స్వాతంత్య్ర దినం… వీరుల త్యా‌గ‌ఫ‌లం

స్వాతంత్య్ర దినం... వీరుల త్యా‌గ‌ఫ‌లం”నేడే స్వాతంత్య్ర దినం వీరుల త్యాగఫలం.. నేడే నవోదయం, నేడే ఆనందం. పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా!” అని 76 ఏండ్ల క్రితం 1947 ఆగస్టు 15న ఎంతో ఆనందంతో పాడుకున్నాం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రాణత్యాగాలు చేసి, పోరాటం చేసి సాధించుకున్న స్వాతంత్య్రం గూర్చి ఎంతో గర్వంగా ఉత్సవాలు జరుపుకున్నాం. గత సంవత్సరం స్వాతంత్య్రానికి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంలో ఆజాది అమృతోత్సవాలనూ ఘనంగా నిర్వహించుకున్నాం. అయితే స్వతంత్రం వస్తే లభిస్తాయనుకున్న స్వేచ్ఛ, భద్రత, ప్రజాస్వామ్యం, ఆకలి లేకపోవడం, సమానత్వం, అవసరాలు తీరడం, విద్య, వైద్యం అన్నీ సమకూరినాయా? లేదా? అనేదే అసలు విషయం. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన విజయోత్సవం ఆనందంగా జరుపుకుంటూనే సమీక్ష జరుపుకోవడం, పున:సమీక్ష చేసుకుని కర్తవ్యాన్ని నిర్దేశించుకోవడం చాలా ముఖ్యమైనది. శ్రీశ్రీ రాసిన పై పాట పల్లవి తర్వాత, చరణంలో… ”స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి… సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి… ఆకాశం అందుకునే ధరలొకవైపు, అంతులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలుముకున్న ఈ దేశమెటు దిగజారు!” అనీ ప్రశ్నించాడు. ఇలా ప్రశ్నించి అర్ధ శతాబ్దం గడిచిపోయింది. ఇప్పుడు మరిన్ని చేర్చి ఈ దేశం ఎటుపోనున్నది? అని విచారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతేకాక స్వాతంత్య్ర ఫలాలు ఎవరికి దక్కాయి? ఎవరు అనుభవిస్తున్నారు? అన్న విషయాలు చర్చించాల్సిన సమయమిది.
రెండు వందల ఏండ్లు పరిపాలించిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదంపై ఎంతో మంది ప్రజలు తిరుగుబాటు చేసి, వీరోచితంగా పోరాడి, త్యాగాలు చేసి, ప్రాణాలు కూడా అర్పించి, నానా కష్టాలకోర్చి సంపాదించిన స్వాతంత్య్రమిది. అంతే కాని ఊరకనే వాడేమీ ఇచ్చిపోలేదు. ఈనాటికీ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఎంతోమంది యోధుల త్యాగఫలం అని మనం మరిచిపోవద్దు. ఈ సందర్భంగా వారందరినీ తలచుకోవడమూ కనీస బాధ్యత. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, నేడు దేశ పాలకులుగా వున్నవాళ్లు, వారి సిద్ధాంత వారసత్వమూ, దేశ స్వాతంత్య్రం కావాలని కానీ, పోరాడడంలో కానీ వారి పాత్ర లేదు. ప్రతిగా స్వాతంత్య్ర పోరాటానికి వ్యతిరేకంగా కూడా పని చేయడం, బ్రిటీష్‌ వారికి అనుకూలంగా పనిచేసిన వారి వారసత్వమే నేడు స్వతంత్ర దేశానికి పాలకులుగా వున్నారు.
అంతేకాదు, స్వతంత్ర పోరాట చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను, సత్యాలను మరుగుపరిచే ప్రయత్నమూ నేడు జరుగుతున్నది. ఇంకనూ చరిత్ర వక్రీకరణలూ చోటు చేసుకుంటున్నాయి. పోరాట వీరులను, సంఘటనలను, భావి తరాలు చదువుకోవాల్సిన పాఠ్య పుస్తకాల నుండి తీసివేశారు. జాతిపితగా మనం చెప్పుకునే మహాత్మాగాంధీని గురించి, దేశ ప్రజలందరినీ ఐక్యపరిచిన ఉద్యమం నిర్మించిన అతని పాత్ర గురించిన విషయాలను చరిత్రలో లేకుండా చేసేందుకూ పూనుకుంటున్నారు. బ్రిటీష్‌ వారితో వీరోచితంగా పోరాటం చేసి ప్రాణాలొదిలిన టిప్పు సుల్తాన్‌ లాంటి వారినీ, వారి చరిత్రనూ వక్రీకరించే ప్రయత్నమూ చేస్తున్నారు.
అందుకనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థూలంగానైనా జరిగిన, జరుగుతున్న పరిణామాలను వాస్తవికతల ఆధారంగా తెలుసుకోవాలి. భారతదేశ సహజ సంపదలను దోచుకోవడానికి వర్తక సంఘాలుగా వచ్చిన విదేశీయులు క్రమంగా అధికారాన్ని పొందారు. ముందుగా పోర్చుగీసువాళ్లు, ఆ తర్వాత డచ్చివాళ్లు, ఫ్రెంచి వాళ్లు వచ్చారు. 1615లో మొగల్‌ చక్రవర్తి నుండి వ్యాపార అనుమతి పొంది అడుగుపెట్టిన బ్రిటీష్‌ వర్తకులు, దేశంలో వున్న అనేక రాజ్యాలపై కుట్రలతో, కుతంత్రాలతో, విభజన రాజకీయాలతో దారుణంగా వ్యవహరిస్తూ ఆధిపత్యాన్ని పొందారు. కేవలం వ్యాపారం కోసం అడుగుపెట్టిన తూర్పు ఇండియా వర్తక సంఘం, అన్ని నైచ్యాలకూ ఒడిగట్టి, స్థానిక రాజులను ప్రలోభాలకు గురిచేసి 1857 నాటికి మొత్తం దేశాన్ని ఆక్రమించారు.
1857లో బ్రిటీష్‌వారి దమన నీతికి వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సమరం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, నానా సాహెబ్‌, మంగల్‌ దేశ్‌పాండే మొదలైన వారు వీరోచితంగా పోరాటం చేశారు. బేగం హజరత్‌ మహల్‌ నాయకత్వాన అయోధ్యలో తిరుగుబాటు జరిడింది. ఫైజాబాద్‌కు చెందిన మౌళ్వీ అహ్మదుల్లా నాయకత్వాన తిరుగుబాటు చేశారు. సైనికులు, రైతులు, సామాన్య ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటంలో హిందూ, ముస్లిం రాజులందరూ కలిసి రెండవ బహదూర్‌షాను తమ రాజుగా ప్రకటించుకున్నారు కూడా. గ్వాలియర్‌ రాజు సింధియా మొదలైన కొందరు రాజులు మాత్రం బ్రిటీషర్స్‌కు అనుకూలంగా పనిచేశారు. ఈ పోరాటంలో గెలుపుతో ఆంగ్లేయులు మొత్తం దేశాన్ని వారి దోపిడీకి అనుకూలంగా మలచుకున్నారు.
ఆనాటికీ భారతీయ సామాజిక వ్యవస్థ అత్యంత వెనుకబాటులో వుండి, విభజనలతో, అవిద్యతో కునారిల్లుతోంది. హిందూ, ముస్లింలే కాక కులం కారణంగా విభజించబడివున్నారు. మనుస్మృతి వంటి గ్రంథాల్లో వున్న నాలుగు వర్ణాలు మాత్రమే కాక అవి వందలు, వేలుగా మారి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఏర్పడి వుంది. బ్రాహ్మణుల నాయకత్వంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగేది. సర్వహక్కులూ వారికే వుండేవి. కింది కులాలవారు అత్యంత హీనంగా, నీచంగా చూడబడేవారు. అస్పృశ్యత పాటించేవారు. విద్య నిషేధించబడింది. ప్రజలను చీల్చిన బలమైన ప్రధానశక్తి కులం. ఎంతో పీడనను కింది కులాలు ఎదుర్కొంటూ వున్నాయి. మూఢ విశ్వాసాలు కొనసాగినవి. సతీసహగమనం, వితంతువుల దీన స్థితి, బాల్య వివాహాలు… అన్నీ కలిసి ఆధునికంగా దేశం ఎదగటానికి ఆటంకంగా తయారయింది. అందుకనే పీష్వాలకు, ఆంగ్లేయులకు జరిగిన మరాఠా యుద్ధంలో అక్కడి దళిత ప్రజలు పీష్వాల కుల పీడనకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బ్రిటీష్‌వారికి అందగా నిలిచి పోరాడారు. ఆ యుద్ధంలో చనిపోయిన దళిత సైనికుల స్మారక స్థూపం ‘కొరెగావ్‌’ వద్ద నిర్మించబడింది.
ఇంకోవైపు బ్రిటీష్‌వాళ్లు ‘విభజించు – పాలించు’ అనే సూత్రాన్ని తీసుకుని ప్రజలను మత పరంగా విభజించి తమ కుతంత్రాన్ని కొనసాగించారు. ”భారతదేశంలో మత సామరస్యం ఏర్పడిన మరుక్షణం మనం దేశం నుండి పారిపోవలసి వుంటుంది” అని బ్రిటీష్‌ వైస్రారు లార్డ్‌ హోర్డింగ్‌, బట్లర్‌కు రాసిన లేఖలో పేర్కొంటాడు. అంటే ఎంత స్పృహతో మత విభజనకు పూనుకున్నారో అర్ధమవుతుంది. రెండో వైపు వారి దోపిడీని పెంచుకోవడానికి అనేక రకాలయినచట్టాలు తీసుకువచ్చి నిర్బంధానికి పూనుకున్నారు. ఈ దేశ మూల వాసులయిన ఆదివాసీల జీవనంపై ఆంక్షలు విధించారు. పోడు వ్యవసాయాన్ని రద్దు పరుస్తూ చట్టం తెచ్చారు. కౌలుదార్లకు హక్కులు లేకుండా చేశారు. రైతులు తాము పండించిన పంటలో సగం శిస్తు రూ పంలో చెల్లించాల్సి వచ్చి తీవ్ర దోపిడీకి గురయ్యారు. అందుకనే 1899 ప్రాంతంలోనే రాంచీ అటవీ ప్రాంతంలో బిర్సా ముండా నాయకత్వాన ఆదివాసీలు తిరుగుబాటు చేయడం ప్రారంభమయింది. మలబార్‌ ప్రాంతంలో మోప్లాల తిరుగుబాటూ మొదలయింది. అట్లాగే తెలుగు అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు సాయుధుడై ‘రంప’ తిరుగుబాటును చేశాడు. వీటన్నింటిని కూడా పెద్ద సైన్యం, ఆధునిక ఆయుధాలు వున్న బ్రిటీష్‌ వాళ్లు అణచివేశారు. ఈ పోరాటంలో ఎంతో మంది స్వాతంత్య్ర కాంక్షాయోధులు తమ ప్రాణాలను బలిచ్చారు.
ఒకవైపు ఆంగ్లేయులపై అసంతృప్తి జ్వాలలు ఎగుస్తుండగా, స్థానిక పాలకులపై, ఆధిపత్య వర్గాలపై కూడా ప్రజలు తిరగబడడం ఆరంభమయింది. మన సాంఘిక వ్యవస్థలో వున్న అసంబద్దతను, పీడనను, మూఢత్వాలను సంస్కరించేందుకు కొందరు పూనుకొనడాన్ని చూస్తాం. రాజారామ్మోహనరారు ‘సతి’కి వ్యతిరేకంగా పోరాడి, ఆధునికులైన బ్రిటీష్‌ వారితో రద్దు చట్టాన్ని చేయించాడు. విద్య కోసం ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, కందుకూరి వీరేశలింగం పంతులు, నారాయణగురు మొదలైన వారెందరో సంస్కరణోద్యమాలను నడిపించారు. విద్య, విజ్ఞానాభివృద్ధికి కృషి చేశారు. పర్యవసానంగా చైతన్యం పొందవలసిన అవసరాన్ని ప్రచారం చేశారు. అందులోంచే స్వాతంత్య్ర పోరాటంలోకి నాయకత్వం ఎదిగింది. ఎంతోమంది చదువు మధ్యలోనే వచ్చి సమరంలో చేరారు.
1885లో బ్రిటీష్‌ వారికి కొన్ని విజ్ఞాపనలు, కొన్ని సౌకర్యాలు, భాగస్వామ్యాలు కల్పించడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడింది. అయితే విజ్ఞాపనలు క్రమంగా డిమాండ్లుగా మారాయి. ఈ సందర్భంలోనే కార్మిక వర్గాన్ని మరింత దోచుకోవడం పెరిగింది. ఆధునిక కర్మాగారాలలో, కాఫీ తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు అధిగ గంటల శ్రమ చేయాల్సి వచ్చేది. బొంబాయి జౌళి మిల్లుల్లో కార్మికులు సమ్మెలు కట్టి వారి హక్కుల కోసం సంఘటితం కావడం ఆరంభమయింది. భారతీయ పారిశ్రామికవేత్తల పట్ల బ్రిటీష్‌వారు వివక్షత చూపడం, వారికి వ్యతిరేకంగా చట్టాలు రూపొందించడం తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వివిధ ప్రాంతాలలో కరువు కాటకాలు, భయంకర క్షామం, దారిత్య్రం పెరిగింది. దేశీయ సంపదను, వనరులను దోచుకుపోవడం పెరగడంతో జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇంకొకవైపు ప్రజల నుండి తిరుగుబాట్లు, పోరాటాలు పెరిగాయి. గదర్‌ వీరులు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు. మరోవైపు మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయింది. 1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం లెనిన్‌ నాయకత్వంలో విజయవంతమైంది.
ఈ సందర్భంగానే జలియన్‌ వాలాబాగ్‌ దురంతం జరిగింది. వందలాది ప్రజలు, బ్రిటీష్‌వారి దమనకాండకు నేలకూరారు. ఈ సంఘటన స్వాతంత్య్ర పోరాట వీరులలో ఆవేశాన్ని నింపింది. లాలాలజపతిరారు పై జరిగిన లాఠీచార్జి, ఆయన మరణించడంతో భగత్‌సింగ్‌, సందర్సన్‌ను కాల్చి చంపడం, పార్లమెంటులో బాంబులు వేసి, స్వాతంత్య్ర చైతన్యాన్ని ప్రజలలో రగల్చడంతో దేశంలో పోరాట ఉధృతి పెరిగింది. భగత్‌సింగ్‌ను విచారణ చేసి ఉరి తీశారు. అప్పటికే దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. కార్మికుల హక్కుల కోసం పోరాడడం ప్రారంభించింది. కమ్యూనిస్టులు తమకు ప్రమాదమని భావించిన బ్రిటీషర్స్‌ ఎన్నో కుట్ర కేసులు పెట్టి నిర్భంధాన్ని ప్రయోగించింది. పార్టీపై నిషేధాన్ని విధించింది. ఈ సందర్భంగానే అంటే 1910లో వి.డి.సావర్కర్‌ మహరాష్ట్రలో ఇండియా హౌస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, బ్రిటీష్‌ చక్రవర్తికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని అరెస్ట్‌ చేశారు. అండమాన్‌ జైల్లో వేశారు. జైలుకు పోయిన నెలలోపే క్షమాభిక్ష పెట్టమని వేడుకున్నాడు. మూడుసార్లు విజ్ఞాపన పెట్టుకున్నాడు. ఇక ముందు మీకు వ్యతిరేకంగా పని చేయనని, మీకు మద్దతుగా యువకులను తయారు చేస్తాననీ రాసిచ్చాడు. 1924లో విడుదల చేశారు. ఇలా క్షమాపణ చెప్పి విడుదలయిన సావర్కర్‌ను ఇప్పుడు దేశభక్తుడని, వీరుడని కొలుస్తున్నారు. 1942లో కాంగ్రెస్‌ ‘క్విట్‌ ఇండియా’ పిలుపు ఇచ్చినప్పుడు సావర్కర్‌ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. గాంధీజీ హత్యలో సావర్కర్‌ పాత్ర వున్నదని హత్యను విచారించిన కమిషన్‌ పేర్కొన్నది.
మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం రావడం, అంతర్జాతీయంగా అనేక మార్పులు, పరిణామాలు చోటుచేసుకోవడం, దేశంలో ప్రజా వుద్యమాలు, బ్రిటీష్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో దేశీయ పెట్టుబడిదారులు, భూస్వాములు తమ ప్రయోజనాల రీత్యా స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు తెలిపి పాల్గొనడం వల్ల స్వాతంత్య్రం ప్రకటించక తప్పింది కాదు బ్రిటీష్‌ వారికి. ఏదేతేమి కానీ స్వాతంత్య్రం సాధించి సొంత రాజ్యాంగాన్ని రాసుకుని ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం. బ్రిటీష్‌వాడి చిచ్చు వల్ల పాకిస్తాన్‌ విడివడి వేరే దేశంగా ఏర్పడింది.
ఈ దేశంలో అనేక మతాలు, తెగలు, జాతులు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు వున్నాయి. విభిన్న సంస్కృతులు, జీవన విధానం వున్నప్పటికీ ఒకే దేశంగా, దేశం పట్ల గౌరవంతో, అభిమానంతో, భక్తితో జీవనం సాగిస్తున్నాం. కానీ స్వాతంత్య్రానికి పూర్వమున్న కుల వివక్షత మనల్ని వెంటాడుతూనే వున్నది. దీనికి తోడు ఇప్పుడు మత తత్వాన్ని కూడా తీసుకువచ్చి ఇంకా ప్రజలను విభజించే కుట్రలు జరుగుతున్నాయి. ‘భిన్నత్వంలో ఏకత్వం’ మనదేశం ప్రత్యేకత. దానిని రక్షించుకోవాల్సిన అవసరం వుంది.
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వారసత్వం మనది. కానీనేడు దేశ పాలకులు అమెరికా సామ్రాజ్య వాదానికి దాసోహం అంటున్నది. వ్యూహాత్మక భాగస్వామిగా చేరి, వాళ్లు చెప్పిందల్లా చేస్తున్నది. బహుళ జాతి సంస్థల లాభాల కోసం దేశ సంపదను దోచి పెడుతున్నది. దేశ అడవులు, గనులు, ఖనిజాలు, సముద్రతీరం, భూములు, సంపద అంతా కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇన్నేండ్లుగా దేశ ప్రజలు శ్రమించి సృష్టించుకున్న ప్రభుత్వ సంస్థలను, పరిశ్రమలను, సౌకర్యాలను అన్నింటినీ తెగనమ్ముతూ, స్వతంత్రం కోసం పోరాడిన వారి ఆశలను, ఆశయాలను వమ్ము చేస్తున్నారు.
స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆనాటి ప్రజల కాంక్షలేమిటి? కడుపునిండా తిండి, ఉండేందుకు ఇల్లు. ఇప్పటికీ అవి అందరికీ చేరువ కాలేదు. దారిద్య్రం పెరిగింది. ఆకలి పెరిగింది. విద్య అందరికీ అందించామా? లేదు. ఇప్పుడన్నీ విదేశీ విశ్వవిద్యాలయాలు, వ్యాపారంగా మారిన చదువులు… వైద్యమూ వ్యాపారమే. ఆరోగ్యకరమైన నీటిని కూడా ఇవ్వలేకోపయాం. ఉద్యోగాలు, ఉపాధి అందిచామా అంటే అదీ లేదు. స్త్రీ వివక్ష నిర్మూలించామా? లేదు. ఇంకా పెరిగింది. దళితుల, ఆదివాసీల అభివృద్ధి జరిగిందా అంటే వారిప్పటికీ వివక్షతను ఎదుర్కొంటూనే వున్నారు. భద్రమైన జీవనాన్ని గడపలేకపోతున్నాం. హింస, దౌర్జన్యం, దోపిడీ, నిర్భంధం అన్నీ పెరిగాయి. సంపద, సౌఖ్యం కొందరికి మాత్రమే దక్కింది. అశేష ప్రజానీకం బాధలతోనే జీవితాలను గడుపుతున్నాయి.
అంటే ఏమీ జరగలేదనీ, ఎదగలేదనీ కాదు. జరిగిన ప్రగతి జనులందరికీ చెందడం లేదు. అభివృద్ధి ఫలాలన్నీ కొందరికి మాత్రమే సొంతమవుతున్నాయి. రాజ్యాంగంలో సమాన అవకాశాలు, హక్కులు, న్యాయం, విలువ అని రాసుకున్నాం కానీ అమలులో జరగడం లేదు. ప్రజాస్వామ్యం కూడా కేవలం నినాద ప్రాయంగానే మిగిలింది. ఓట్లు, సీట్లు కొనుక్కునే సరుకులుగా తయారవడంతో, ప్రజాస్వామ్యం కూడా అమ్మకాలు, కొనుగోళ్లుగానే మారిపోయింది. కొనగలిగిన వాడే నాయకుడవుతున్నాడు. ఇక స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. స్వేచ్ఛగా అభిప్రాయాలను చెబితే పరోక్షంగా నిర్భంధం, దాడులు జరుగుతున్నాయి. తినే తిండి మీద, కట్టుకునే బట్టల మీద, పెళ్లిళ్ల మీద, మాట్లాడే భాష మీద ఆంక్షలు పెరుగుతున్నాయి. ఆఖరికి పూజించుకునే దేవుళ్ల చుట్టూ వివాదాలను, విధ్వంసాలను రేపుతున్నారు. మొన్న మణిపూర్‌లో ఆదివాసీ మహిళలమీద జరిగిన దాడి ఒక సంఘటన కాదు, ఒక సామూహిక విద్వేష చర్య. 76 ఏండ్ల సాంతత్య్రదేశం సిగ్గుతో తల దించుకునే చర్య. ఇలాంటివి పురికొలిపే ఆలోచనలు, పన్నాగాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది.
స్వాతంత్య్రం కోసం, ఎన్ని వైవిధ్యాలు, భిన్న అభిప్రాయాలు, సంస్కృతులు వున్నప్పటికీ ఐక్యంగా కదిలి సాధించుకున్న చరిత్రను తిరగేస్తే సత్యాలు బోధపడతాయి. ప్రాణాలు ధారపోసిన వాళ్లంతా ఈ దేశం తమదని భావించారు. అందులో ముస్లింలున్నారు, సిక్కులున్నారు, బౌద్ధులున్నారు, హిందువులున్నారు, పార్శీలున్నారు. భిన్న సంప్రదాయులూ వున్నారు. ఈ దేశం ఏ ఒక్కరిదీ కాదు. అందరిదీ. దేశ సంపదపై ప్రజలందరికీ హక్కు వుంటుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందడం కోసం, సమానత్వాన్ని సాధించడం కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలి.
– కె. ఆనందాచారి,
9948787660

Spread the love