స్నేహం

స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది. జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది. ప్రతి మనిషి జీవితంలో అమ్మ ప్రేమ ఎంతో ముఖ్యమో స్నేహం కూడా అంతే ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. అయితే ఆ స్నేహం పవిత్రమైనదై ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. స్నేహం ఒక తీయని జ్ఞాపకం. జీవిత ప్రయాణంలో స్నేహ బంధానికి మించింది లేదు. అందుకే ‘స్నేహానికన్న మిన్న… లోకన లేదురా…’ అంటాడు ఓ సినీ గేయ రచయిత.
మనిషి సంఘజీవి. కాబట్టి సమాజంలోని ప్రతి మనిషి ఏదో ఒక సంబంధానికి కట్టుబడి ఉండాల్సిందే. పుట్టినప్పటి నుండి జీవిత ప్రయాణంలో అనేక బంధాలు, అనుబంధాలు మనకు ఎదురవుతాయి. కుటుంబం మనకు తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తల్లితండ్రులు, మామయ్యలు, తోబుట్టువులు అంటూ ఎన్నో బంధాలను అందిస్తుంది. అయితే ఇవన్నీ పుట్టుకతో మన ప్రమేయం ఏమాత్రం లేకుండా ఏర్పాడే బంధాలు. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయిన ఓ బంధంతో అమితమైన ప్రేమ, ఇష్టాన్ని కలిగి ఉంటాం. ఈ సంబంధం ఎప్పుడూ మనకు అండగా నిలుస్తుంది. మన బాధను దూరం చేస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెబుతుంది. ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అదే స్నేహ బంధం.
ఈ స్నేహ బంధాన్ని మనమే నిర్మించుకోవాలి. స్నేహితులను మాత్రం మనమే నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఒకే వయసు, ఒకే భావాలు, ఒకే ఆలోచనలు కలిగిన వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. అందుకే మన స్నేహితులను బట్టే మన బుద్దులు చెప్పొచ్చు అంటారు పెద్దలు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఓ స్నేహ హస్తం తప్పనిసరిగా ఉంటుంది. తోడబుట్టిన వారితో, కన్నవారితో చెప్పుకోలేని ఎన్నో విషయాలు మనం మన స్నేహితులతో పంచుకుంటాం. అందుకే ఆ బంధానికి అంతటి ప్రాధాన్యం. స్వార్థం, ఈర్ష్యా, ద్వేషం అనేవి మచ్చుకైనా కనబడ కూడని బంధమే స్నేహం. అయితే నేటి ప్రపంచీకరణ యుగంలో అన్ని బంధాలతో పాటు స్నేహ బంధం కూడా కలుషితం అవుతూనే ఉంది. నమ్మిన నేస్తాలను మోసం చేస్తున్న వారిని ఎంతో మందిని నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం.
కులం, మతం, ప్రాంతం, ఆర్థికంతో సంబంధం లేకుండా సాగాల్సిన స్నేహం కూడా వాటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ మార్కెట్‌ మయం అయిపోతున్న నేటి తరుణంలో ప్రేమా, ఆప్యాయతలు, అనుబంధాలు సైతం వస్తువులుగా మారిపోయాయి. కాదు మార్చివేయబడ్డాయి. ఇటువంటి సమాజంలో అసలు నిజమైన స్నేహాలు ఉంటాయా అనే సందేహం రాక తప్పదు.
ప్రపంచ మేధావులు కారల్‌ మార్క్స్‌, ఏంగెల్స్‌ల స్నేహం స్వచ్ఛతకు మారు పేరు. కారల్‌ మార్క్స్‌ బతికున్నప్పుడు సమానత్వం కోసం తపించాడు. దాని కోసం తనకు తెలిసిన ఓ మార్గానికి ప్రపంచానికి చూపాలనుకున్నాడు. అది పూర్తి చేయక ముందే కన్నుమూశాడు. ప్రాణ స్నేహితుని కోరిక తీర్చే బాధ్యత ఏంగేల్స్‌ తన భుజాన వేసుకున్నాడు. వారి స్నేహం ఇప్పుడు మార్క్సిజమై విశ్వమంతా వ్యాపించింది. సమానత్వం కోసం ప్రశ్నిస్తున్నది. కులం, మతం అంటూ మనుషుల మధ్య అడ్డుగోడులు కడుతున్న నేటి సమాజాన్ని బద్దలు కొట్టాలంటే ఇలాంటి స్నేహితులు మరెందరో కావాలి. ఇలాంటి స్నేహాలకు, స్నేహితులకు స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్వాగతం పలుకుదాం…
– సలీమ

Spread the love