సొంతిల్లు

నగరాల్లో సరైన వసతి గల ఇళ్ళకోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం గా తిరిగేవాళ్ళు ఎంతోమంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అద్దె ఇంటికోసం వెళ్తే ఎదురయ్యే ప్రశ్నలు… ‘మీరు ఎవరు?’ (డైరెక్ట్‌ చెప్పాలంటే మీరే కులం). ఫలానా కులం వారికి మాత్రమే ఇల్లు ఇస్తాం, ఫలానా కులం వారికి ఇల్లు ఇవ్వం, ‘నాన్‌వెజ్‌ తినేవారికి ఇల్లు ఇవ్వం’ అని చెప్తుంటారు. మరికొన్ని ఇళ్ళ ముందైతే బోర్డులే కనిపిస్తుంటాయి… ‘వెజిటేరియన్స్‌కి మాత్రమే’ అని. అందరూ ఇలా చెప్తుంటే ఇక అద్దిళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎవరికి దొరుకుతాయి? ఒకవేళ ఇల్లు దొరికినా సవాలక్ష కండీషన్లు. అందరికీ ఉన్న పళంగా ఇల్లు కొనుక్కోగలిగే స్థోమత, స్థితి వుండాలి కదా!
ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే అందులోని కష్టనష్టాల గురించి ఇల్లు కట్టినవాళ్ళకి, పెళ్ళి చేసిన వాళ్ళకే తెలుస్తుంది. పెళ్ళి సంగతి పక్కన పెడితే ఇల్లు ప్రతి ఒక్కరికీ అవసరం. మనిషికి కనీస అవసరాలు మూడు. కూడు, గూడు, గుడ్డ. తినడానికి కడుపు నిండా తిండి, కట్టుకోడానికి బట్టల తర్వాత, తల దాచుకోడానికి ఓ గూడు అవసరం. అది అద్దె ఇల్లా? సొంతిల్లా? అన్న ప్రశ్న వస్తే… సొంతింటికే ఎక్కువ ఓట్లు పడతాయి. ఎందుకంటే అద్దె ఇంట్లో వుండే కష్టాలు అలాంటివి మరి. ఇంట్లో వుండడానికి కాదు, ముందు ఇల్లు దొరకడానికే ఎక్కువ తిప్పలు పడాల్సి వస్తుంది. గ్రామాల్లో అద్దె ఇళ్ళు ఎక్కువ అవసరం లేకపోవచ్చు. చిన్నపాటి పట్టణాల నుండి ప్రస్తుతం ఉద్యోగాల కోసం నగరాలకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. జనాభాకి తగ్గట్టు ఇళ్ళు కూడా వుండాలి.
నగరాల్లో సరైన వసతి గల ఇళ్ళకోసం ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం గా తిరిగేవాళ్ళు ఎంతోమంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అద్దె ఇంటికోసం వెళ్తే ఎదురయ్యే ప్రశ్నలు… ‘మీరు ఎవరు?’ (డైరెక్ట్‌గా చెప్పాలంటే మీరే కులం). ఫలానా కులం వారికి మాత్రమే ఇల్లు ఇస్తాం, ఫలానా కులం వారికి ఇల్లు ఇవ్వం, ‘నాన్‌వెజ్‌ తినేవారికి ఇల్లు ఇవ్వం’ అని చెప్తుంటారు. మరికొన్ని ఇళ్ళ ముందైతే బోర్డులే కనిపిస్తుంటాయి… ‘వెజిటేరియన్స్‌కి మాత్రమే’ అని. అందరూ ఇలా చెప్తుంటే ఇక అద్దిళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎవరికి దొరుకుతాయి? ఒకవేళ ఇల్లు దొరికినా సవాలక్ష కండీషన్లు. అందరికీ ఉన్న పళంగా ఇల్లు కొనుక్కోగలిగే స్థోమత, స్థితి వుండాలి కదా!
కులం ఒక కారణమైతే, ఇంకో కారణం… చనిపోయిన వారిని ఇంట్లోకి తీసుకురానివ్వకపోవడం. ఒకవేళ ఇంటి యజమాని ఒప్పుకున్నా, చుట్టుపక్కల వాళ్ళు రకరకాల కారణాలు చెప్పి నిరాకరిస్తున్నారు. దాంతో తమవారి మృతదేహాన్ని అద్దెఇంటి ముందుకు కూడా తీసుకురాలేక, సొంతింటికి తీసుకెళ్ళే అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇంకొంతమందైతే ఆస్పత్రుల్లో చేరినవారికి సీరియస్‌గా వుందన్నా ఇంటికి తీసుకురావద్దని ముందే చెప్పేస్తున్నారు. అందుకే ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అటునుండి అటే కాటికి తీసుకెళ్ళిన వాళ్ళ బాధలు ఎన్నో.
అందుకే పేదలైనా, ధనికులైనా ప్రతివాళ్ళకి సొంతిల్లు కట్టుకోవాలనేది ఓ కల. ఆ కల కొంతమందికి తీరుతుంది. మరికొంతమందికి కలలాగే మిగిలిపోతుంది. మన పెద్ద వాళ్ళు అంటుంటారు… తిన్నా తినకపోయినా ఎవరూ చూడరు, సొంత ఇల్లంటూ ఒకటి వుండాలి అని. అది నిజమే! మనం తిన్నా తినకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ తలదాచుకోడానికి ఓ నీడ వుండాలి. అది అద్దె ఇల్లు కంటే సొంత ఇల్లైతే మంచిది కదా. అది గుడిసైనా, మిద్తైనా, డాబా అయినా… ఏదైనా ఇల్లే. కాకపోతే ఆ ఇల్లు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పటిష్టంగా వుండాలి. ఈ పరిస్థితుల వల్లే ఇటీవల చాలామంది బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇ.ఎం.ఐ లు కడుతూ సొంతింటిని కొంటున్నారు. ఆ అవకాశం కూడా లేని పేదలు ప్రభుత్వాన్ని ఇంటి జాగా కానీ, ఇల్లు కానీ కావాలని అడుగుతున్నారు. గ్రామాల్లోనైతే ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. నిరంతరం ప్రజాసమస్యలను అందరికీ తెలియజేసే జర్నలిస్టులు కూడా అరకొర జీతాలతో అద్దెల బాధ పడలేక సొంతింటి కోసమే ధర్నాలు చేస్తున్నారు. వీరందరి ఆరాటం కూడా నీడ కోసమే కానీ, కోట్లు కూడబెట్టుకోడానికి కాదు. ప్రభుత్వం తలచుకుంటే అందరికీ ఇండ్లు అసాధ్యమేమీ కాదు. మరి అందరికీ సొంతింటి కల నెరవేరేనా!?

Spread the love