కవి, పాలనాదక్షుడు, బాల సాహితీవేత్త నన్నపరాజు రమేశ్వరరాజు

Nannaparaju Rameshwararaju was a poet, ruler and children's writer

నన్నపరాజు రమేశ్వరరాజు కవిత్వాన్ని గురించి చెబుతూ ‘బ్యాలన్సుడ్‌ డయట్‌’ని అందించిన కవి అంటారు డా||నలిమెల భాస్కర్‌. అది ఆయన కవిత్వంలోనే కాదు ఇతర రచనలైన శతకాలు, భక్తి సాహిత్యం, వ్యంగ్య రచన, బాల సాహిత్యం, వ్యాఖ్యానాలలో మనకు కనిపిస్తుంది. కవి, బాల సాహితీవేత్త, జిల్లా విద్యాధికారిగా, ఉప సంచాలకులుగా విద్యాశాఖలో వివిధ పదవుల్లో సేవలు అందించిన నన్నపరాజు రమేశ్వరరాజు సెప్టెంబర్‌ 9, 1954న మహబూబ్‌ నగర్‌ జిల్లా గుర్తూరులో పుట్టారు. తల్లి శ్రీమతి రాజ రత్నమ్మ, తండ్రి శ్రీ రఘుపతిరాజు. బి.ఎస్సీ., ఎం.ఎ (ఇంగ్లీష్‌), ఎం.ఈడి చదివి ఉపాధ్యాయ వృత్తిలో చేరి అంచెలంచెలుగా ఉప విధ్యాధికారిగా, జిల్లా విధ్యాధికారిగా, డిప్యుటేషన్‌లో సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారిగా పలు పదవుల్లో రాణించారు. కవిగా, రచయితగా తన వృత్తితో పాటు ప్రవృత్తినీ నిర్వహించారాయన. ఖమ్మం మొదలుకుని కరీంనగర్‌ వరకు, కర్నూలు మొదలు కృష్ణా జిల్లా వరకు ఆయన ఉద్యోగరీత్యా పనిచేసిన ప్రాంతాలు.
పద్యం, వచనం, గేయాలను సమానంగా ప్రేమించి రాసే రమేశ్వరరాజు తొలి రచన బాల నీతిశతకం కావడం విశేషం. ‘వేల్పుగిరి నివాస వేదభాస’ శతకం, ‘భద్రగిరి శ్రీరామ శతకం’ వంటివి వీరు రాసిన భక్తి శతకాలు. ఉపాధ్యాయునిగానే గాక అధికారిగా పనిచేశారు కాబట్టి అందులోని గుర్తెరిగిన తనాన్ని గురించి ‘వినుము గురువరేణ్య’ పేరుతో వీరు రాసిన ప్రభోదాత్మక శతకం వంటివి పేరుతెచ్చాయి. వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించడంలోనూ వీరిది పైచేయే. ‘అంత్య ప్రాసల్లో అనంత సత్యాలు’ పేరు రమేశ్వరరాజు రాసినవి హాస్యంతో పాటు ఆలోచనలను కలిగిస్తాయి. ‘ప్రజల ప్రతినిధులుండు చోటు/ ప్రజల గోడుకు పాము కాటు/ ప్రజాస్వామ్యము కచట తూటు/ ప్రజలకెందుకు యిచట వోటు’ వంటివి వారి వ్యంగ్య రచనలకు నిదర్శనం. ఇదే కోవలో రాసిన మరో వ్యంగ్య మినీ కవితా సంపుటి ‘భారతమ్మ పదాలు’. ‘కైమోడ్పు’ పేరుతో భక్తిసాహిత్యాన్ని రాసిన వీరు అదే స్ఫూర్తితో జగద్గురు శంకరుల ‘భజగోవిందం’ శ్లోకాలకు పద్యరూప భావానువాదం చేశారు. పద్యంలోనే కాక వచన కవితా రచనలోనూ రాజు రాజే. తన ఊరు గుర్తూరును గుర్తుంచుకుని ‘గుర్తూరు నుండి వరంగల్‌ దాకా’ పేరుతో రాసిన బృహత్‌ వచన కవితా సంపుటి అందుకు సాక్ష్యం. లలితకళా విశారదుడుగా, గురుకుల రత్నగా పేరొందిన రమేశ్వరరాజు పద్య ప్రశస్తి, సద్గ్రంధసారము, పతి సందేశం, వ్యసన హాని, పదకొండు వందల సమస్యాపూరణ పద్యాలు, ఎనమిది వందల సూర్యస్తుతి తేటగీతులు పుస్తకాలుగా రావాల్సివుంది. ఉత్తమ విధ్యాధికారి, ఉత్తమ నోడల్‌ అధికారి, ఉత్తమ ఐటిడిఎ అధికారితో పాటు ఉత్తమ జిల్లా అధికారి మొదలైన వివిధ పుస్కారాలు, సత్కారాలందుకున్న వీరు ఉద్యోగరీత్యా అనేక రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు నేతృత్వం వహించారు.
ఉపాధ్యాయునిగా బాలలతో పనిచేసి, అధికారిగా బాలల కోసం తపించిన రమేశ్వరరాజు బాల సాహిత్యాన్ని కూడా మిక్కిలి ప్రేమతో సృజించారు. తొలి రచన ‘వినుము తెలుగు బాల’ బాల నీతి శతకం. యిది రాసినప్పుడు వీరు జిల్లా ఉప విధ్యాధికారి. యింకా ‘అక్షర మొలకలు’ వంటివి వీరు రాసిన బాల సాహిత్యం. ‘వినర తెలుగుబాల! వినయశీల’ మకుటంతో వీరు రాసిన బాల నీతి శకతంలోని పద్యాలు బాలలకు కాదు పెద్దలకు కూడా దారి దివ్వెల్లాంటివి. ‘ఇతరులెన్ని నీతులెరుగజేసిన గాని/ ఎవరి బుద్ది వారి కవసరంబు/ నీదుబాగుగూర్చి నీవె యోచింపుము/ వినుము తెలుగుబాల! వినయశీల’, ‘సత్యమొకటె జగతి నిత్యమ్ము నిఖిలమ్ము/ హింస యెన్నటికి హితముగాదు! గాంధిగారిమాట కావలె నీబాట/ వినుము తెలుగుబాల! వినయశీల’తో పాటు యింకా ‘మంచితనము కన్న మించిన దిలలేదు/ వంచన యెపుడేని వలదు నీకు/ బ్రతికినన్ని నాళ్ళు పరువుగా బ్రతుకుము/ వినుము తెలుగుబాల! వినయశీల’ వంటి పద్య రత్నాలు రాజుగారి రచనలకు కొలమానాలు. చిన్నచిన్న పదాలతో కూర్చిన గేయాలు వీరి ‘అక్షర మొలకలు’. యిందులోని గేయాలు తరగతి గది మొదలు ఉపాధ్యాయ శిక్షణ వేదికల వరకు కొనసాగాయి. ముఖ్యంగా వీరి గేయాలను వేదాంతం లలిత స్వరాన్ని అందించి, ఇతరులతో పాడించి ప్రాచుర్యంలోకి తెచ్చారు. తొలి గేయం ‘అదిగదిగో స్వాతంత్య్ర రథం/ అంతులేని వేగంతో వస్తోంది’ మొదలు ‘కమ్మనైన తెలుగుభాష కల్లనైనా మానొద్దు’ వరకు సాగిన గేయాలన్ని సందేశాత్మకమైనవే. ‘మానవునికి కావాలి సహకారం/ మనలోన ఉండాలి ఉపకారం’, ‘ఈ దినం, ఒక దినం/ గణతంత్ర గర్వదినం/ ఈ దినం ఒక శుభదినం/ ప్రజాతంత్ర పర్వదినం’, ‘కాకతీయుల గుళ్ళు/ కళలకే లోగిళ్ళు/ చూడచాలవు కళ్ళు/ మది తొక్కు పరవళ్ళు/ ఏకశిల ఒక స్ఫూర్తి/ బసవన్నదే మూర్తి’ వంటి గేయాలు యీ సంపుటిలో ఉన్నాయి. ఇవేకాక యింకా ‘పల్లెలే మన పట్టు గొమ్మలు/ పల్లెవాళ్ళే పూలరెమ్మలు’, ‘చాచా నెహ్రూకు జేజేలు/ శాంతిదూతకు జేజేలు/ ఎర్రగులాబీకి జేజేలు/ ఇందిర తండ్రికి జేజేలు/ …సత్యమూర్తికీ జేజేలు/ సహనశీలికీ జేజేలు/ చిన్నిపాపలకు జేజేలు/ చిరంజీవులకు జేజేలు’ వంటి చక్కని గేయాలు యిందులో ఉన్నాయి. అవిశ్రాంతగా సాహిత్య సృజన చేస్తున్న ఈ విశ్రాంత విధ్యాశాఖాధికారికి తెలుగు బాలల జేజేలు!
– డా|| పత్తిపాక మోహన్‌ 9966229548

Spread the love