ప్రేమ విలాపం

నిజానికి కన్న బిడ్డల్ని చంపుకోవాలని ఏ తల్లిదండ్రులకూ ఉండదు. చుట్టూ సమాజం తమ కుటుంబం గురించి ఏమనుకుంటుందో అనే ఆందోళనే వీరితో ఇలాంటి ఘాతుకాలను చేయిస్తుంది. ప్రాణాల కంటే పరువే ముఖ్యం అనే స్థాయికి దిగజార్చుతుంది. కులంతో పాటు ధనం కూడా ఇక్కడ ప్రధాన పాత్రే పోషిస్తుంది. అయితే ప్రాణాలు కోల్పోయినా ప్రేమను మాత్రం ఎప్పటికీ కోల్పోలేమనే వాస్తవాన్ని ఆవేశంలో గ్రహించలేకపోతున్నారు. ఈ సమాజాన్ని నడిపించేది ప్రేమేనని గుర్తించలేకపోతున్నారు.
ప్రేమ సార్వత్రికం… సార్వజనీనం. ప్రేమ ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరిపైనైనా పుట్టొచ్చు. ప్రేమ ఎక్కడైనా ప్రేమే. ప్రేమ, స్థలం, ప్రాతం, రంగు, కులం, మతం, పేద, ధనిక, జాతి అనే తేడాలు చూడదు, చూడలేదు. అలా చూస్తే అది అసలు ప్రేమే కాదు. మనిషిలోని పరిపూర్ణ హృదయ గుణమే ప్రేమ. అలాంటి స్వచ్ఛమైన ప్రేమతో శత్రువునైనా జయించవచ్చు. అందుకే ప్రేమ ఎప్పుడూ గొప్పది.
అయితే నేడు మనం ప్రేమను ద్వంసం చేసే సంస్కృతిలో బతుకుతున్నాం. ఆ సంస్కృతే ఇటీవల వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట మండలం, ఇటుకాలపెల్లి గ్రామంలో నాలుగు ఇండ్లను కాల్చిబూడిద చేసింది. ఆ జంట జీవితాంతం కలిసి బతుకుదామని బాసలు చేసుకున్నారు. ప్రేమతో ఒకటి కావాలనుకున్నారు. ఇంట్లో పెండ్లికి ఒప్పుకోరనే భయమో ఏమో స్నేహితుల సహకారంతో పెండ్లి చేసుకున్నారు. కూతురు ప్రేమ పెండ్లి చేసుకుందనే కోపంతో ఆ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. సర్పంచ్‌ అనే అధికారం ఉండటంతో ఇక తనకు ఎదురే లేదనుకున్నాడు. కూతురు ప్రేమించిన అబ్బాయి ఇంటితో పాటు పెండ్లికి సహకరించిన స్నేహితుల ఇండ్లను సైతం తగలబెట్టించాడు. ఫలితంగా ఇప్పుడు నాలుగు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఇలాంటి దారుణాలు సమాజానికి కొత్తేమీ కాదు. గతంలోనూ ప్రేమ ఎన్నోసార్లు కత్తి పోట్లకు గురయ్యింది. అగ్నికి ఆహుతయ్యింది. తక్కువ కులం అబ్బాయిని బిడ్డ పెండ్లి చేసుకుందని హత్యలకు పాల్పడిన కన్నవారిని ఎందరినో మనం చూశాము, చూస్తూనే ఉన్నాము. తమ గుండెలపై ఆడుకున్న బిడ్డల ప్రాణాలు పోతే పోనీ, పరువు ముఖ్యం అనుకుంటున్న కన్నవారు ఎందరో కులదురహంకార హత్యలకు పాల్పడ్డారు, పాల్పడుతూనే ఉన్నారు.
నిజానికి కన్న బిడ్డల్ని చంపుకోవాలని ఏ తల్లిదండ్రులకూ ఉండదు. చుట్టూ సమాజం తమ కుటుంబం గురించి ఏమనుకుంటుందో అనే ఆందోళనే వీరితో ఇలాంటి ఘాతుకాలను చేయిస్తుంది. ప్రాణాల కంటే పరువే ముఖ్యం అనే స్థాయికి దిగజార్చుతుంది. కులంతో పాటు ధనం కూడా ఇక్కడ ప్రధాన పాత్రే పోషిస్తుంది. అయితే ప్రాణాలు కోల్పోయినా ప్రేమను మాత్రం ఎప్పటికీ కోల్పోలేమనే వాస్తవాన్ని ఆవేశంలో గ్రహించలేకపోతున్నారు. ఈ సమాజాన్ని నడిపించేది ప్రేమేనని గుర్తించలేకపోతున్నారు.
మన దేశంలో తరతరాలుగా కులం అనేది ప్రేమకు పెద్ద అడ్డంకిగా ఉంది. కులం పెట్టే చిచ్చుకి ఇప్పుడు మతోన్మాదం ఆజ్యం పోస్తున్నది. ప్రేమ విలాపంగా మిగిలిపోకూడదనుకుంటే ప్రేమను బతికించుకోవాలి. అందుకు ప్రేమను ద్వంసం చేయాలని చూస్తున్న ఉన్మాద సంస్కృతిని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రేమను కాపాడుకోవల్సిన అవసరం అంతకన్నా ఎక్కువగా ఉంది.
ప్రేమంటే కేవలం యువతీ యువకుల మధ్య పుట్టేదే కాదు. ప్రతి మనిషిలోనూ తోటి మనిషి పట్ల ప్రేమ సహజంగా పుట్టాలి. ఎందుకంటే మనుషుల్లో ప్రేమతత్వం కరువైతే సమాజం నిజమైన అభివృద్ధి పథంలో నడవలేదు. అసలు సమాజమే మనుగడ సాగించలేదు. మనిషిలో మానవత్వం చిగురించాలంటే అది ఒక్క ప్రేమతోనే సాధ్యం. విలువలతో కూడిన జీవితాన్ని ప్రేమ మాత్రమే అందించగలదు. అందుకే ప్రేమ చిరంజీవి కావాలి. ప్రేమ చిరకాలం వర్ధిల్లాలి. ప్రేమికులు వర్థిల్లాలి! తల్లిదండ్రులారా! ప్రేమను ఆశీర్వదించండి.

Spread the love