తనలాంటి వారికోసం తనే ఆదాయ మార్గమై

శారీరక అంగవైకల్యం ఉన్న వారి జీవితం ఒక కష్టమైన ప్రయాణం. వారికున్న లోపం వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, ఆందోళన పెంచుతుంది. నైపుణ్యం ఉన్నా సమాజంలో వారంటే కొంత చిన్న చూపు. అయినా ఎదురొడ్డి నిలబడినా వారికి అవకాశాలు అంతంత మాత్రమే. ఆ అవాంతకాలను అధిగమించి ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. ఏటైపికల్‌ అడ్వాంటేజ్‌ (ఏఏ) పోర్టల్‌ ప్రారంభించి.. వైకల్యం వారికి అడ్డు కాకుండా నైపుణ్యమే కొలమానంగా అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. అతనే వినీత్‌ సరైవాలా.. ఈ పోర్టల్‌ ద్వారా ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడో… అతనికి ఈ ఆలోచన ఏవిధంగా వచ్చిందో…ఎంతో మందికి ఉపాధి.. ఏ విధంగా ఉపాధి కల్పిస్తున్నాడో.. అతని మాటల్లోనే… ఈ వారం జోష్‌…
కరోనా సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని ప్రయత్నించారు. కానీ నేను అలా చేయలేదు.. ఫీచర్‌ గ్రూప్‌ సంస్థ అందిస్తున్న అధిక జీతాన్ని తృణప్రాయంగా వదిలేసి శారీరక అంగవైకల్యం ఉన్న వారి కోసం ఆదాయ మార్గాన్ని చూపించే పోర్టల్‌ను 2020 డిసెంబర్‌లో ఏర్పాటు చేశాను. అదే ఎటైపికల్‌ అడ్వాంటేజ్‌ (ఏఏ). ఈ పోర్టల్‌ ఆన్‌లైన్‌ డేటాబేస్‌ సర్వీసును అందిస్తుంది. అంటే దీనిలో కొనుగోలు దారుడు, అమ్మకం దారుడు ఇద్దరూ ఉంటారు. వీరిద్దరినీ ఈ పోర్టల్‌ కలుపుతుంది. అదే ఆన్‌లైన్‌ డేటాబేస్‌. ఈ పోర్టల్‌ ద్వారా శారీరక అంగవైకల్యం ఉన్న వారికి పార్ట్‌ టైం లేదా ఫుల్‌టైం ఉద్యోగావకాశాలు అందిస్తుంది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు ఈ పోర్టల్‌లో తమ కంపెనీ వివరాలు నమోదు చేయించుకోని, వారికి కావాల్సిన అర్హతలున్న వారిని ఇక్కడ నుంచి రిక్రూట్‌ చేసుకోవచ్చు. ఈ విధంగా పోర్టల్‌ శారీరక వైకల్యం కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
స్వానుభవంతో వచ్చిన ఆలోచన..
మాది మధ్య తరగతి కుటుంబం. నాకు పుట్టుకతోనే జన్యుపరంగా సంక్రమించే అరుదైన రుగ్మత రెటినిటిస్‌ పిగ్మెంటోసా సమస్య ఉంది. 16 ఏండ్లు ఉన్నపుడు ఈ సమస్యను మొదటి సారి గుర్తించాం. అన్ని రకాల చికిత్సలను ప్రయత్నించాం. శస్త్రచికిత్స, హౌమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, ధ్యానం, హస్తసాముద్రికం ఇలా ఏవేవో ప్రయత్నించినా ఉపయోగం లేదు. వాస్తవాన్ని స్వీకరించక తప్పలేదు. అలా అని నా భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుందని నిరాశపడలేదు. ఆగలేదు. పోరాడాను. మా ఇంట్లో మా అన్న అనూజ్‌కి కూడా ఇదే సమస్య. అది మా కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెట్టిన విషయం. అయినా నా అడుగు వెనక్కు పడలేదు. దేశంలో గర్వించదగిన విద్యా సంస్థ ఐఐఎంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ (పీజీపీ)లో చేరాను.
గర్వంగా ఉంది…
ఏటిపికల్‌ అడ్వాంటేజ్‌లో పెద్ద పెద్ద సంస్థలు కలిసి నడవడానికి చాలా కృషి చేస్తున్నాడు. ”ప్రతిభ, నైపుణ్యాలకు వైకల్యం ఎప్పటికీ అడ్డు రాద”ని చెప్తూ వారిని తమతో కలిసి నడిచేందుకు ప్రోత్సహిస్తున్నాడు కూడా. ఇప్పటి వరకు మేం సాధించిన విజయం చూస్తే చాలా గర్వంగా ఉంది. దీనంతటికీ నేను నేర్చుకున్న బిజినెస్‌ మేనేజ్‌మెంటే కారణం. ఏ కంపెనీ అభివృద్ధికైనా మార్కెట్‌ అభిప్రాయం ముఖ్యం. ఏ ఉత్పత్తినైనా లాంచ్‌ చేసేముందు దాన్ని పరిపూర్ణం చేయాలనే ఆలోచన పక్కకుపెట్టి.. ప్రారంభమైన తర్వాత నుంచి మార్పులు చేసుకుంటూ ఎదగొచ్చు. ప్రస్తుతం 10 వేల మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను.
ఐఐఎం నుంచి ఫీచర్‌ గ్రూప్‌ వరకు..
2013 – 2015 మధ్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ (పీజీపీ) పూర్తి చేశాను. ఐఐఎంలో చేరిన మొదటి రోజు ఉత్సాహంగా గడపలేదు. అప్పటికే ఎక్కువ భాగం చూపు కోల్పోయాను. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలో నా భవిష్యత్తు అస్పష్టంగా అనిపించింది. తీవ్రమైన ఆందోళనలతో కుంగిపోయాను. నా బ్యాచ్‌మేట్స్‌ నన్ను అంగీకరించరని భయపడ్డాను. ఒక విధమైన అభద్రతకు గురయ్యాను. ఎవరైనా నా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తే ఎలా నిరూపించుకోవాలనే సందిగ్ధంలో పడిపోయాను. అసలు హాస్టల్‌ నుండి క్లాస్‌రూం వరకు స్వంతంగా నడవగలనా? పరీక్షలను ఎలా రాయాలి వంటి అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి. అయితే దేశంలోని కొందరు మేధావులతో కలిసి చదువుకుంటున్నందుకు సంతోషించాను. నా స్నేహితులు అందించిన సహకారం నా భయాన్ని పటాపంచెలు చేసింది. గ్రూప్‌ ప్రాజెక్టులకు నాయకత్వం వహించాను. అవకాశం ఉన్న ప్రతి విషయంలో ముందుకు నడిచాను. ఫలితంగా నా సామర్థ్యం ఏంటో నాకు తెలిసింది. నాలోని నాయకత్వ లక్షణాలు తెలుసుకోగలిగాను. పీజీపీ పట్టా పొందాను. తర్వాత ఉద్యోగాల వేట చాలా కష్టం అనిపించింది. ఉద్యోగావకాశం ఇచ్చేందుకు నాలోపం వారికి అడ్డంకిగా మారింది. అయితే కాలేజీలో నేను చూపించిన ప్రతిభ, అర్హతలే తర్వాత రోజుల్లో ఫ్యూచర్‌ గ్రూప్‌లో మంచి స్థాయిలో నిలబెట్టాయి. ముంబైలో మేనేజ్‌మెంట్‌ టైనీగా చేరిన నేను డిప్యూటీ మేనేజర్‌గా, బిగ్‌బజార్‌ రిక్రూట్‌మెంట్స్‌, నియామక ప్రక్రియ, సంస్థ కార్యకలాపాలు ఇలా చాలా వరకు దాదాపు ప్రతీ బాధ్యత నిర్వహించాను.
సవాళ్లతో కూడుకున్న పని…
పోర్టల్‌ ప్రారంభించగానే సరికాదు కదా.. ప్రతి అడుగు సవాలుతో కూడుకున్నదే. కంపెనీలను ఒప్పించడం ఒకెత్తైతే… ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవడం మరో సవాలు. కంపెనీల ఆలోచనా విధానాన్ని మార్చడం అంత సులువేం కాదు. వారికి కావాల్సిన నైపుణ్యం కలిగిన వ్యక్తిని కచ్చితంగా అందించాలి. వారి నమ్మకం పొందడం చాలా ముఖ్యం. కంపెనీల అవసరాన్ని బట్టి, ఆర్టిస్ట్‌ల పెయింటింగ్స్‌, వర్క్‌ వీడియోలు ముందుగానే పంపిస్తాం. కంపెనీ అవసరానికనుగుణంగా అవతలి వ్యక్తి ఎంత మేర వర్క్‌ చూపించగలరో వారు సరి చూసుకున్న తర్వాతనే ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇక ఫైనాన్షియల్‌ విషయానికొస్తే…
పోర్టల్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్ల నుండి డబ్బులు అడగడానికి కాస్త సంకోచించాను. కంపెనీల నుంచి పెరిగిన ఆఫర్లతో పోర్టల్‌ మీద నమ్మకం పెరిగింది. పెట్టుబడులు పెరిగాయి. అయితే మన భావజాలంతో ఏకీభవించే వారిని పెట్టుబడులు పెట్టగలరని అనుభవంలో అర్థమైంది. ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టిన వారంతా రాబడి కాకుండా సంస్థ సామాజిక విలువను మాత్రమే గుర్తించారు. అమెజాన్‌, పెప్పర్‌ఫ్రై, టీసీఎస్‌, హెచ్‌యుల్‌ వంటి సంస్థలలో ఇప్పటి వరకు నియమకాలు చేశాం. ఈ మధ్య కాలంలో అమెజాన్‌ 40 మందిని ఏఏ ఫోరమ్‌ ద్వారా తీసుకుంది.
ఏ రోజుకైనా కంపెనీలు నేరుగా వైకల్యం కలిగిన వారిని నేరుగా నియమించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అలా చేయడం వల్ల చాలా మంది ఉపాధి పొందుతారు. ఎక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు బయటకు వస్తారు.
లాభాపేక్ష లేకుండా
మా కళాకారుల విషయానికొస్తే, వారిలో చాలా మంది ఇప్పటివరకు రూ.లక్ష ఆదాయం పొందారు. డౌన్‌ సిండ్రోమ్‌ తో బాధపడుతున్న ఒక పెయింటర్‌ తన పెయింటింగ్‌ను కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తికి రూ. 28,000కి విక్రయించింది. మస్కులర్‌ డిస్ట్రోఫీతో బాధపడుతున్న ఒక అమ్మాయి ఇప్పుడు తన కాఫీ పోట్రెయిట్‌ల (చిత్రాల) ద్వారా ఆదాయాన్ని పొందుతోంది.
 స్వామినాథన్‌ మణివన్నన్‌ మూగ, చెవుడు సమస్య ఉంది. అయితే అతను ఒక ఆర్టిస్ట్‌. ఈ పోర్టల్‌ ద్వారా దాదాపు 15 పెయింటింగ్స్‌ అమ్మాడు.
రాజ్‌ జైన్‌ గాయకుడు. కానీ పాక్షిక దృష్టి లోపం ఉంది. ఈ వేదికగా దాదాపు 10 షోలు నిర్వహించాడు. ఇప్పటి వరకు ఈ సంస్థ 1000కిపైగా వైకల్యం ఉన్న వారికి ఆదాయ మార్గాన్ని చూపించింది. దాదాపు 120కి పైగా బ్రాండ్స్‌ ఈ పోర్టల్‌తో కలిసి పనిచేస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న పెప్పర్‌ఫ్రై సంస్థల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 30 మంది వైకల్యం కలిగిన ఆర్టిస్టులు గాజుపై పెయింటింగ్స్‌ వేసేందుకు నియమితులయ్యారు. ఐటీ ఎనలిస్ట్‌గా టీసీఎస్‌ నుంచి చూపులేని అమ్మాయిని నియమించుకున్నారు. వినికిడి సమస్య ఉన్న ఓ పదిహేనేండ్ల అమ్మాయిని అమెజాన్‌ మోడల్‌గా అలెక్సా డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌కు తీసుకున్నారు.
నియామకాలకు సంబంధించి క్యాండిడేట్‌ రెమ్యునరేషన్‌ మీద 8.33 శాతం తీసుకుంటాం. ఈవెంట్‌లు ఏవైనా నిర్వహిస్తే మా మార్జిన్‌ 15 – 30 శాతం మధ్యలో ఉంటుంది.
– అంకం రమాదేవి 

Spread the love