సూపుడు వేలు సూర్యుడు

ఓటంటే ?
అక్షరం దిద్దని ఏలి ముద్రనా ?
ప్రయాణం అయిపోయినంక
పనికిరాకుండా పోయే ఎర్రబస్సు టికెట్టునా?
కాదు!
ఓటంటే ఆపద సమయంలో
అండగా నిలిసే కర్ణుడి కవచం…

ఆనాడు శ్రీ కష్ణుడెత్తిన గోవర్ధన పర్వతం
ఎన్ని ప్రాణాలకు రక్షణగా నిల్చిందో
తెలియదు కాని
ఈనాడు బాబా సాహెబ్‌ చేతిలోని రాజ్యాంగం
ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిల్చింది…

ఎవరి బతుకులు ఎట్ల మొలిసినయో
మా కుటుంబమయితే ఓటర్‌ లిస్టులో
పేర్లు నమోదు జేస్కునప్పటి నుండే
పూత వూసి కాతగాసింది…

బల్బాగా బల్సిన దొడ్డుపలుకుల కాయకే కదా
ఎక్కువ డిమాండ్‌! ఎట్లంటావా ?

పాలేరుగాళ్ళు కోటల అడుగువెట్టుడే నిషేధం అట్లాంటిది మీ కోడెవొచ్చి
మాయావు మీద ఎక్కుతదా
దానికి ఎన్ని గుండెల్రా అని
వొళ్ళంతా వాతలు వెట్టి,
కారం సల్లిన గా దొరగాడు
గీ పొద్దు ఓట్లకై మా ఇంటి గడప దొక్కిండు
మా బతుకులు మారినయి
మా యాల్విషన్‌ పెరిగిందని సెప్పడానికి
గింతకంటే గొప్ప ఇషయం ఏముంటది సెప్పు?

బ్రహ్మ రాసిన రాతల్ని
తిప్పిరాయగల అస్త్రం ఒక్క ఓటు హక్కేనని
కొటింట్ల బతికే మట్టి బుర్రలకు
ఇంకెప్పుడు ఎలుగుతదో…

ఓటుతోని
ఏలెత్తిసూపే ధైర్ణ్యం తెచ్చుకుంటరనుకుంటే
ఆస్థానపు తెల్ల కుందేళ్ళ దగ్గర
వేలుని ఐదేండ్ల వరకు కుదవవెట్టిండ్రు
బతుకంతా ఎంగిలి మెతుకులు
ఏర్కతినుడుతోనే సరిపోయింది.!
మరీ వొండుకతినేదెన్నడు ?

ఓటంటే నలిపితే నలిగే కాగితపు ముక్క కాదు
దేశ బహుటాను ఎగరేసే నీలిరంగు పిట్ట అని
సాటింపేయా ఊరూర సూపుడు వేలు
సూర్యుడై ఉదయించాలి…

– తలారి సతీష్‌ కుమార్‌

Spread the love