మధ్యయుగంలో బీహారు, బంగ దేశాలు

భారతదేశమంతా ఇంచుమించు ఒకే రకంగా కళలు, సంస్కృతి, శతాబ్దాల తరబడి ముందుకు సాగింది. కాకపోతే కొన్ని ప్రాంతీయ కళలు, కథలు, ప్రాంతీయ రాజుల అభిరుచుల వలన చిన్న చిన్న ప్రాంతీయ బేధాలు కన్పించవచ్చు. ఆ మార్పులే, ఆ కళలని, ఆ ప్రాంతపు కళలుగా గుర్తించడానికి చిహ్నాలౌతాయి. బెంగాల్‌ (వంగదేశపు) మధ్య యుగాల కళలు, చిత్రాలైనా, శిల్పాలైనా, ఒక జ్వాలా తోరణాలతో ఆవరించి వుంటాయి. ఈ కళాపద్ధతికి నేపాల్‌, చైనా, టిబెట్‌ వంటి ఉత్తర భారతం బయట దేశాల కళలకూ పోలిక కనిపిస్తుంది. అందుకు కారణమూ ఉంది.
బౌద్ధం పుట్టింది బీహారులో. క్రీ.పూ. 3వ శతాబ్దంలో అశోకుడి వలన బౌద్ధానికి ప్రచండ ప్రచారం జరిగింది. అలా అని ఆ సమయంలో హైందవం అంతరించిపోయిందని అనుకోనక్కరలేదు. ఆపై బౌద్ధం తగ్గి, క్రీ.శ. 5వ శతాబ్దం వచ్చే నాటికి మళ్లీ హిందూ కళలు అధికమయ్యాయి. కానీ బౌద్ధం గురించి నేర్చుకోవడానికి పక్క ప్రదేశాల వారు బీహారు రావడం, అలాగే బౌద్ధ ప్రచారం కోసం భారతీయులు పక్క దేశాలకు ప్రయాణం చేయడం వలన ఈ పర దేశ కళా పద్ధతి బీహారు చేరింది. ఆ పద్ధతులు పక్కనున్న బెంగాల్‌పై ఎక్కువగా ప్రభావం చూపాయి. బీహార్‌, బెంగాల్‌ ప్రాంతాల, మధ్య యుగాల కళలని చూస్తే అక్కడ బౌద్ధ, హిందూ కళలు రెండూ కనిపిస్తాయి. క్రీ.శ. 8 నుండి 12వ శతాబ్దం వరకూ ఈ తూర్పు, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ ప్రాంతాన్ని పాల, సేన, చంద్ర, వర్మన్‌ వంశీయులు పాలించారు. అందులో పాల, ఆపై సేన వంశపు రాజులు ముఖ్యులు.
క్రీ.శ. 7వ శతాబ్దంలో శశాంకుడి రాజ్యాలు నేలమట్టం అయ్యాక అరాచకం పెరిగింది. పాల వంశీయులలో మొదటి రాజు గోపాల రాజు క్రీ.శ. 750లో రాజ్యం చేత చిక్కించుకున్నాడు. తారానధ అనే ఒక టిబెట్‌ చరిత్రకారుడు రాసిన ప్రకారం, పాల వంశంలోని రెండవ రాజు ధర్మపాల, మూడవ రాజు దేవపాల వలన పాల రాజుల కాలం కళలకు స్వర్ణయుగం అని పిలువబడింది. థిమన్‌, అతని కొడుకు బిత్పాలో అనే కళాకారులు వీరి సమయంలో కళలకు గొప్ప రూపం ఇచ్చారు. ఆ సమయంలో ఆస్థాన కళలు అని చెప్పేటంత కళల స్థాయి ఎదగలేదు కానీ, వీరి కాలంలో బౌద్ధ, హిందూ రెండు కళలు ప్రోత్సాహం అందుకున్నాయి. ఆ సమయంలో ముందు బీహారులోని మగధలో బౌద్ధ కళలు వృద్ధి పొందాయి. ఆపై తూర్పున బెంగాల్‌కి పాకి పాల రాజుల తరువాత వచ్చిన సేన రాజుల కాలం క్రీ.శ.11 నుండి 13 వ శతాబ్దానికి బెంగాల్‌లో బౌద్ధ కళల కంటే హిందూ కళల ప్రాముఖ్యం పెరిగింది. ఆ కాలంలో క్రీ.శ. 12వ శతాబ్దంలోని ముస్లింల దాడుల వలన బీహార్‌, బెంగాల్‌ లోని ముఖ్యమైన బౌద్ధ, హిందూ కట్టడాలు ధ్వంసం అయ్యాయి. బౌద్ధులు చుట్టుపక్కల బర్మా, నేపాల్‌ వంటి దేశాలకు పారిపోయి అక్కడి వారి మత కార్యక్రమాలను కొనసాగించి స్థిరపడ్డారు. పుట్టినిల్లైన భారతదేశంలో బౌద్ధం ఖాళీ అయింది.
పాల, సేన రాజులు కొత్త నిర్మాణాలెన్నో నిర్మించడమే కాకుండా, కొన్ని పాత కట్టడాల మరమ్మత్తులూ చేయించారు. వీరు ఇటుకతో కూడా కట్టించారు. అలాగే చెక్క, వెదురు వంటి కొన్ని అశాశ్వత పదార్థాలు కట్టడాలలో ఉపయోగించడం వలన, అలాగే అక్కడ నీటి చెమ్మ వున్న వాతావరణం అవడం వలన కొన్ని నిర్మాణాలు ఆనవాలు లేకుండా పోయాయి. అలాగే వారు శిలలు, లోహం కూడా శిల్పాల నిర్మాణంలో వాడారు. నలుపు లేదా బూడిద రంగులో వుంటే క్లోరటిక్‌ రాయి పలకలపై శిల్పం చెక్క వాటిని మందిర నిర్మాణాలలో మధ్య ఆకృతులలాగా బిగించారు. అలాగే రాగి తక్కువగా కలిపిన ఇత్తడి, 8 లోహాల మిశ్రమం అష్టధాతు విగ్రహాలు, బంగారు, వెండి విగ్రహాలు చేయించారు. అలాగే ఈ లోహాలతో పోత పోసిన విగ్రహాలూ వున్నాయి. వీరు పెద్ద విగ్రహాలు చేయించినప్పుడు మద్య బోలు విగ్రహాలు చేయించారు. చిన్న విగ్రహాలు మటుకే పోత పోసిన విగ్రహాలు. బెంగాల్‌, బీహారులలో క్రీ.శ. 8 నుండి 12వ శతాబ్దం మధ్య ఎన్నో శిల్ప కార్ఖానాలు వుండేవి. నలంద, బుద్ధ గయలో 400 సంవత్సరాలు శిల్ప కార్ఖానాలు పనిచేశాయి.
హిందూ కళలు : పాల సామ్రాజ్యంలో ముందర కొన్ని బౌద్ధ కళలు కనిపించినా ఆపై హిందూ కళలే ఆధిక్యం పొందాయి. బీహారులోని లాఖీసరాయిలోని సూర్యుడి విగ్రహం క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందినది. ఈ విగ్రహం నైపుణ్యంతో చెక్కిన భావయుక్త శిల్పం. ఇందులో గుప్తుల కాలపు పద్దతులూ కొన్ని కనిపిస్తాయి. బీహారులోని ముండేశ్వరిలో వున్న క్రీ.శ. 7వ శతాబ్దపు సూర్య విగ్రహానికి, ఈ విగ్రహానికి పోలికలు కనిపిస్తాయి. 61 సెం.మీ. పొడవున్న ఈ లాఖీ సరాయి సూర్య విగ్రహం, పట్నా మ్యూజియంలో వుంది. బీహారులో మొదటి రాజుల కాలంలో ఉమామహేశ్వర విగ్రహాలు విరివిగా కనిపిస్తాయి. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన రాజగిరి, బీహారులోని ఉమామహేశ్వర విగ్రహం, నల్లరాతితో చెక్కారు. శిల్పంలో కింద భాగాన హెచ్చు తగ్గుల పర్వతమూ శివుడి వాహనం నంది, పార్వతి వాహనం సింహమూ నేర్పుగా చెక్కారు. ఈ విగ్రహం పై భాగాన పూసలతో ఒక తోరణం వుంటుంది. క్రీ.శ. 8,9 శతాబ్దాల బెంగాల్‌, బీహార్‌లలో ఇలాంటి తోరణం కనిపిస్తుంది. ఆపై శతాబ్దాలలో అది ఒక అగ్నిజ్వాలల తోరణంలా చెక్కారు. ఇది కలకత్తా విశ్వవిద్యాలయంలోని అషుతోష్‌ మ్యూజియంలో వుంది. దీని పొడవు 52 సెం.మీ.
క్రీ.శ. 9వ శతాబ్దం వరకు బౌద్ధ, హిందూ కళల మధ్య వ్యత్యాసం చాలా వుండేది. ఆపై తగ్గి ఒక మిశ్రమ శైలిగా తేలింది. తూర్పు బెంగాల్‌, నేటి బంగ్లాదేశ్‌లోని నారాయణపూర్‌లోని గణేశ విగ్రహం ఇందుకు ఒక ఉదాహరణ. క్రీ.శ. 10వ శతాబ్దపు ఆఖరి దశ, 11వ శతాబ్దపు మొదటి దశలోని ఈ విగ్రహం చుట్టూ పొడుగు పూసలా లేక అగ్ని రేకులా అనిపించే తోరణం వుంది. చక్కటి రేకులు దిద్దిన తామర పువ్వు పీఠంపై కూర్చున్న ఈ గణేశుడు, 153 సెం.మీ పొడవు వున్న నల్లరాతి శిల్పం. ఇది ఢాకా మ్యూజియంలో వుంది.
పాల రాజుల కాలంలో త్రివిక్రమ విష్ణు విగ్రహాలు కూడా ఎన్నో కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్‌, బాలుర్‌ఘాట్‌లోని నల్లరాతి, త్రివిక్రమ విగ్రహం, క్రీ.శ. 12వ శతాబ్దానిది. త్రివిక్రముడుంటే వామనావతారంలోని త్రివిక్రముడు కాదు ఈ త్రివిక్రముడు. వామనావతారంలో బలి చక్రవర్తిని మూడు అడుగులు అడిగినాక, ఆకాశానికి పాదం ఎత్తి విశ్వమంత ఎదిగిన వాడూ త్రివిక్రముడే. విష్ణువుకున్న 4 ఆయుధాలు, శంఖ, చక్ర, పద్మ, గదలు, 4 చేతులలో కింద, పైన వేరువేరుగా మార్చి చేతపట్టినప్పుడు 24 విష్ణురూపాలు దర్శనమిస్తాయి. అందులో ఒకటి త్రివిక్రమ రూపం. ఈ శిల్పం ఆ త్రివిక్రముడు. అన్ని విష్ణు రూపాలకు, అవతారాలకు గుర్తు ఒకటే. మోకాటి పొడుగున వున్న తులసి మాల లేదా వనమాల. ఈ శిల్పం కలకత్తా ఇండియన్‌ మ్యూజియంలో వుంది.
బంగ్లాదేశ్‌లోని విక్రమపురాలో ఒక వింతైన శిల్పం వుంది. నల్లరాతితో చెక్కిన, 4 చేతుల పార్వతి విగ్రహం, శివలింగం వెనుకగా నిలుచుని వుంటుంది. రెండు చేతులు ధ్యాన ముద్రలో వుండగా, ఆమె వెనుక చేతులలో కుడి వైపు జపమాల, ఎడమవైపు పుస్తకం పట్టుకుని వుంటుంది. పైన ఆ శిలకు తోరణంలా 5 రూపాలు చెక్కి వుంటాయి. శివలింగానికి ఆనుకుని వుంది కాబట్టి శివుడి దేవేరి పార్వతే. కానీ చేతిలో పుస్తకమూ, జపమాల చూపడం అంటే ఈ రెండు వస్తువులూ సరస్వతీ రూపానికి గుర్తు. ఆమె తలపై నేరుగా పైన ఒకటి అటూ ఇటూ రెండు రూపాలు, మొత్తం 5 రూపాలు వున్నాయి. అంటే ఈమె పంచాగ్ని పార్వతి అయి వుండవచ్చు. శివుడిని భర్తగా పొందాలన్న పార్వతి, 4 అగ్నులను పేర్చి, పైన సూర్యుడు 5వ అగ్నిగా తపస్సు చేస్తుంది. పార్వతిదే మరొర రూపం బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి చేతిలోనూ పుస్తకం, జపమాల వుంటాయి. కానీ ఆమె రూపం బాల లేదా కన్య రూపం. ఇక్కడి రూపం ప్రౌఢ పార్వతి రూపం. కొన్ని సార్లు శిల్పం చెక్కేటప్పుడు శిల్పులు ప్రాంతీయ కథలు, విశ్వాసాలు, జానపద కథలని కూడా కళల్లో నేర్పుగా చూపిస్తారు. ఈ శిల్పం అలాంటిది కూడా అయివుండొచ్చు. క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన ఈ శిల్పం పొడవు 145 సెం.మీ. ఢాకా మ్యూజియంలో వుంది. బంగాదేశ్‌లోని పురాపారాకు చెందిన అర్ధనారీశ్వర, నల్లరాతి శిల్పం, శివుడి మూడవ కంటితో సహా మొత్తం అంతా రెండు భాగాలుగా చూపిస్తూ శివపార్వతులను ఒకే శరీరంగా చెక్కిన శిల్పం. ఇది క్రీ.శ. 12వ శతాబ్దపు శిల్పం. బంగ్లాదేశ్‌కి చెందినదే నటరాజ శివరూపం. క్రీ.శ. 11వ శతాబ్దపు నల్లరాతి శిల్పం, ఒక పలకలా చెక్కిన శిల. 10 చేతుల శివుడు, నందిపై నిలుచుని తన నాట్యంలో నిమగమై భావయుక్తంగా నాట్యం చేస్తుంటే నంది తల ఎత్తి శివుడి వైపు చూస్తుంటాడు. ఆయన కుడి వైపు గంగ మకర వాహనంపై, ఎడమవైపు పార్వతి సింహ వాహనంపై నిలుచుని వుంటారు. 130.8 సెం.మీ పొడవున్న ఈ శిల్పం ఢాకా మ్యూజియంలో వుంది.
బౌద్ధ కళలు : 1872వ సంవత్సరంలో బ్రిటీష్‌ వారు బీహారులో రైలు మార్గం వేస్తున్నప్పుడు సుల్తాన్‌ గంజ్‌ అనే ప్రాంతంలో భూమిలో దాచిపెట్టిన బౌద్ధ విగ్రహాలు దొరికాయి. ముస్లింల దాడులప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలను బౌద్ధ ఆరామాల నుండి తీసి ఇలా భూమిలో దాచిపెట్టి, చిన్న విగ్రహాలను, గ్రంథాలను తీసుకుని బౌద్ధులు పక్క దేశాలకు వలస పోయారు. ఈ విధంగా చాలాచోట్ల బౌద్ధ విగ్రహాలు, కొన్ని హిందూ విగ్రహాలు దొరికాయి. సుల్తాన్‌ గంజ్‌లో దొరికిన నల్లరాతి విగ్రహం క్రీ.శ. 11,12 శతాబ్దాలకు చెందినది. బర్మింగమ్‌ మహల్‌లో భద్రపరిచారు. ఈ శిల్పం సింహనాద అవలోకితేశ్వర. కుడికాలు కొంచెం ఎత్తిపెట్టి, చేయి దానిపై ఆన్చి, ఎడమచేయి వెనుక నేలపై ఆన్చి కులాసాగా మాట్లాడుతుననట్టు ఉంటుంది ఈ బుద్దుడి శిల్పం.
      బంగ్లాదేశ్‌ లోని హేరుక అనే శిల్పం తాంత్రిక బౌద్ధానికి చెందిన శిల్పం. మారా అనే దుష్టశక్తులను ద్వంసం చేసి బౌద్ధ మార్గంలో భిక్కులకు సాయం చేస్తుంది ఈ రూపం. కుడికాలు ఎత్తి ఎడమకాలి మోకాలిపై వుంచి, ఖట్వాంగం చేతపట్టి ఉబ్బిన కళ్లు, కోరపళ్లతో కోపంగా వుంటుంది ఈ రూపం. ఇది ఢాకా మ్యూజియంలో వుంది. హేరుక, ప్రజ్ఞ లేదా జ్ఞానం అనే స్త్రీతో లైంగిక కలయికలో వుంటే ఆ రూపం హేవజ్ర. క్రీ.శ. 12వ శతాబ్దపు ఈ శిల్పం కలకత్తా, ఇండియన్‌ మ్యూజియంలో వుంది. పర్ణ శబరి అనే క్రోధ రూపం కూడా తాంత్రిక బౌద్ధానికి సంబంధించినదే. ఈ తాంత్రిక బౌద్ధ రూపాలు నేపాల్‌, టిబెట్‌ బౌద్ధానికి ఆధారాలయ్యాయి.
– డా||యమ్‌.బాలామణి, 8106713356

Spread the love