జగ్గన్న… మీది నాలుకనా లేక!

నరంలేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అనేది నానుడి. కారెక్కాలా… దిగాలా? అంటూ రహస్యంగా మీరే చర్చలు జరుపుతారు. కాపు కాసి ఏటేస్తానన్నట్టు చేయి విడిచి గులాబీ కండువా కప్పుకుందామా? అని మీరే మాట్లాడుకుంటారు. మీరే మీడియాకు లీకులిస్తారు. తీరా బేరం కుదరకపోయేసరికి మీడియాపై రుసరుసలాడుతారేందుకు? మీపై ఉన్న గౌరవాన్ని మీరే మంటగలుపు తున్నారు. జగ్గన్న నాలుకనా లేక ఇంకేమైనానా? పార్టీకి మీరే దూరంగా ఉంటారు. నన్ను పిలువలేదని ఆవేదన చెందుతారు. నన్ను దూరం పెడుతున్నారని బాధపడుతారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న మీరు… అప్పగించిన బాధ్యతను నెరవేర్చారా? అంటూ మీ పార్టీ నాయకులే అడుగుతున్నారు. అవసరమున్నా… లేకపోయినా మీడియా ప్రతినిధులను హోటల్‌కు ఆహ్వానించి మీకు తోచింది మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతా… అంటూనే లేనిది కూడా మీడియాకు చెబుతారు. వీటన్నింటికి సమాధానం చెప్పకుండా సోషల్‌ మీడియా, రెండు, మూడు పత్రికలంటూ చిర్రుబుర్రులాడుతున్నారు. తప్పుడు రాతలు రాస్తే బట్టలుడదీసి కొడతా అంటున్నారు. ఊసరవెల్లిలా ఊగిసలాడుతూ… ఎప్పుడేం మాట్లాడావో మీకే తెలియదు అంటూ మీ పార్టీ నేతలు అంటుంటారు. కానీ మీరు మాత్రం నిక్కచ్చికే నిలుటద్దం అన్నట్టు చెబుతారు. మీరు చెప్పింది రాస్తే మీడియా మంచిదికాదా? అని ప్రశ్నిస్తున్నారు.
– గుడిగ రఘు

Spread the love