నవజాత శిశువుకు తల్లిపాలే శ్రేష్ఠం

ఆగస్ట్‌ 1 వతేదినుండి 7 వ తేదివరకు దాదాపు 125 ప్రపంచదేశాలు తల్లిపాల వారోత్సవాల్ని జరుపుతున్నాయి. వరల్డ్‌ ఎలయన్స్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఏక్షన్‌ (WABA) సమన్వయకర్తగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ, యూనిసెఫ్‌, అనేక దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్ధలు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాయి. నవజాత శిశువుకు పుట్టినప్పటి నుండి సంపూర్ణంగా తల్లి పాలను మాత్రమే తాగించే సంస్కృతిని ప్రోత్సహించడానికి, పెంపొందించడానికి దోహదంచేసే అర్ధవంతమైన కార్యక్రమాలను ఫలప్రదంగా జరుపుతున్నారు.
తల్లిపాలను తాగని శిశువులకు తల్లి పాలను తాగే శిశువులకంటే మొదటి సంవత్సరంలోపు చనిపోయే ప్రమాదం 21 శాతం ఎక్కువ ఉంటుందని, కనీసం మొదటి 3 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం తాగిన పిల్లలకు చనిపోయే ప్రమాదం 38 శాతం తగ్గుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అనేక దేశాలలో, ముఖ్యంగా పేద దేశాలలో ఆమోదించలేని స్ధాయిలో శిశు మరణాలు వుండడం వలన ఆ మరణాల్ని నివారించడానికి తీసుకోగలిగిన ప్రధాన చర్యలలో ఒకటిగా బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వయసు వరకు కేవలం తల్లి పాలను మాత్రమే తాగించడాన్ని ప్రోత్సహించడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి, ముఖ్యంగా తల్లులు తమ బిడ్డకు తామిచ్చే అతి విలువైన బహుమతి ఆరోగ్యమేనని, తాము పాలివ్వడం ద్వారా ఆ బహుమతిని సులభంగా అందించవచ్చని తల్లులు తెలుసుకోవడానికి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరపడం ఒక విశిష్ట సాధనంగా వుంది.

తల్లి ఎప్పుడు పాలను పట్టడం ప్రారంభించాలి?
సహజ ప్రసవమైతే 2 గంటల లోపు, సిజేరియన్‌ అయితే 6 గంటల లోపు తల్లి బిడ్డకు పాలివ్వడం మొదలుపెట్టాలి. బిడ్డ రొమ్మును చీకుతూంటే తల్లి శరీరంలో కొన్ని నరాలు, గ్రంధులు ప్రతిస్పందించి పాల ఉత్పత్తి ప్రారంభమయేలా చేస్తాయి. అందుచేత తరచుగా రొమ్ముల్ని చీకించాలి. అలా చెయ్యడం వలన పాలు పడడమేకాక పాలు పడే సమయానికి బిడ్డకు పాలు తాగడం అలవాటవుతుంది.
తల్లిపాలలో ఉండే పోషకాలు:
1. నీరు: తల్లి పాలలో ప్రధానంగా నీరు ఉంటుంది. ఇది శిశువు శరీరంలో నీరు అవసరమైనంత ఉండేలా చేస్తుంది.
2. మేక్రోన్యూట్రియంట్స్‌:
ప్రొటీన్స్‌: తల్లి పాలలో బిడ్డ సులభంగా జీర్ణం చేసుకోగల ప్రొటీన్స్‌ ‘వే ప్రోటీన్‌’, ‘కెసీన్‌’ ఉంటాయి.
పిండిపదార్ధాలు: తల్లి పాలలో బిడ్డకు ప్రధాన శక్తిని ఇచ్చే ‘లేక్టోజ్‌’ ఉంటుంది. లేక్టోజ్‌ జీర్ణవ్యవస్థలో ప్రయోజనకర బాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.
క్రొవ్వులు: మెదడు అభివృద్ధికి, శారీరక ఎదుగుదలకు అవసరమైన ఒమేగా ఫాటీ ఏసిడ్స్‌ 3, 6 తల్లి పాలలో ఉంటాయి.
మైక్రోన్యూట్రియంట్స్‌: తల్లి పాలలో ఎ,ఇ,డి,కె,బి విటమిన్లు, ఐరన్‌, జింక్‌, కాల్షియం మొదలైన ఖనిజాలు ఉంటాయి. బిడ్డ వ్యాధినిరోధక శక్తి పెంపుదలకు, ఎముకల దారుఢ్యానికి, సమగ్ర శారీరక అభివృద్ధికి మైక్రోన్యూట్రియంట్స్‌ అవసరం.
వ్యాధి నిరోధక కారకాలు: తల్లి పాలలో బిడ్డకు వ్యాధుల్ని నిరోధించే ఏంటీబాడీలు, ఇమ్యూన్‌ వ్యవస్థలో కీలక పాత్ర వహించే తెల్ల రక్తకణాలు ఉంటాయి.
వృద్ధి కారకాలు: బిడ్డ వేగంగా పెరగడానికి, ముఖ్యంగా మెదడు, జీర్ణవ్వవస్థ, ఇతర అవయవాలు అభివృద్ధి చెందడానికి అవసరమైన వృద్ధికారకాలు తల్లి పాలలో ఉంటాయి.
హార్మోన్లు: తల్లి పాలలో బిడ్డ జీవక్రియను, జీర్ణవ్యవస్థను నియంత్రించే హార్మోన్లు ఉంటాయి
ఎంజైములు, జీర్ణక్రియ కారకాలు: తల్లి పాలలో ఉండే ఎంజైములు ఆహారం ద్వారా లభించిన పోషకాలను రక్తంలోకి సంలీనం చేసుకోవడానికి దోహదపడతాయి.
నవజాత శిశువుకు ముర్రు పాల ప్రాధాన్యం:
బిడ్డ పుట్టగానే తల్లి రొమ్ముల్లో ఉత్పత్తి అయే పాలను ముర్రు పాలు అంటారు. ఆ పాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయి. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తరువాత ఉత్పత్తి అయే పాలకు భిన్నంగా ఉంటాయి. మురుప్రాల వలన నవజాత శిశువులకు కలిగే అసాధరణ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ముర్రు పాలను ‘ద్రవ బంగారం’ అని అంటారు. ముర్రుపాలను బిడ్డకు తాగించడం మంచిది కాదని, ఆ పాలను తాగిస్తే బిడ్డకు జబ్బు చేస్తుందనే అపోహ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉంది.
నవజాత శిశువుల ఆరోగ్యానికి ముర్రు పాలెందుకు కీలకం?
శిశు వైద్య నిపుణులు తల్లిపాలను డిజైనర్‌ మందుగాను, మొట్టమొదటి టీకాగాను అభివర్ణిస్తారు.
వ్యాధి నిరోధక శక్తిని కలగజేయడం: ఏంటీబాడీలు, ఇమ్యూన్‌ కణాలు, వ్యాధినిరోధక శక్తి తాలూకు ఇతర ముఖ్య భాగాలు సమృద్థిగా ఉండే ముర్రుపాలు నవజాత శిశువు వ్యాధినిరోధక శక్తికి అవసరం. శిశువు స్వంత వ్యాధినిరోధక శక్తి పెంపొందించుకునే దశలో వ్యాధుల బారిన పడకుండా ముర్రు పాలు కాపాడతాయి.
సులభంగా జీర్ణమవడం: ఇంకా పరిణతి చెందని జీర్ణ వ్యవస్ధ్థ ఉండే నవజాత శిశువులకు తేలికగా జీర్ణమయే ముర్రు పాల ద్వారా అవసరమైన పోషకాలు అందుతాయి.
ముర్రు పాలు నవజాతశిశువు గర్భస్ధంగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థలో పేరుకునే నల్లటి మలంను సులభంగా విసర్జించేలా చేస్తాయి. శిశువుకు మలబద్ధకం లేకుండా చేస్తాయి.
ప్రోబయాటిక్స్‌ లేక ప్రయోజనకరమైన బాక్టీరియా జీర్ణవ్యవస్థలో వృద్ధిచెందేలా చేస్తాయి. జీర్ణవ్యవస్థలో ఆరోగ్యకరమైన జీవవాతావరణం ఏర్పడేలా చేస్తాయి. జీర్ణవ్యవస్థలోని సంతులన జీవ వాతావరణం బిడ్డ తాగిన పాలు సులభంగా జీర్ణమయేందుకు, పోషకాలు సంలీనమయేందుకు, వ్యాధినిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది. శిశువు జీర్ణవ్యవస్థ వృద్ధిని, పరిణతిని పెంపొందించి, పోషకాలను సంలీనంచేసే వృద్ధికారకాలు ముర్రు పాలలో ఉంటాయి.
మెదడు అభివృద్ధి: మెదడు అభివృద్ధికి అవసరమైన, శిశువు జీవిత తొలి దశలో తెలివి తేటల అభివృద్ధికి అవసరమైన ఒమేగా ఫాటీఏసిడ్స్‌, ఖొలీన్‌లాంటి ముఖ్యమైన పోషకాలు ముర్రుపాలలో ఉంటాయి.
శోధనిరోధక లక్షణాలు: ముర్రు పాలలో ఏంటీ ఇన్‌ఫ్లామేటరీ లేక శోధనిరోధక లక్షణాలు ఉంటాయి. శిశువు శరీరంలోని సున్నితమైన కణజాలాన్ని ప్రశాంతపరచడానికి, రక్షించడానికి అవసరమైన లక్షణాలు ఉండడం వలన ఇన్‌ఫ్లామేషన్‌ సంబంధిత వ్యాధుల్ని నిరోధిస్తుంది.
హార్మోన్ల నియంత్రణ: నవజాత శిశువు బయటి వాతావరణానికి అలవాటు పడడం, జీవక్రియ నియంత్రణ మొదలైన విభిన్న శారీరక ప్రక్రియలను నియంత్రించే హార్మోన్లు ముర్రుపాలలో ఉంటాయి.
భావోద్వేగ అనుబంధం: ముర్రు పాలను తాగించడం వలన తల్లీబిడ్డల మధ్య అనుబంధం పటిష్టమవుతుంది. బిడ్డకు సౌకర్యంగా ఉంటుంది, భద్రతాభావం కలుగుతుంది.
జీర్ణవ్యవస్ధను సన్నద్ధం చెయ్యడం: కొద్ది రోజుల తరువాత ఉత్పత్తి అయే పరిణిత పాలను జీర్ణం చేసుకునేలోగా ముర్రుపాలు శిశువు జీర్ణవ్యవస్థను సన్నద్ధం చేస్తుంది.
ముర్రు పాలవలన కలిగే ఈ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ప్రతి తల్లి ప్రసవమైన వెంటనే తన బిడ్డకు ముర్రు పాలను తప్పనిసరిగా తాగించాలి.
తల్లి పాల విశిష్టత:
సంపూర్ణ పోషణ: తల్లి పాలలో బిడ్డ వయసుకు తగినట్లు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలు, క్రొవ్వు, విటమిన్లు ఎ, బి.కాంప్లెక్స్‌ ఉంటాయి. పోషకాహార లోపాలు లేని బిడ్డలకు వ్యాధుల్ని నివారించే శక్తి ఎక్కువగా ఉంటుంది.
సులభంగా అరుగుదల: పోతపాలతో పోలిస్తే తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి.
ఇమ్యూన్‌ వ్యవస్థ మద్దతు: పోతపాలు తాగే పిల్లలకు ఉండే విరేచనాలు, న్యుమోనుయా, చెవి ఇన్ఫెక్షన్లు, మూత్ర వ్యవస్థ ఇన్ఫెక్షన్లు, మెదడు పైపొరల ఇన్ఫెక్షన్‌, రక్తంలో ఇన్ఫెక్షన్‌ మొదలైన వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. తల్లి పాల ద్వారా లభించే ఏంటీబాడీలు అనేక వ్యాధులనుండి రక్షణనిస్తాయి. కనుక ఆయా వ్యాధుల వలన కలిగే మరణాల సంఖ్య తల్లిపాలు తాగే బిడ్డలకు తక్కువగా ఉంటాయి. శిశువుకు స్వంత ఇమ్యూన్‌ వ్యవస్థ పరిణితి చెంది పటిష్టమయేలోగా తల్లిపాలలో ఉండే ఏంటీబాడీలు రక్షణ కల్పిస్తాయి.
ఎదుగుదల, అభివృద్ధి: బిడ్డ ఎదుగుదల, అభివృద్ధికి అవసరమైన పోషణ తల్లి పాల వలన లభిస్తుంది. మెదడు, ఇతర అవయవాలు వేగంగా అభివృద్ధి చెందే దశలో సరైన పోషణ ఉండి అంటు వ్యాధులు సోకకుండా ఉంటే మెదడు, దృష్టి, సమగ్ర శారీరక అభివృద్ధి సక్రమంగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం: జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపకరించే మంచి బాక్టీరియా వృద్ధిచెందడానికి, చెడు బాక్టీరియా వృద్ధిచెందకుండా ఉండడానికి తల్లిపాలు సహాయపడతాయి. తద్వారా జీర్ణవ్యవస్ధకు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి.
నెక్రొటైజింగ్‌ ఎంటిరొకొలైటిస్‌: బిడ్డకు ప్రాణాపాయం కలిగించే ఈవ్యాధి ముప్పు తల్లి పాలు తాగే బిడ్డలకు తక్కువగా ఉంటుంది.
వ్యాధుల ప్రమాదం తగ్గుదల: పుట్టాక మొదటి సంవత్సరంలో పోషకాహార లోపాలు లేకుండా, అంటు వ్యాధులు సోకకుండా ఉన్న పిల్లలకు పిల్లల అభివృద్ధి పూర్తి స్థాయిలో జరిగి శిశువు జీవిత పర్యంత ఆరోగ్యానికి పునాది పడుతుంది.
తల్లి పాలను తాగడం వలన ఇన్ఫెక్షన్స్‌ ప్రమాదం గణనీయంగా తగ్గినప్పటికి తల్లి ఆరోగ్యం, బిడ్డ ఇమ్యూనిటీ స్ధాయి, పర్యావరణ సంబంధిత అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.
మధుమేహవ్యాధి లాంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. తల్లిపాలు తాగిన పిల్లలకు కొన్ని రకాల ఎలర్జీలనుండి రక్షణ లభిస్తుంది. ఎటాపిక్‌ డెర్మటైటిస్‌, ఉబ్బసం లాంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఆహారం కారణంగా వచ్చే ఎలర్జీలు తక్కువగా ఉంటాయి. బిడ్డకు కొన్ని రకాల కేన్సర్లు రావు.
తల్లి పాలు తాగే పిల్లలకు బాల్యంలో స్థూలకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
సడెన్‌ ఇన్ఫెంట్‌ డెత్‌ సిండ్రోమ్‌: సడెన్‌ ఇన్ఫెంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ లేక శిశువులు అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదం తల్లిపాలు తాగే శిశువులకు తక్కువగా ఉంటుంది.
తల్లీ బిడ్డల మధ్య అనుబంధం: తల్లిపాలను తాగించే సమయంలో తల్లీబిడ్డల మధ్య ఉండే అనుబంధం బిడ్డ మానసికంగా, మేధోపరంగా, అనుభూతిపరంగా ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుంది. బిడ్డ భద్రతాభావంతో పెరుగుతుంది. పెద్దయాక మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయి. తెలివితేటలు మెరుగ్గా ఉంటాయి.దీని ద్వారా భవిష్యత్తులో మానవ శక్తి వికాసం, అభివృద్ధి మెరుగు పడతాయి

సౌకర్యం, ఖర్చు ప్రభావం: పోత పాల లాగా కాకుండా తల్లి పాలు అన్ని వేళలా లభ్యమవుతాయి. బిడ్డకు అవసరమైనంత వేడిగా ఉంటాయి. తయారీ అవసరం ఉండదు. ఖర్చు ఉండదు.
గుండె వ్యాధుల తగ్గుదల: పాలిచ్చే తల్లికి గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.
మెటబాలిక్‌ సిండ్రోమ్‌ రిస్క్‌ తగ్గుదల: గుండె వ్యాధులు, స్ట్రోక్‌, డయాబెటిస్‌ ప్రమాదాన్ని పెంచే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ రిస్క్‌ పాలిచ్చే తల్లులకు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పాలిచ్చే తల్లికి తిరిగి రుతుచక్రం ఆలస్యంగా ప్రారంభమవుతుంది.
బంధం, భావోద్వేగ అనుబంధం: తల్లి చర్మంతో బిడ్డ చర్మం స్పర్శ, తల్లి కళ్ళతో బిడ్డ కళ్ళు కలపడం, పాలిచ్చేప్పుడు శారీరక సాన్నిహిత్యం తల్లీబిడ్డల మధ్య ప్రేమ, అనురాగం, భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందిస్తాయి.
ఆక్సిటోసిన్‌: తల్లి పాలివ్వడం తల్లి శరీరంలో ఆక్సిటోసిన్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. ఆక్సిటోసిన్‌ను ‘లవ్‌ హార్మోన్‌’ లేక ‘బాండింగ్‌ హార్మోన్‌’ అని కూడా అంటారు. ఆక్సిటోసిన్‌ ప్రభావంతో తల్లికి ప్రశాంతత, విశ్రాంతి, ఆత్మీయత, సంతృప్తి మొదలైన భావనలు కలిగి బిడ్డకు మరింత సన్నిహితం చేస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం పెరుగుదల: బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
సజావుగా బిడ్డకు పాలివ్వగలిగిన తల్లి మానసికంగా దృఢంగా మారుతుంది. సాధికారతా భావన కలుగుతుంది. తన బిడ్డ పట్ల మరింత మమకారంతో వ్యవహరిస్తుంది.
తల్లి పాలను తాగించడం-ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధపై ప్రభావం:
తల్లి పాలు తాగడం కారణంగా శిశువులకు కొంతమేరకు వ్యాధులు నివారింపబడతాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.
తల్లి పాలిచ్చే పద్ధతులపై సామాజిక, సాంస్కృతిక ప్రభావం:
ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక అంశాలు తల్లి పాలిచ్చే పద్ధతులపై ప్రభావాన్ని చూపుతాయి. ఇవి భిన్న ప్రాంతాలలో భిన్నంగా ఉంటాయి. కొన్ని సంస్కృతులో తల్లి పాలివ్వడం తప్పనిసరి కట్టుబాటు. కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాల్లో తల్లి పాలివ్వడం తప్పుగా పరిగణింపబడుతుంది. కొన్ని ప్రాంతాలలో తల్లి పాలను చాలా విలువైనవిగా భావిస్తారు. అలాంటిచోట తల్లిపాలివ్వడం చాలా సహజంగా జరిగిపోతుంది.
కుటుంబం, సమాజం సపోర్ట్‌ ఉంటే బిడ్డకు తన పాలనే ఇవ్వాలనే నిర్ణయాన్ని తల్లి సులభంగా తీసుకోగలుగుతుంది. సమర్ధంగా ఆచరిస్తుంది. పనిచేసేచోట, సమాజంలో సపోర్ట్‌ ఉంటే తల్లి తన పాలనిచ్చే బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలుగుతుంది
తల్లి పాలను ఇవ్వడంలో వచ్చే సవాళ్ళు:
పోతపాలను పట్టే ధోరణి పెరగడం: పోతపాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా దూకుడుగా, రకరకాల యుక్తులతో, విభిన్న ఆకర్షణలతో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నాయి. తల్లిపాల వలన కలిగే లాభాలను మరుగున పడేసి, తల్లిపాలతో సమానంగా లేక తల్లిపాల కంటే పోతపాలే బిడ్డకు ఎక్కువ ఆరోగ్యాన్నిస్తాయనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వీనివల్ల బిడ్డకు పాలివ్వాలనుకునే తల్లులు అయోమయంలో పడుతున్నారు.
అవగాహన లేకపోవడం: తల్లి పాల వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన లేకపోవడం.
3.పని ప్రదేశం, ఉద్యోగ సంబంధిత సమస్యలు: ప్రసవం తరువాత తిరిగి ఉద్యోగానికి వెళ్లాల్సిరావడం తల్లి బిడ్డకి పాలనివ్వడానికి ఆటంకం కలిగిస్తుంది. సరిపడా మెటర్నటీ శెలవు లేకపోవడం, పనిచేసేటప్పుడు బిడ్డకు పాలిచ్చే విరామాలు లేకపోవడం, పని ప్రదేశాలలో పాలివ్వడానికి తగిన సౌకర్యం లేకపోవడం వంటివి ఎన్నో వున్నాయి.
పాలు సరిపోవడం లేదనే భ్రమ: కొంతమంది తల్లులు తమ పాలు సరిపోవడం లేదనే భ్రమతో పోత పాలను ప్రారంభిస్తారు.
తల్లుల అవగాహనాలోపం: కొంతమంది తల్లులు బిడ్డకు పాలివ్వడం కారణంగా తమ అందం, శరీరాకృతి దెబ్బతింటాయని భావిస్తారు. కొంతమంది తమ రొమ్ముల ఆకారం గురించి కూడా ఆందోళన పడతారు. ప్రసవం తరవాత అతిగా తింటూ, వ్యాయామం చెయ్యక పోవడం వలన శరీరాకృతి మారుతుంది తప్ప పాలివ్వడం వలన కాదు.
కొంతమంది తల్లులు పాలివ్వడం వలన నీరసం వస్తూందని తమ పాలు ఆపేసి పోతపాలు పడతామంటారు. కాని పోతపాలు పడితే పాల సీపాల్ని, పాలు కలిపే పాత్రల్ని స్టెరిలైజ్‌ చెయ్యడం, పాలు కలపడం, పట్టడం మరింత ఎక్కువ శ్రమను కలిగించే పనులు. నీరసంగా ఉంటే ఎక్కువ శక్తినిచ్చే పోషకాహారాన్ని తినాలి. నీటిని పుష్కలంగా తాగాలి. సరిపడా నిద్రపోవాలి. అంతేకాని ఆ కారణంతో బిడ్డకు పాలివ్వడం మానకూడదు.
ఇంక బిడ్డకు ఎంత తరచుగా పాలివ్వాలి అనే సందేహం కూడా కొంతమంది తల్లులకు కలుగుతుంది. నిర్ణీత సమయంలో పాలను డిమాండ్‌ చేసేలాగా బిడ్డకు అలవాటు చెయ్యడం మంచిదే. కాని మరీ ఆకలితో అలమటించిపోతున్నప్పుడు కూడా పాలివ్వకుండా ఉండడం మంచిది కాదు. కడుపు నిండా పాలు తాగి ఆరోగ్యంగా ఉండే బిడ్డ టైం ప్రకారమే పాలకోసం ఏడుస్తుంది. బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ ఆకలితోనే కాదని కూడా గుర్తుంచుకోవాలి.
ఈ అవగాహనను తల్లులకు ఇచ్చి పోతపాల ఉత్పత్తిదారుల అబద్ధపు ప్రచారాన్ని ఎదుర్కొందాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుందాం.
బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి గల ప్రయోజనాలు:
ప్రసవమైన వెంటనే బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి కుడా అనేక లాభాలు వుంటాయి.
ప్రసవం తరవాత త్వరగా కోలుకుంటుంది.
పాలను ఉత్పత్తి చెయ్యడానికి ఖర్చయే కేలరీలు తల్లి గర్భం సమయంలో పెరిగిన బరువు తగ్గేలా చేస్తాయి.
ఎముకల ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తుంది
బిడ్డకు పాలివ్వడం వల్ల ప్రసవానంతరం అధిక రక్తస్రావం అవకుండా నిరోధిస్తుంది.
కొంతమందికి ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్‌ ప్రమాదం తగ్గుతుంది.
రొమ్ము, గర్భాశయం, ఒవేరియన్‌ కేన్సర్ల ప్రమాదం తగ్గుతుంది.
టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదం తగ్గుతుంది.
పూర్తిగా తన పాలను మాత్రమే ఇచ్చే తల్లికి ఇది సహజ గర్భ నిరోధక సాధనంగా ఉపయోగపడుతుంది. గర్భాశయం గర్భం రాకముందు స్ధితికి రావడానికి సహాయపడుతుంది. భావోద్వేగ పరమైన అనుబంధం ఏర్పడుతుంది.
2030 వ సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ లక్ష్యాలు
70%- మొదటి గంటలోపు బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ని మొదలు పెట్టడం
70% -పూర్తిగా బ్రెస్ట్‌ ఫీడింగ్‌
80%-మొదటి సంవత్సరానికి
60%-2 సంవత్సరాలకు
పాలిచ్చే తల్లి తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు:

ఆహారం: గర్భవతిగా ఉన్నప్పటికంటే పాలిస్తున్నప్పుడు ఎక్కువ బలమైన ఆహారాన్ని, అదనంగా 400 కేలరీలు ఎక్కువ ఉండేంత ఆహారాన్ని తినాలి. సుమారుగా 1 లీటర్‌ పాలు, 3 లీటర్ల నీరు లేక ఇతర ద్రవాల్ని తీసుకోవాలి. వరి, గోధుమ, జొన్న లాంటి ప్రధాన ఆహారం, అన్ని రకాల పప్పులు, ఆకుకూరలు, కాయగూరలు, ఉడికించిన గుడ్డు, మాంసం, చేపలు, పండ్లు, నట్స్‌ని తినాలి. పచ్చళ్లు, కారం, మషాళా పదార్ధాల్ని మానేయాలి.
తల్లి మానసిక స్ధితి మీద పాల ఉత్పత్తి కొంతవరకు ఆధారపడి ఉంటుంది. బాధ, ఆందోళన, కోపం, చిరాకు, ఒత్తిడి పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందుచేత పాలిచ్చే తల్లి ఎల్లప్పుడూ, ముఖ్యంగా పాలిచ్చేటప్పుడు సాధ్యమైనంత ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి. బిడ్డకు పాలివ్వడంలోని ఆనందాన్ని మనసారా అనుభవించాలి. పాలివ్వగానే పాపాయిని భుజంమీద వేసుకుని తేన్పు వచ్చేదాకా వీపు మీద మృదువుగా తట్టాలి. పాలిచ్చే ముందు, తరవాత గోరువెచ్చని నీటితో రొమ్ముల్ని శుభ్రం చేసుకోవాలి.
బిడ్డకు పాలు సరిపోతున్నాయా లేదా అనేది చాలామంది తల్లుల్ని వేధించే ప్రశ్న. చురుగ్గా, సంతృప్తిగా పాలు తాగి, హాయిగా నిద్ర పోయి, సక్రమంగా పెరుగుతూంటే, విరేచనం, మూత్రం సక్రమంగా అవుతూంటే పాలు సరిపోతున్నట్లే లెక్క.
సంపూర్ణంగా తన పాలను మాత్రమే, వీలైనంత ఎక్కువ కాలం, ముఖ్యంగా మొదటి 6 నెలలు ఇవ్వడంతో తమ బిడ్డకు జీవిత పర్యంత ఆరోగ్యానికి పునాది వేస్తున్నామనే విశ్వాసంతో, సానుకూల దృక్పధంతో తల్లులు తమబిడ్డలకు పాలిస్తే శిశు మరణాలు చాలా వరకు నివారింపబడతాయి.
తల్లి పాలను తాగించడం- కుటుంబంపై ప్రభావం: కుటుంబానికి పోతపాలకు వెచ్చించే డబ్బు ఆదా అవుతుంది. పోతపాల కారణంగా సోకే వ్యాధుల బెడద ఉండదు కనుక శిశువుల ఆరోగ్యానికి వెచ్చించే డబ్బు ఆదా అవుతుంది.
తల్లి పాలను తాగించడం- పర్యావరణంపై ప్రభావం: పోతపాలను పట్టించేటప్పుడు ఉపయోగించే పాలపీకలు, సీసాలు, పాలపాకెట్లు మొదలైన వ్యర్ధాల వలన పర్యావరణానికి కలిగే నష్టం తగ్గుతుంది.
డా||ఆలూరి విజయలక్ష్మి, శీ శ్రీ హౌలిస్టిక్‌ హాస్పటల్‌

Spread the love