ఇప్పుడైనా చెప్పుమా…!!

డిక్షనరీలో లేని పదాలకు
కొత్త కొత్త అర్ధాలను అన్వయించి
అంగాంగ వర్ణనలను… అతిశయోక్తిగా చేసే
ఓ కవివర్యా….!
ఇంకా ఎంత కాలం…???
మీ సిర చుక్కల లెక్కలు
మా అణువణువు కొలతల సైజులు తెల్చేది…
చెప్పుమా…..!!

అక్కడెక్కడో ఉన్న ఆకాశాన్ని తెస్తావు
ఏవేవో రంగులన్నిటిని పురమాయించి
మా శరీర చుట్టు కొలతలకు
గాలి ఆడని ఓ చీరని చుడతావు
ఓ కలం వీరుడా..?
ఇప్పుడైనా చెప్పగలవా..
నాలుగు అక్షరాలకు నగిషీలు చెక్కి
నయవంచకుల ముందు నగంగా ఊరేగిస్తావు..
ఎందుకు అలా..?

ఓ కవి వత్సల…!
పురాణేతిహాసాల నుండి
ఒక్కసారి తొంగిచూడుడి
అడుగంటిన మానవత పాత్రల నుండి
మట్టిగలిసిన చరిత్ర నుండి
ఎన్ని మానవ మగాలు
ఉద్రేకించి తిరుగుతున్నయో..
ఎప్పుడైనా గమనించరా మీరు….?

ఓ కళ రూపి…!
మీ చేతిలోని అక్షరాల ఉలితో
ఎన్ని కళాఖండాలకు ఆయుష్షు పోశారో..
అందుకే…. ఒక్కసారైనా
మగువ మనసు పొరల్లోకి
మీ పెన్‌ పాళిని చొచ్చించి తీసుకు వెళ్ళుము
అక్కడో మహా సంగ్రామం హోరెత్తుతోంది
ఎటు చూసినా విఘాత జీవులే …కానీ
అవన్నీ ”ఆమె” శవాలే అని ఎవరికి తెలియదు
అందుకే ఒక్కసారి ఆ రోదనని విని చూడు
మీ కలం ఎన్నిసార్లు కన్నీరు కారుస్తుందో
కలం పట్టిన మీకు కూడా తెలియదు
ఆ కన్నీటి వేదన…!!
– జి.గోపి

Spread the love