రంగులెలిసి పోతున్న గోడల మీద
పెచ్చులూడుతున్న జ్ఞాపకాలు
లోయలోకి జారిన జ్ఞాపకాల్లో
నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తూ
నిన్నా మొన్నటి ఉత్సవాల చప్పట్లూ…
ఉద్యమ నినాదాలూ…
నిశి రాత్రులకు వ్యతిరేకంగా పోరాడిన
దీపాల కళ్ళకింద
ముసురుకుంటున్న చీకటి వలయాలు
వసంతాలు పూసిన వాకిలి నిండా
నిర్లిప్తంగా
రాలిపడుతున్న ఎండుటాకులు
దూరం పెరుగుతున్న
ఉదయాస్తమయాల మధ్య
దిగులు మబ్బుల నీడలు
కంటి గూటిని ఖాళీ చేసి
వెళ్లిన పోయిన
కలల పిట్టలు
క్యాలెండర్‌కు నీరసంగా వేలాడుతూ
రోజులూ… నెలలూ…
కీళ్ళ నొప్పులతో కదలలేక
అవస్థపడుతున్న గోడ గడియారం
లేచి నిలబడడానికే
శక్తిని కూడగట్టుకుంటున్న ప్రవాహం
ఇసుక దిబ్బ మీద
ఆయాస పడుతున్న జీవనది
రేవులో ఎదురుచూస్తున్న
నిస్సహాయ ప్రయాణికుల దాకా
చేరుకోలేక తల్లడిల్లుతున్న నావ
ఒక్కొక్క అవయవం
ఆయుధాన్ని జారవిడుస్తున్నా
ఓటమికి తలవంచని ఊపిరి
పొయ్యిని రాజేస్తూనే ఉంది
ఇంకా పంచాల్సిన రొట్టెల కోసం!
– రహీమొద్దీన్, 9010851085