దృక్పథం


Attitude is everything అన్నారు. మన జీవితం ఏ దిశగా సాగాలో, ఏ ఒడ్డుకు చేరాలో ఏయే కష్టనష్టాలకు, సుఖసంతోషాలకు గురికావాలనేది మన మీదే ఆధారపడి వుంటుంది. అంటే ఇదంతా పుట్టుకతో వారసత్వంగా సంక్రమించేది కాదు. మనం క్రమేపీ ఏర్పరచుకునేది. పెంపొందించుకునేది. ‘ప్రతి మనిషి తన జీవితాన్ని తానే రూపొందించుకుంటాడు’ అన్నాడు సల్లస్ట్‌.
మనల్ని మనం సంస్కారవంతులుగా, ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మూలం మన దక్పథం. మన మనస్సు ఎలా ఆలోచిస్తుందో అలానే ఎదుటివారి భావాలు మనకు అర్ధమవుతాయి. ఈ ప్రపంచాన్ని చూడటానికి, అవగాహన చేసుకోవడానికి, దానితో సన్నిహిత సంబంధాలు నెరపడానికి మన మనస్సే మనకు అద్దంలాంటిది. మన ఎదుట ఉన్న అద్దంలో మన బింబమే మనకు కనిపిస్తుంది తప్ప వేరుగా కనిపించదు. తాజ్‌ మహల్‌ ను అందరూ ప్రేమకు చిహ్నంగా, ప్రపంచ వింతలలో ఒకటిగా చూస్తే, వర్ణిస్తే, ఆ అద్భుత కట్టడం తయారుకావడం వెనుక ఎంత శ్రమ శక్తి దాగివుందో, అందుకు ఎన్ని వందల మంది కూలీలు అహౌరాత్రులు ఎండనక, వాననక కష్టించారో ఆ శ్రమశక్తిని శ్రీశ్రీ చూశాడు. అది దృక్పథం అంటే. సరైన దృక్పథాన్ని ప్రదర్శించడం అలవరచుకున్నప్పుడు మన జీవితం సరైన దిశలోనే సాగుతుంది.
సాధారణంగా దృక్పథమన్నది ఆ ”మనిషి చుట్టూ వుండే పరిసరాలు, కుటుంబ వాతావరణం, చదువు, సంస్కారం, అనుభవాలపై ఆధారపడి వుంటుంది. పుస్తక పఠనం, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, మత విశ్వాసాలు ఇవి కూడా మన దృక్పథం రూపుదిద్దుకోవడంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేస్తుంటాయి. నేడు టీవీ కార్యక్రమాలు పెరగడం వల్ల పిల్లలపై వాటి ప్రభావం అత్యధికంగా పడుతోంది. అంటే శాస్త్ర సాంకేతిక ప్రగతి ప్రభావం కూడా పరోక్షంగా పిల్లల మనస్తత్వాన్ని తీర్చిదిద్దుతోంది. టీవీ ప్రసారాలలో భయానకమైన హింస ఆ పసి హదయాలపై పనిచేస్తున్నది. వారిలో జాలి, దయ, కరుణ బదులుగా ద్వేషం, పగ, ప్రతీకారం వంటి లక్షణాలు, స్త్రీని సెక్స్‌ సింబల్‌గా పరిగణించే వికత మనస్తత్వం చోటు చేసుకుంటున్నది. తెలుగు సీరియల్స్‌ చూసే మహిళల్లో అత్త అంటే కోడలికు, కోడలంటే అత్తకు ఏవగింపు. భర్త అంటే అనుమానం… ఈ విపరీత భావజాలం పోగుపడిపోతున్నది.
దృక్పథాలు రెండు రకాలు. సానుకూలం, ప్రతికూలం. సానుకూల దృక్పథాన్ని అలవరచుకోగలిగిన వ్యక్తులే ఆయా రంగాలలో రాణించగలుగుతారు. లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. విజేతలుగా నిలుస్తారు. ‘నేను చేయగలను’ అన్న నమ్మకం వేయి ఏనుగుల బలాన్నిస్తుంది. మన సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. మన దారిలో కొన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురుకావచ్చు. కొన్ని అపజయాలు కూడా రావొచ్చు. అయినా సానుకూల దృక్పథాన్ని వీడకూడదు. ప్రశ్నించడం, తెలుసుకోవడం కూడా ప్రతికూల దృక్పథాలుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రశ్న అనేది సానుకూల అంశమే. సానుకూల దక్పథంలో మన జీవితానికి ఇటుక ఇటుక పేర్చుకోవడమా, ప్రతికూల దృక్పథంతో వాటిని కూల్చుకోవడమా అన్నది మన చేతుల్లోనే వుంది.

– అనంతోజు మోహన్‌ కృష్ణ

Spread the love