అతడు నిజంగా స్థితప్రజ్ఞుడే… కాకపోతే ఇంతటి ముందుచూపు… ఇంతటి దూరపు ఆలోచన అతడికేలా సాధ్యమవుతుంది. అతడు తన మరణం ద్వారా సరికొత్త మార్గ నిర్దేశనం చేశాడు. మరణం సహజమే అయినా దాన్ని ఊహించుకోవడానికి సిద్ధపడే వారేవరుంటారు. తను మరణించిన తరువాత తన భౌతికకాయం స్వదేశానికి పంపే ఏర్పాటు కూడా ఎవరు చేసుకోగలరు. అందుకే డాక్టర్ ఏపూరి హర్షవర్ధన్ నిజంగా స్థితప్రజ్ఞుడే. స్ఫూర్తిదాయక వాస్తక కధనం జోష్ పాఠకులకు..
ఖమ్మం పట్టణానికి చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతుల పెద్ద కుమారుడు డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్. వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు అందిస్తున్న యువకుడు. డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదివాడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే, డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ మరణించాడు. ఎక్కడ ఖమ్మం, ఎక్కడ ఆస్ట్రేలియా. తన అంతిమ సంస్కారాలు సొంత గడ్డపై జరగాలన్నది అతడి చివరి కోరిక. అనుకున్నట్లే అన్నీ ఖమ్మంలో జరిగేలా ఏర్పాట్లు చేసుకుని చివరి కోరిక తీర్చుకున్నాడు. తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసినా అతడు కుంగిపోలేదు. చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాడు.
అంతలోనే పెండ్లి… అంతలోనే ఎడబాటు
పెండ్లి ఘడియలు వచ్చాయి. వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2020 ఫిబ్రవరి 12 వీరిద్దరి వివాహం అత్యంత ఘనంగా ఖమ్మంలో జరిగింది. వారం రోజులపాటు అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరిగారు. డాక్టర్ హర్ష ఫిబ్రవరి 29 అనగా లీఫ్ సంవత్సరం నాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు.
సింధు కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఆస్ట్రేలియా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది. కానీ మార్చి 23 2020 నుండి కరోనా డేంజర్ బెల్స్. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్. ఆమె ప్రయాణం వాయిదా పడింది. అంతలోనే ఊహించని ఉపధృవం వచ్చిపడింది. స్వతహాగానే హర్షకు పరిశుభ్రత అంటే ప్రాణం. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. స్వయంగా వంట చేసుకునేవాడు. బాడీ ఫిట్ నెస్ అంటే ఇష్టం. దాని కొరకు ప్రతిరోజు జిమ్ చేసేవాడు. అలాగే అక్టోబర్ 2020లో జిమ్ చేస్తుంటే ఆయాసం కొంచెం దగ్గు రావడంతో వెంటనే పరీక్ష చేయించుకోగా ఉప్పెన లాంటి వార్త.. లంగ్ క్యాన్సర్ గా నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులందరూ కనీసం మూడు నెలల పాటు షాక్ లో ఉన్నారు లాక్ డౌన్ కారణంగా తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లలేని పరిస్థితి. అతడు రాలేని పరిస్థితి. క్యాన్సర్ అన్నది భయంకరమైన నిజాన్ని నేను భరించక తప్పదని భావించాడు. తల్లిదండ్రుల్ని బంధువుల్ని తను ఇష్టపడే వాళ్ళందరినీ మోటివేట్ చేశాడు. చికిత్స తీసుకుంటున్నాడు మరి అమాయకురాలైన సిందూ భవిష్యత్తు ?? డాక్టర్ హర్ష ముందు తనకొచ్చిన క్యాన్సర్ వ్యాధి కంటే పెద్ద సమస్య ఆమె భవిష్యత్తు.
ముందు చూపు
ఆమె జీవితం గురించి మెరుగ్గా ఆలోచించాడు. అప్పటికే ఆమె తండ్రి శరీరం చచ్చుబడి ఎనిమిదేండ్లుగా బెడ్ మీదనే ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితాన్ని సెటిల్ చేయాలని సంకల్పించాడు. అందుకే విడాకులు కోరాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. నీకు తోడుగా ఉంటాను అంది. కానీ ఏ ముచ్చట తీరకుండానే ఆమె ఒంటరి కావడం అతడికి ఇష్టం లేదు. ఇరు కుటుంబాలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికీ ఒక స్నేహితురాలిగానే ఆమె పై చదువులకు సహకరిస్తున్నాడు.
వ్యాధి తీవ్రతరం కావడంతో చికిత్స తీసుకుంటూనే ప్రతి క్షణం తన తల్లిదండ్రులను అత్యంత సున్నితంగా, మానసికంగా సిద్ధం చేశాడు. గతేడాది అక్టోబర్ లో చివరిసారి తన తల్లిదండ్రులను చూడడానికి ఖమ్మం వచ్చాడు. అమ్మా నాన్నలను అమెరికాలో ఉన్న తమ్ముడు దగ్గరకు పంపి.. తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.
సమయం రానే వచ్చింది
తను చనిపోయినప్పుడు ఎవ్వరికీ బరువు భారం కాకుండా లాయర్ తో మాట్లాడి ఆథరైజేషన్ అక్కడి తన స్నేహితులకు ఇచ్చాడు. అలాగే శవపేటికను స్వయంగా ఆర్డర్ చేసుకున్నాడు. తన కారు అమ్మేశాడు. నిర్జీవమైన స్థితిలో తన తల్లిదండ్రుల వద్దకు రావడానికి కనీసం సింగిల్ డాలర్ కూడా ఖర్చు పెట్టుకోవడానికి తన స్నేహితులకు అవకాశం ఇవ్వకుండా ప్రతిదీ తనే ప్లాన్ చేసుకున్నాడు.
సిడ్నీలో ఉండే సైంటిస్ట్ అయినా తన బంధువుని మార్చ్ 24 వ తారీకు రమ్మన్నాడు. మార్చి 23 తను రెగ్యులర్ గా వైద్య సేవలు అందించే ఆశ్రమానికి వెళ్ళాడు. ఇండియాకు వెళ్తున్నాను అని వీడ్కోలు తీసుకున్నాడు. మార్చి 24న తన స్నేహితులతో కలిసి తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. అందరూ కలిసి టిఫిన్ చేశారు. నేను మరొక గంట కంటే ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. అంతే రెండు నిమిషాల తర్వాత 32 ఏండ్ల హర్ష వర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. తనే స్వయంగా తన అంతిమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకొని ఇలా కూడా చేయొచ్చా అని చూపి అందరికీ ఆదర్శవంతుడు అయ్యాడు. అందుకే అతడు స్థితప్రజ్ఞుడు.