మూత్రాభిషేకం

1
రాముడి కాళ్లు కడిగి..
ఎంగిలి పండ్లను తినిపించినందుకు
శబరి రుణం తీరిపోయింది.
2
బొటనవ్రేలు గురుదక్షిణగా
స్వీకరించినందుకు ద్రోణాచార్యుడు
కురిపించిన పుత్రవాత్సల్యంతో
ఇన్నేండ్లకు ఏకలవ్యుడు తడిసి ముద్దయి
ముగ్ధుడై పరవశించి పోయిండు.
3
అడవిని అంటిపెట్టుకున్నందుకు,
కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు
ముత్రాభిషేకంతో సత్కరించి
సరికొత్త మనుస్మతిలోని
పౌరసత్వాన్ని గుర్తిస్తూ
దిగొచ్చిన పీఠాధిపతులు
నా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకొని
చేయిస్తున్న పాపాలన్నీ ఇకనుంచి
తొలగిపోయినట్లేనని,
ఎగరేసిన అలిఖిత శాసనపత్ర
పతంగొకటి గాలిలో స్వేచ్ఛగా
చక్కర్లు కొడుతూ సువార్తను
మోసుకు తిరుగుతుంది.
4
అగ సూడు.. ఇప్పటికైనా
ఏ రీతి మర్యాద దక్కునో
తెలిపినందుకు కతజ్ఞత పాటిస్తూ
జమ్మి చెట్టు మీది ఆయుధాలు
వింటినారిని సరిచేసుకుంటూ
భుజం మార్చుకుంటున్నయి.
5
అంగరంగ వైభవంగా
జరిగిన పట్టాభిషేకాన్ని
తిలకించిన పురజనులారా…
అనుమానమక్కర్లేదు!
ఇమాన పూర్తిగా నేను
ఈ దేశ ముఖచిత్రాన్ని!!
– బండారి రాజ్‌కుమార్‌
8919556560

Spread the love