స్వాతంత్య్రం…

బ్రిటిష్‌ వారిని తరిమేస్తే అందరూ స్వేచ్ఛగా, గౌరవంగా బతకొచ్చని, మహిళలకు సమానత్వం వస్తుందని, నిరుద్యోగం సమసిపోతుందని, విద్యా, వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని ఆశపడ్డాం, కలలు కన్నాం. దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏండ్లకే ఉరికొయ్యను ముద్దాడిన భగత్‌సింగ్‌ ఆనాడే సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకున్నాడు. నిజమైన స్వేచ్ఛ, గౌరవం, ఉపాధి, సమానత్వం, హింస లేని సమాజం, విద్యా, వైద్యం అందరికీ దక్కడమే ఆ వీరుడు కోరుకున్న సంపూర్ణ స్వాతంత్య్రం. మరి అది మనకు దక్కిందా..?

‘ఎందరొ వీరుల త్యాగఫలం. మన దేశ క్తీరికిది మూలధనం’. రెండు వందల ఏండ్లు మనల్ని పాలించిన బ్రిటిష్‌ వారిని ఐక్యంగా తరిమికొట్టాం. 75 ఏండ్ల కిందట సరిగ్గా ఇదే రోజున మన దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నాం. స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నాం. అప్పటి నుంచి ప్రతి ఆగస్టు 15వ తేదీన త్రివర్ణపతాకాన్ని ఎగరేసి, స్వీట్లు పంచుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం.
మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. గాంధీ అంటరాని తనం అంతమవ్వాలని తపించాడు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్య్రం అన్నాడు. నెహ్రూ సమానత్వాన్ని కోరుకున్నారు. ఇలాంటి వారెందరో మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారు.
స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే ఎవరి చేతా నిర్బంధించబడకుండా, నియంత్రించబడకుండా ఎవరు కోరుకున్న జీవితం వారు బతకడం. పని చేయడానికి, మాట్లాడటానికి, చెప్పడానికి, ఆలోచించడానికి మనకున్న హక్కు. అలాంటి హక్కు పుట్టిన ప్రతి మనిషికి ఉండాలి. అయితే 75 ఏండ్ల ఈ స్వతంత్య్ర భారతావనిలో ఆ వీరుల త్యాగఫలం ఎందరికి దక్కిందో మనల్ని మనం ప్రశ్నించుకోవల్సిన తరుణం ఇది.
బ్రిటిష్‌ వారిని తరిమేస్తే అందరూ స్వేచ్ఛగా, గౌరవంగా బతకొచ్చని, మహిళలకు సమానత్వం వస్తుందని, నిరుద్యోగం సమసిపోతుందని, విద్యా, వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని ఆశపడ్డాం, కలలు కన్నాం. దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏండ్లకే ఉరికొయ్యను ముద్దాడిన భగత్‌సింగ్‌ ఆనాడే సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుకున్నాడు. నిజమైన స్వేచ్ఛ, గౌరవం, ఉపాధి, సమానత్వం, హింస లేని సమాజం, విద్యా, వైద్యం అందరికీ దక్కడమే ఆ వీరుడు కోరుకున్న సంపూర్ణ స్వాతంత్య్రం. మరి అది మనకు దక్కిందా..?
దక్కకపోగా మనుషుల బతుకులు మరింతగా దిగజారిపోతున్నాయి. పరపీడనను వదిలించుకున్నా స్వపీడనను వదిలించుకోలేకున్నాం. పట్టపగలే అందరూ చూస్తుండగా మహిళలను వివస్త్రలను చేసిన దేశంగా చరిత్రకెక్కాం. స్వార్థం కోసం మనుషుల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న మనుషుల మధ్య బతుకుతున్నాం. హిందూ, ముస్లిం భాయి భాయి అంటూ అలారు బలారు చేసుకునే దేశంలో విచ్ఛిన్నానికి ఆజ్యం పోస్తున్న వారితో సహజీవనం చేస్తున్నాం. మణిపూర్‌ మంటల్లో దేశం మాడిమసైపోతున్న సమయంలో అమృతోత్సవ వేడుకలను ముగించుకోబోతున్నాం.
ఇలాగే చూస్తూ ఊరుకుంటే దేశం మరింత ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ‘తెలుగు వీర లేవర, దీక్షపూని సాగర, దేశ మాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయర’ అన్న అల్లూరి స్ఫూర్తిని మదినిండా నింపుకొని, గాంధీజీ కోరుకున్న నిజమైన స్వాతంత్య్రం కోసం ఐక్యంగా నిలబడదాం. ఆ వీరుల కలలను నిజం చేద్దాం. వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేద్దాం. ఈ దేశ పౌరులుగా రుణం తీర్చుకుందాం…

Spread the love