వచ్చే ఎన్నికల్లో జిల్లెలగూడలో 20వేల మెజార్టీ ఇవ్వండి..

– ప్రజలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి..
– రూ 2 కోట్ల 58 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నవతెలంగాణ – మీర్ పేట్
అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నాకు జిల్లెలగూడ నుండి వచ్చే ఎన్నికల్లో 20వేల మెజార్టీ ఇవ్వాలని ప్రజలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం కార్పొరేషన్ లోని 39,40,43 వార్డులలో 2 కోట్ల 58 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మీర్ పేట్ కార్పొరేషన్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా రూ 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ .మీర్ పేట్ కార్పొరేషన్ కు రూ 50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ట్యాంకులు నిర్మాణం జరిగితే జిఎచ్ఎంసిలో నీళ్లు ఉచితంగా ఇస్తున్నట్లు ఇక్కడ కూడా ప్రతి రోజు మంచినీళ్లు ఇస్తామని ప్రకటించారు. కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ 270 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య పెన్షన్లు పెంచినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్టీసీ కార్మికులకు భద్రత కల్పిస్తూ ప్రభుత్వంలో విలీనం చేశారని, రాష్ట్రం ఆదాయాన్ని కూడా పెంచుతూ అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. తల్లితండ్రి లేని అనాధలకు తానే తల్లి తండ్రి అనాధ పిల్లలను దత్తత తీసుకొని పెద్ద అయ్యే వరకు ప్రభుత్వమే పోషణ తీసుకుంటుందని చెప్పారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నాకు కేవలం జిల్లెలగూడ నుండి వచ్చే ఎన్నికల్లో 20వేల మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి అండగా ప్రజలు నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కమిషనర్, డిఈ, ఏఈ, స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీవాసులు పాల్గొన్నారు.
Spread the love