జిగ్రీ దోస్తు..

నడక మెల్లిమెల్లిగా
పరుగయ్యే క్రమంలో
నడత కూడ పెద్దమనిషిలా
గాంభీర్యాన్ని తొడుక్కున్నపుడు
బాల్యం కనుమరుగై
నూనూగు మీసాల
నవ యౌవ్వనం మొగ్గ తొడిగేవేళ
నీ రూపంలో ఓ ఆత్మీయమిత్రుడు
నా హదయాన చెరగని
ముద్రేసింది..

కాలంతో పోటీ పడి
పరుగెత్తడానికి
మెల్లిగా నడకతో సాగుతున్న జీవితాన
ఒక్క ఉదుటున పరుగెత్తడం
నేర్పింది నువ్వు కదా..
నువ్వు దరి చేరిన క్షణం
ఆనందం ఆకాశాన్ని అందుకుంది,
ఆత్మవిశ్వాసం శిఖరాగ్రానికి చేరుకుంది..

ఉదయం కళాశాలకు,
సాయంత్రం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌
ట్యూషన్స్‌ వినడానికి
నీతో పాటే నా పయనం
నువ్వు పక్కనుంటే ఎక్కడికైనా
వెళ్ళడానికి సై అనేవాడిని..

డిగ్రీలో కూడా జిగ్రీ దోస్తువు నువ్వే
కొందరు చాలా దూరం నుండి
కూడా నడుస్తూ వస్తే
కొందరు అట్లాస్‌ సైకిల్‌
పెద్ద సీట్లపై కూర్చుని
దర్జాగా వస్తే
నేను నీపై స్టైల్‌ గా కూర్చుని
రయ్యి రయ్యిన దూసుకువచ్చేవాడిని..

ఆ నా ఆత్మీయ స్నేహితుడు
మరెవరో కాదు..
ఒంపులు తిరిగిన హ్యాండిల్‌ తో
సోకులు దిద్దుకున్న బాడీతో
అందమైన చిన్ని సీటుతో
అందరి దష్టిని ఆకర్షించే
బి.ఎస్‌.ఏ.ఎస్‌.ఎల్‌.ఆర్‌ సైకిల్‌..

– సర్ఫరాజ్‌ అన్వర్‌
9440981198

Spread the love