ఆత్మవిశ్వాసం

తమ శక్తి సామర్ధ్యాలపై తమకు సరైన అవగాహన ఉన్నవారు మాత్రమే ఆత్మ విశ్వాసంతో ఉండగలరు. ఆత్మ విశ్వాసం లేనివారు తమని తాము ఎక్కువ అంచనా వేసుకోవడమో లేక తక్కువ అంచనా వేసుకోవడమో జరుగుతుంది. కాబట్టి మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ పరిపూర్ణమై పరిజ్ఞానంతో వుంటే ఆత్మ విశ్వాసాన్ని వృద్ది చేసుకోవచ్చు.
ప్రతి మనిషికీ తనపై తనకు నమ్మకం ఉండటం చాలా అవసరం. దీనినే ఆత్మ విశ్వాసం అని అంటారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఉండవలసినది ఆత్మ విశ్వాసం. అంటే తనపై తనకు సంపూర్ణ విశ్వాసం. ఆత్మ విశ్వాసం లేకపోతే మనుగడ కష్టం. ఏదో అలా జీవిస్తూ ఉంటాము కానీ ఎందుకు జీవిస్తున్నామో తెలియదు.
ఎవరైతే ఆత్మ విశ్వాసంతో పని మొదలుపెడతారో వారినే విజయం వరిస్తుంది. ఎవరికైనా వారి మీద వారికి ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. నేను తలపెట్టిన పనిని నిస్సందేహంగా పూర్తి చేస్తాననే సంకల్పం ఉండాలి. ఒక వ్యక్తి మాట మరొకరు వినాలంటే, చెబుతున్న విషయంలో ఆ వ్యక్తి విజయవంతం అయి ఉండాలి. అప్పుడే ఆ విషయంలో ఇతరులు వారి సలహాను స్వీకరిస్తారు. అంతేకానీ పనిలో విజయం సాధించకుండా, ఆ పనిని గురించి మరొకరికి ప్రవచనాలు చెబతే, ఆ మాటలను ఎవరూ పట్టించుకోరు.
విద్యార్ధికైనా, ఉద్యోగికైనా ఆత్మ విశ్వాసం ప్రధానం. ఒక ఉద్యోగికి ఆత్మ విశ్వాసం ఉంటే ఆ ఉద్యోగి వలన ఆ వ్యవస్థకు ప్రయోజనం ఎక్కువ. అలా కాకుండా ఉద్యోగికి ఆత్మ విశ్వాసం లేకపోతే తనకు, తాను పనిచేస్తున్న వ్యవస్థకు కూడా నష్టమే. అలాగే విద్యార్ధికి ఆత్మ విశ్వాసం వుంటే చదువులో రాణించడం సులభం. అందుకే పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాలి.
వ్యక్తికి తన శక్తిపై తనకున్న అవగాహనను బట్టి ఆత్మ విశ్వాసం ఉంటుంది. కాబట్టి ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహనే మన మాటల్లో ధ్వనిస్తుంది. అయితే ఇక్కడ మనం ఓ విషయం గుర్తించాలి. ఆత్మ విశ్వాసానికీ, అతి విశ్వాసానికి తేడా ఉంది. మనల్ని మనం ఎక్కువ అంచనా వేసుకోవడం అతి విశ్వాసం. ఆ పని ‘నేను చేయాలను’ అనుకోవడం విశ్వాసం. ‘నేను మాత్రమే చేయగలను’ అనుకోవడం అతి విశ్వాసం. ఈ అతి విశ్వాసం వల్ల నష్టమే ఎక్కువ. అనుకున్న ఫలితం సాధించడంలో అతి విశ్వాసం పనికిరాదు.
తమ శక్తి సామర్ధ్యాలపై తమకు సరైన అవగాహన ఉన్నవారు మాత్రమే ఆత్మ విశ్వాసంతో ఉండగలరు. ఆత్మ విశ్వాసం లేనివారు తమని తాము ఎక్కువ అంచనా వేసుకోవడమో లేక తక్కువ అంచనా వేసుకోవడమో జరుగుతుంది. కాబట్టి మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ పరిపూర్ణమై పరిజ్ఞానంతో వుంటే ఆత్మ విశ్వాసాన్ని వృద్ది చేసుకోవచ్చు. సాధారణంగా మనోబలం తక్కువగా ఉన్నవారికి, ప్రతి విషయానికి భయపడేవారికి ఆత్మ విశ్వాసం లోపిస్తుంది. విషయాలపై సరైన అవగాహన, తమపై తమకు పూర్తి అవగాహన ఉండాలంటే అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. అధ్యయనం ద్వారా మనలోని భయాందోళనలను దూరం చేసుకోవచ్చు. అలాగే ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపొతే ఏ రంగంలోనైనా సరిగ్గా రాణించలేరు.
ఆత్మవిశ్వాసం మనిషికి ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది. అనుకున్న పనిని అనుకున్నట్టు సాధించడానికి ఇది చాలా తోడ్పడుతుంది. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే అంత బాగా మనం జీవితం రాణించవచ్చు. మనలోని విశ్వాసమే మన తోటి వాళ్ళలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మనవాళ్ళ విశ్వాసాన్ని చూరగొనడమే మనలో ఉన్న ఆత్మ విశ్వాసానికి ప్రతీక. విజయం సాధించిన వారికి, సాధించని వారికి మధ్య తేడా ఈ ఆత్మవిశ్వాసమే అని మనమంతా తెలుసుకోవాలి.

Spread the love