అన్నీ మట్టి ఇళ్లే, వాటి ప్రహరీ గోడలు ఇంటికన్నా ఎత్తులో ఉండేవి. అవీ మట్టిగోడలే. కష్టాలు, కన్నీళ్ళు విని వినీ, చూసి చూసీ ముఖాలు మాసిపోయి ఏడ్చినట్టుండే ఇళ్లకు పండుగొచ్చినా పబ్బమొచ్చినా నవ్వు ముఖమొచ్చేది. సమాధి మట్టిని తవ్వితే చరిత్ర అస్థిపంజరమై మాట్లాడుతుంది. మా వాడకట్టులో ఇప్పటికీ ఉన్న అప్పటి ఇళ్లని కదిలిస్తే ఆ కాలం ఆకారం కళ్లముందుకొస్తుంది. ఒడ్డున మొలిచే గడ్దిపరకలు పేదలు, ఆధునిక ప్రవాహంలో కొట్టుకు పోలేరు. కుమ్మరి బజార్‌, మాదిగ బజార్‌, కంచరి బజార్‌, అంబా భవాని గుడి వీధి, రిక్కా బజార్‌ తదితర చోట్ల వెనుకటి కాలాన్ని ఇప్పటికీ చూడొచ్చు. మట్టి గోడలు, మట్టి అలుకులు, గూన పెంకులు ఇంకా అవే ఇళ్లు. రూపాయనోటు చిల్లరగా చింపుకున్నట్టు ఉన్న జాగనే అరలు చేసుకుంటారు. మట్టిలో పడ్డ విత్తనం మరో పది విత్తనాలను మొలిస్తుంది కానీ, పేదల స్థలం మట్టిలోనే ఉన్నా మరికొన్ని స్థలాలను మొలిపించలేక పోతోంది. చచ్చువిత్తనంలా పెదోళ్ల స్థలానిది చచ్చుతనం.
రాత్రుళ్ళలో వానొచ్చి ఇంటోళ్ళ కష్టాల్ని కతలుగా వినేది. గూన పెంకుల ఇళ్ళు అక్కడక్కడ కురుస్తుండేవి. ఉన్నవి ఒకటో రొండో గదులు కనుక కురుస్తూ దగ్గరయ్యే చినుకుల వల్ల నిద్రకు దూరం అయ్యేవాళ్ళు. పగటి పూట చినుకులు ఎక్కడ పడుతున్నాయో గమనించి ఇళ్ళల్లోని వంట పాత్రలు పట్టేవాళ్ళు. ఎక్కువ చోట్ల కురిసే ఇళ్లల్లో చెంబులు, గ్లాసులు, వంట పాత్రలూ పెట్టేటోళ్ళు. అట్లా కురిసే గూన పెంకుల్ని కప్పేందుకు పనివాళ్ళు మా వీధిలోనే ఉండేవాళ్ళు. గడ్డం వాళ్ల ఇంటిముందు పెంకుటింట్లో సత్యం, రామారావ్‌ అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేటోళ్ళు. వానాకాలం మొదలవ్వ బోతుందనగానే జనం గత వానల అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఇళ్ళు కప్పించుకునేటోళ్ళూ. పతంగులు చిక్కుకున్నవని, ఆటవస్తువులు ఇంటిమీద పడ్డాయని పిల్లలు ఇంట్లోవాళ్లకు తెలియకుండ ఎక్కినప్పుడు పెంకలు నలిగి పగిలేవి. కోతులు అటు ఇటు దూకి, పక్షుల కాళ్లు తగిలి, చెల్లా చెదురయ్యేటివి. అలాంటి పెంకల్ని తీసి వెదురు బద్దల్ని, వాసాల్ని ఊడ్చి శుభ్రం చేశాక, తీసిన పెంకల్ని తిరిగి అమర్చేవాళ్ళు. పగిలిపోయిన వాటి స్థానంలో కొత్తవి పెట్టేవాళ్ళు. ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళి కప్పేటోళ్లు. అవసరమయ్యే కొత్త పెంకలు వాళ్ల వద్దే సిద్ధంగా ఉండేటివి. మా వీధికే కాక ఇతర వీధుల వాళ్ళు కూడా వొచ్చి వాళ్లను పిలుచుకుపోయేటోళ్లు. పెంకల్ని ఏటా కప్పించలేక విసిగిన జనం, క్రమంగా ఇనుప, సిమెంటు రేకులకు మళ్ళటంతో ఇల్లు కప్పే అన్నదమ్ములు పంచదార చిలుకల తయారీ వ్యాపారానికి మళ్ళారు. పంచదారను పెద్ద కళాయిల్లో పాకం పట్టి పలు రకాల పక్షుల ఆకారాల అచ్చుల్లోపోసి ఆకుపచ్చ, పసుపుపచ్చ, గులాబీ, తెలుపు రంగుల్లో తయారు చేసి తోపుడు బండ్లపై తీసుకెళ్లి అమ్మేవాళ్ళు.
పండుగల వారం పది రోజుల ముందే వీధుల్లో నాయక్‌లు, లచ్చిమిల సందడి కనిపించేది. తురకల మహిళలను బూబమ్మా అని సంబోధించినట్టు లంబాడీ మగవాళ్లను నాయకా అని, వాళ్ల ఆడోళ్లను లచ్చిమీ అని జనం హక్కుగా పిలిచేటోళ్లు. వాళ్ళ ఎడ్లబళ్ల ఇరుసు పట్టాల చప్పుళ్లు, మట్టి రోడ్లపై వాళ్ల సంస్కృతి ఆనవాళ్లను ముద్రించేవి. ‘ఎర్రమట్టే’.. అని అరుస్తూ తమదైన యాస ప్రత్యేకత కనబరిచేవాళ్లు. తండా దాటొచ్చిన పశువులకు పట్నం చూపిస్తున్నట్టుగా నాయక్‌లు బండిదిగి ఎడ్ల మెడలో పలుపు పట్టుకొని నడిచేవాళ్లు. బండి తొట్టిలో మహిళలు ఉండి ఎర్ర మట్టిని తట్టలుగా, బొచ్చెలుగా అమ్మేవాళ్లు. ఎర్ర మట్టి ఒక్కటే కాదు, గనుసుగడ్డలు, ఉల్లిగడ్డలు అలాగే అమ్మేవాళ్లు. లంబాడీలు తోలుకొచ్చేవన్నీ ఎరుపే, వాళ్ల ముఖాలూ ఎరుపే. బండి జల్ల గనుసుగడ్డ అయినప్పుడు మేం ఉసిళ్లమై వెంట తగిలేవాళ్లం. వాళ్లు రేగుకంప అడ్డం పెట్టుకునేటోళ్లు.
ఎర్రమట్టి, పేడా కలిపి ఒకరోజు నానబోసి తెల్లారి ఇళ్ల గదుల్లో నేలను అలికేవాళ్లు. అలికే ముందుగా అంతకు ముందు అలుకుల బేడిసలను చిట్లగొట్టి పారేసేవాళ్లు. నేల మరొక అలుకుకు దగ్గరవుతోందంటే క్రితం అలుకు చిట్లిపోయి బేడిసలెత్తేది. త్వరగా చిట్లకుండా దట్టంగ కాకుండ పలుచగా అలికేవాళ్లు.. మందపాటి పాతగుడ్డల్ని మట్టిలో ముంచి అలికేందుకు వాడేవాళ్లు దీనిని పిడస అనేవాళ్లు.. గదుల లోపలేకాక వీధి గోడలనూ ఎర్ర మట్టితో అలికి వాటిపై సున్నం తో తెల్లగా నిలువు గీతలు అలంకరించేవాళ్లు. బెత్తెడు వెడల్పున ఉండే ఈ గీతల్ని పట్తెడలు అనేవాళ్లు. గదుల్లో కూడా నాము ఉండలు నానేసి తెల్ల ముగ్గులతో అలంకరించేవాళ్లు. ఎర్ర మట్టి, తెల్ల సున్నం ఇంటికి పండుగ కళ తెచ్చేది.
ఆ రోజుల్లో చిన్నపిల్లల ఒంటిమీద చెమట పొక్కులు లాంటివి ఒళ్లంతా వ్యాపించి పుండ్లుగా మారి మచ్చలుపడెవి. పిల్లలకే కాక పాడి పశువులు పాలివ్వకపోవటం, వ్యాధులకు గురికావటం కూడా ముత్యాలమ్మ మాయే అని నమ్మేవాళ్లు. పిల్లల ఒంటికి వేపాకు, పసుపు రుబ్బి పూసేవాళ్ళు. పశువులకు మంత్రాలు పెట్టించేవాళ్లు. కానీ వీటన్నిటికీ కారణం ముత్యాలమ్మ బోణం చెయ్యకపోవటమే అని ఇతరులు ప్రచారం చేసేవాళ్లు. దాంతో ఆ ఇంటోళ్లు భయపడి దేవతకు మొక్కేవాళ్లు. సొంత భక్తి కన్నా ఇతరులు పుట్టించే భయం భక్తికి కారణమయ్యేది. భయభక్తులు అనే మాట ఇందుకే వొచ్చిందేమో. బోణాలను ఎవరికివారు విడివిడిగాకాక సాధ్యమైనంతవరకు వాడకట్టులోని కులపోళ్లంతా కలిసి పెట్టేవాళ్లు. కుటుంబాల సంఖ్యను బట్టి యాటపోతుల అంకె ఉండేది. అవికాక విడిగా ఎవరికి వారు నల్ల కోడిపెట్టనో, ఎర్రకోడి పుంజునో వెంట తెచ్చుకునేవాళ్ళు. ప్రధాన ముత్యాలమ్మ దగ్గరకు పోవటానికి ముందే ఇడుపు ముత్యాలమ్మకు మొక్కు చెల్లించటం ఆనవాయితీ. ఇళ్ల ప్రహరీ గోడలకు అప్పట్లో గేట్లు ఉండేవి కావు. వాటికీ దర్వాజా తలుపులే ఉండేవి. ఈ తలుపు దర్వాజలు లోపలి వాటికన్నా హుందాగా, భిన్నంగా, దర్జాగా ఉండేవి. ఎక్కువ ఎత్తులో ఉండి, వాటికి ఇనుప బొడ్డెలు అలంకరణగా అమర్చేవాళ్లు. లింకుల గొలుసులు దర్వాజను, తలుపును కలిపేది.. అలా వీధి మొత్తలకు రొండు వైపులా రొండు ఒక అడుగు ఎత్తు రాళ్లను అమర్చి, అలంకరించి పసుపు కుంకుమలతో పూదించి వాటిని ఇడుపు ముత్యాలమ్మ అనేవాళ్లు. ఇడుపులు అంటే ఇరుపక్కలు అని అర్థం. ఆ ఇడుపులకు నైవేద్యం సమర్పించాకే వీధుల్లో ముత్యాలమ్మ బోణాలు బైలెల్లేవి.
మా సుక్కురారప్పేట నుంచి ముత్యాలమ్మ గుడికి వయా కుమ్మరి బజార్‌ మర్రిబావి మీదుగా వెళ్లొచ్చు, అంబాభవానీ గుడి సందు నుంచి పోవచ్చు కానీ, రిక్కా బజార్‌ మీదుగా తిరిగొచ్చేవాళ్లం. ఎందుకంటే రంగరాజోళ్ల బజార్లో ముత్యాలమ్మ పెనిమిటి పోతురాజు ఉండేవాడు. ముందుగా ఆయనకు పసుపు కుంకుమేసి, కొబ్బరికాయ కొట్టి ఆడ్నుంచి బైలెల్లేవాళ్లం. పెసర చేలో పోగొట్టుకొని పప్పును అటికెలో వెతికి ఫాయిదా లేదు అన్న సామెత మావోళ్లకు ఎరుకే. అందుకే పండుగ కోసం కూలీలై పెసర చేలల్లో శ్రమధారపోసి పెసర గుండ్లై ఇళ్లకు చేరేవాళ్లు.. ముత్యాలమ్మకు పెసర గారెలు, పులగం నివేదన వాటితొనే.
దేవతకు కాళ్లు కడుగుతారంతే. బీరు, బరండీ, సారా, కల్లు తాగేదంతా మనుషులే. మందేసి చిందేస్తూ డప్పుల మోతగా జనం జాతరను తలపించేవాళ్లు. పసుపు పూసి, కుంకుమ అద్ది మెడలో వేపాకు దండేసి బయిలెల్లదీస్తుంటే కోళ్లు కొత్త కోక కట్తిస్తున్నారనుకునేవి. మేకలు, గొర్రెలు నాలుగు కాళ్ల నాట్యమాడుకుంట వెంట నడిచేవి. నోట్లో మందుపోసి జడతా ఇప్పిస్తుంటే ఆహా అని మైమరిచేవి పాపం నోరులేని మూగ జీవులు. శ్రావణ మాసం ఆది, గురు వారాలు వీధుల చెవుల్లో డప్పు చప్పుళ్లు మొలిచేవి. ఎత్తు గుట్ట పరుపుబండ మీదుంటది. గుడి గుహలాంటి చీకటిలో భక్తుల భరోసా దీపమై వెలుగుతుంటుంది ముత్యాలమ్మ. ఆ రొండు రోజులు శిగమూగి మిగిలిన రోజుల్లో నిదరపోతుంది. శ్రావణ మాసంలో తల్లికి జాతర శోభ ఉంటుంది. సాధారణ రోజుల్లో కొంగు ముడుల కొత్త జంట తొలి దర్శనమవుతుంది. ఊళ్ళో ఎవరికి పెళ్లైనా ఇదుగో అమ్మా నాభర్త అని, ఈమే తల్లీ నా భార్య అని పెళ్లైన తెల్లారే కొత్త దంపతులు అమ్మకు చూపాల్సిందే.
వానాకాలం కనుక దార్లన్నీ వాన నీళ్ల బురదరంగయ్యేవి. ముత్యాలమ్మ గుడి నేల మాత్రం కుంకుమ మడుగయ్యేది. భక్తులు ఇళ్లకెళ్ళి పోగులెత్తుకునే లోపే గుడిముందు నీసుముచ్చునేల నల్లా వొండుకొని తినేది. నాకు బీపీ వొచ్చింది, షుగరొచ్చింది అనో, లేక నేను అప్‌డేట్‌ కాదలిచాను, నేను డైట్‌ లో ఉన్నాను నేను మందు మానేశాను, నేను మాంసాహారం మానేశాను, జంతుబలులు ఇష్టపడటం లేదు, నౌ ఐయాం ప్యూర్‌ వెజిటేరియన్‌ అని మా ముత్యాలమ్మ నోటివెంట పలకాలని నా ఆశ. అంతా బావుంటుంది. జనం సంఘటితమవటం, తల్లిని కొలవటం, భక్తితో పూజించటం, భయంతో మెలగటం, పండుగ చేయటం. సంప్రదాయం పాటిస్తూ భావితరాలకు సంస్కృతి జ్యోతిని అందించటం… కానీ జంతుబలి సున్నిత మనస్కులను గుడిముందు హత్య చేస్తుంది. కోడి, మేక మెడతెగిన ప్రతిసారీ బుద్దుడి గుండెముక్క తెగిపడుతుంటది.
గుడికి అడుగుల దగ్గరి కూడలిలో విగ్రహం ఏర్పాటుపై తర్జన భర్జన జరుగుతోంది. నన్నడిగితే.. వధ జరిపే చోట అహింసామూర్తి ప్రతిమ మొలకెత్తించాలంటాను. ‘ఇక్కడ హారన్‌ కొట్ట కూడదూ అని రాసుంచినట్టు ‘ఎక్కడా వధ జరపకూడదు’ అన్న వాక్యాన్ని పాకించాలంటాను. నా వ్యతిరేకత కులాలు, మతాల ఆహారపు అలవాటు పై కాదు అహింసను హత్య చేసే హింసపై మాత్రమే.
శ్రీనివాస్ సూఫి: 9356611455

Spread the love