ఇంటర్నెట్ లో భూతాలు

ట్రోల్‌ అనే ఇంగ్లీషు పదానికి ప్రెస్‌ అకాడమీ వాళ్ల నిఘంటువులో అర్ధం వెతికితే ఈ విధంగా వుంది… ”స్నేహ పాత్ర భూతం, కొంటె చేష్టలు చేసే మరుగుజ్జు”! సామాజిక మాధ్యమాల్లో మనం ట్రోల్స్‌గా అభివర్ణించే వాళ్లు నిజంగానే ఇట్లాగే వుంటే ఎవ్వరికీ ఇబ్బంది వుండేది కాదు. కానీ ట్రోల్‌ అర్ధం పూర్తిగా మారిపోయింది. వాళ్లు కేవలం భయభ్రాంతులు కలిగించే పేర్లు లేని భూతాలు. గత రెండు వారాలుగా తులసీచందు పడుతున్న క్షోభ, సామాజిక మాధ్యమాల్లో దాన్ని గురించి నడుస్తున్న ఎడతెరిపిలేని చర్చ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక జర్నలిస్టు తన వృత్తి చిత్తశుద్ధిగా చేసుకుంటుంటే ఆమె వెనక ఇంత పెద్ద పేర్లు పరిచయం లేని, ముఖాలు లేని సైన్యం విరుచుకుపడుతుందా? సాధారణంగా నేరం చేసేవాళ్లు, చేద్దామనే వుద్దేశ్యం వున్నవాళ్లే తమ పేర్లు, ముఖాలు దాచుకుని వస్తారు. చట్టబద్ధంగా చేసే పనులకి దాక్కొని చేయాల్సిన అవసరం వుండదు. అటువంటి వాళ్లకి చట్టబద్ధంగా నడుచుకునే సాధారణ పౌరులకి వుండే రాజ్యాంగం ఇచ్చిన వాక్‌స్వాతంత్య్రం వర్తిస్తుందా? అదీ దుర్భాషలాడటానికీ, ప్రాణహానీ, మానహానీ చేస్తామని బెదిరింపులు ఇవ్వడానికీ, ఇతరులని హింసకు ప్రేరేపించే విధంగా మాట్లాడటానికీ రాజ్యాంగం వాక్‌ స్వాతంత్య్రం ఇచ్చిందా? గత కొంత కాలంగా సోషల్‌ మీడియా వేదికగా జర్నలిస్టులు, సామాజిక కార్యర్తలపై ట్రోలింగ్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వారం కవర్‌ స్టోరీ…
ముంబైలో బాల్‌ థాకరే మరణించినప్పుడు, రోడ్లు మూసేసి హంగామా జరుగుతుంటే ఒక అమ్మాయి తన స్నేహితురాలితో ‘ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇంత గందరగోళం అవసరమా’ అని కామెంట్‌ చేసింది. ఒకమ్మాయిని పోస్ట్‌ పెట్టినందుకు, ఆమె స్నేహితురాలు దానికి లైక్‌ కొట్టినందుకు అరెస్ట్‌ చేసి 14 రోజులు జుడీషల్‌ కస్టడీకి పంపారు.
జర్నలిస్టుల మీద జరిగే ట్రోలింగ్‌ ఒక ఎత్తయితే సామాజిక కార్యకర్తలుగా వున్న మహిళల మీద జరిగే ట్రోలింగ్‌ మరోఎత్తు. తెలంగాణలో కొందరు ప్రముఖ కార్యకర్తలు సంధ్య, దేవి, సజయ, ఖలీదా వంటి వాళ్లపైన ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో దాడులు జరుగుతాయి. వీళ్లు నలుగురు కూడా రోజులో ఏ సమయంలోనైనా ప్రమాదంలో వున్నాం, సహాయం కావాలి అని ఎవరైనా మహిళలు కాని, పిల్లలు గాని ఫోన్‌ చేస్తే వెంటనే అన్నీ వదిలి వాళ్లకి మద్దతుగా నిలబడతారు.
గత రెండేళ్లుగా తులసి వెనుక కొందరు దాడి చేస్తూనే వున్నారు. ఇది వరకు కూడా ఆమె పోలీసులకి సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసింది. ఇంత వరకూ దాని గురించి ఎటువంటి చర్యా పోలీసులు తీసుకోగా మనం చూడలేదు.
ఈ సారి మాత్రం ఆమె బాధతో పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్టు చూసిన వాళ్ల నుంచి, జర్నలిస్ట్‌ సంఘాల నుంచీ, పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కానీ ఈ మొత్తం ఉదంతంతో సతమతం అయిన తులసికి తన అసలు పని వదిలిపెట్టి పోలీస్‌స్టేషన్లకీ, మీటింగులకీ తిరగాల్సి వచ్చింది. ట్రోల్స్‌కి ఇది కూడా ఒక సాధనమే. జర్నలిస్టులను పని చేయకుండా, పనికిరాని విషయాల్లో ముంచేయడం. ఇది దేశ వ్యాప్తంగా వాళ్లు తమకు నచ్చని జర్నలిస్టులతో చేసేదే.
వీళ్లకి నచ్చని జర్నలిస్టులది చాలా పెద్ద జాబితా వుంది. సామాజిక మాధ్యమాలు కొత్తగా విస్తరిస్తున్న రోజుల్లో మొదటగా బర్ఖాదత్‌, రాణా అయూబ్‌లని ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. వీళ్లు రాసే విషయాలను ప్రశ్నించడం కానీ, విశ్లేషించడం కానీ, తప్పు అని నిరూపించడం కానీ చేయకుండా కేవలం వాళ్లని భరించరాని నీచమైన భాషలో బూతులు తిడతారు. మహిళలు కాబట్టి వ్యభిచారి అని, లైంగిక అవమానాలతో కూడిన భాషతో దాడి చేస్తారు.
హిందూ మహిళలైతే ముస్లిం వ్యక్తులతో పెళ్లి అయిందనీ, ముస్లిం తల్లో తండ్రో వున్నారని కూడా ఆరోపిస్తారు. ఇక్కడ పితృస్వామ్య భావజాలాన్ని మతోన్మాదంతో జోడించి దాడి జరుగుతుంది. జర్నలిజం వంటి పురుషాధిక్య వృత్తిలో ధీటుగా నిలదొక్కుకుని నిలబడే ధైర్యంగా వుండే మహిళలని చూస్తే ట్రోల్స్‌కి విపరీతమైన అసహనం, ద్వేషం.
తరువాతి కాలంలో స్వాతి చతుర్వేది, రోహిణీ సింగ్‌, షాహినా, నేహా దీక్షిత్‌ వంటి సుప్రసిద్ధ మహిళా జర్నలిస్టులు అంతా దాడులు ఎదుర్కొన్న వాళ్లే. వీళ్లందరికీ వున్న సామాన్య లక్షణం వాళ్లు అధికారంలో ఏ ప్రభుత్వం వున్నా తమ జర్నలిస్టు వృత్తి ధర్మాన్ని చిత్తశుద్ధితో ధైర్యంగా నిర్వర్తిస్తారు.
ట్రోల్స్‌ సంస్కృతి ముందుకు వస్తున్న కాలంలో స్వాతి చతుర్వేది ‘ఐ ఆమ్‌ ఎ ట్రోల్‌’ అనే పుస్తకం రాసి సమాజానికి ఒక పెద్ద మేలు చేసింది. అప్పటి వరకు పేర్లు, ముఖాలు లేని గుంపులు సామాజిక మాధ్యమాల్లో భీభత్సంగా స్వైర విహారం చేస్తున్నప్పుడు నిజంగా దేశంలో ఇంతమంది కుసంస్కారులు వున్నారా అని అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. స్వాతి పుస్తకంలో వీళ్లు 2014 పార్లమెంట్‌ ఎలక్షన్లకి ముందు నుంచీ జీతాలిచ్చి పోస్టుకీ, ట్వీట్‌కి రూపాయో రెండో ఇచ్చి రాజకీయ ప్రత్యర్థులపైన అబద్ధ ప్రచారాలు, అవమానకరమైన పోస్టులు, కల్పిత కథలు, వక్రీకరణలు ఒక ఇండిస్టియల్‌ స్థాయిలో చేయించడానికి బిజెపి పార్టీ నిలబెట్టిన వ్యవస్థ అని వివరిస్తుంది.
ఫేక్‌ న్యూస్‌ అనీ, పోస్ట్‌ ట్రూత్‌ సొసైటీ అని కొత్త పదాలు, భావనలు సాధారణ పరిభాషలోకి అప్పుడే వచ్చాయి. ఇప్పుడు ఫాక్ట్‌ చెకింగ్‌ సమాచార రంగంలో ఒక ముఖ్యమైన అనుబంధ ప్రక్రియ.
జర్నలిస్టుల మీద జరిగే ట్రోలింగ్‌ ఒక ఎత్తయితే సామాజిక కార్యకర్తలుగా వున్న మహిళల మీద జరిగే ట్రోలింగ్‌ మరోఎత్తు.
తెలంగాణలో కొందరు ప్రముఖ కార్యకర్తలు సంధ్య, దేవి, సజయ, ఖలీదా వంటి వాళ్లపైన ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో దాడులు జరుగుతాయి. వీళ్లు నలుగురు కూడా రోజులో ఏ సమయంలోనైనా ప్రమాదంలో వున్నాం, సహాయం కావాలి అని ఎవరైనా మహిళలు కాని, పిల్లలు గాని ఫోన్‌ చేస్తే వెంటనే అన్నీ వదిలి వాళ్లకి మద్దతుగా నిలబడతారు. తమకు చేతనైనంత సహాయం చేస్తారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో పీడితులకి నెలలు, ఏళ్ల తరబడి కూడా అండ అవసరం అయితే వీళ్లు నిలబడతారు. చాలా సందర్భాల్లో పీడితులు తమ భావజాలంతో ఏకీభవించని వాళ్లైనా కేవలం మానవత్వపు కోణం నుంచి నిస్పాక్షికంగా ఆలోచించి సహాయం చేస్తారు.
వీళ్ల మీద ట్రోల్స్‌ చేసేవాళ్లు ఆడే దుర్భాషలు, బూతులు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరికీ ఎన్నడూ అండగా వుండకపోగా ప్రత్యేకించి కులాంతర మతాంతర సంబంధాల్లో హింస జరిగితే నేరస్థులని కూడా నిలదీయకుండా ముందు మహిళా కార్యకర్తల మీద విరుచుకుపడతారు, సంధ్య ఎక్కడీ దేవి ఎక్కడీ అంటూ.
దీనిలో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఈ మహిళా కార్యకర్తలు పితృస్వామ్య భావజాలాన్ని, దాని పర్యవసానంగా సమాజంలో జరుగుతున్న హింసనీ పదే పదే ఎత్తి చూపిస్తారు. ప్రశ్నిస్తారు. వీళ్లు వేసే ప్రశ్నల నుంచి తప్పించుకోవటానికి తమ భావజాలానికి బానిసలై వున్న కొందరు మహిళలని అడ్డం పెట్టుకుని పితృస్వామ్యాన్ని, మత ఛాందసత్వాన్ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తారు.
ఈ మతోన్మాదంలో భాగంగానే మరోరకం హింస ముస్లిం మహిళల మీద జరుగుతుంది. రెండేళ్ల క్రితం 4 జులై 2021 నాడు ట్విట్టర్‌లో చాలామంది ప్రముఖ ముస్లిం మహిళల ఫొటోలు పెట్టి ‘డీల్‌ ఆఫ్‌ ద డే’ (నేటి చౌక బేరం) అని రాశారు. ఇది సుల్లీ డీల్స్‌ అనే ఆప్‌ ద్వారా జరిగింది.
అంతకు మునుపు కూడా ఇదే ముఠా పదిమంది పాకిస్తానీ మహిళలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఐటీసెల్‌ కన్వీనర్‌ హసీబా అమీన్‌ను ఒకటి నుంచి పది వరకు వున్న స్కేల్‌లో రేట్‌ చేయమని పబ్లిక్‌లో పెట్టి వేధింపులకు గురి చేశారు. ఈ సుల్లీ డీల్స్‌ అనే ఆప్‌ ముస్లిం మహిళలని వేధించడానికి, అవమానించడానికి చేసిన వ్యక్తి ఓంకారేశ్వర్‌ ఠాకూర్‌ అనే బాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ కోర్స్‌ చేస్తున్న విద్యార్థి. ఇతన్ని ఇండోర్‌ నుంచి అప్పట్లో అరెస్టు చేశారు.
మరి కొద్ది రోజులకే జనవరి 1, 2022 న నూతన సంవత్సర సంబరాల మధ్యలో అకస్మాత్తుగా బుల్లీబారు అనే పేరుతో ప్రముఖ ముస్లి మహిళలని ఇంటర్నెట్‌లో వేలానికి పెట్టారు. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ కార్యకర్త ఖలిదా పర్వీన్‌, ఇంకా దేశంలో వున్న ముస్లిం మహిళా కార్యకర్తలు, మేధావులు ఇందులో వున్నారు. ఈ ఆప్‌ని గిట్‌ హబ్‌లో పెట్టారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో గిట్‌హబ్‌ ఈ ఆప్‌ని తొలగించింది.
ఈ ఆప్‌ని పోలీసులు నియో నాజీ, దక్షిణ పంక్తి తీవ్రవాదులకు వర్తించినవని తేల్చింది. వీళ్లు ముస్లింలు, దళితులు, సిక్కులు, ఇతర అల్ప సంఖ్యాకులని హత మార్చాలనే భావజాలంతో అల్ప సంఖ్యాక మతాల వాళ్ల పేర్లతో ద్వేషపూరిత పోస్టర్లు పెట్టి అరాచకం, హింస పురికొల్పే పనిలో వున్నారని తేల్చారు.
కొన్ని తీవ్రమైన సెక్షన్స్‌ కింద నీరజ్‌ బిష్నోరు అనే 21 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థిని అరెస్ట్‌ చేశారు కానీ త్వరలోనే పోలీసుల దయార్థ హృదయం కరిగిపోయి, మొదటిసారి చేసిన నేరం కాబట్టి అతన్ని విడిచిపెట్టారు. ఇతనితో పాటు ఇంకా ముగ్గురు కూడా వున్నారు.
ఈ గిట్‌ హబ్‌ అనే సోర్స్‌ కోడ్‌ రిపాసిటరీ మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి చెందినది. ఇందులో సోర్స్‌ కోడ్‌ ఉపయోగించి బుల్లీబారు, సుల్లీడీల్స్‌ వంటి ఆప్స్‌ కూడా చేస్తున్నారు.
ఇటువంటి ఉదంతాల్లో మనకు అర్ధం అయ్యేదేమంటే మన దేశంలో అటవీకాలం నాటి భావజాలం గల విద్యార్థుల చేతుల్లో అత్యాధునిక టెక్నాలజీ పెడితే ఎటువంటి పర్యవసానాలు వుంటాయోనని. కేవలం టెక్నాలజీ నేర్పితే సరిపోదని, టెక్నాలజీ కేవలం ఒక పరికరం అని, దాన్ని సామాజిక బాధ్యతతో వాడేందుకు కావాల్సిన విద్య కూడా విద్యార్థులకు వుండాలని అర్ధం అవుతుంది.
ఇదే సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే గందరగోళం పట్ల ఎట్లా స్పందిస్తాయి అన్నది పరిశీలించడం అవసరం.
పాత్రికేయుల మీద, సామాజిక కార్యకర్తల మీద దాడులు జరిగినప్పుడు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎప్పుడూ పెద్ద చర్యలు తీసుకోవడం చూడం. టెలివిజన్‌ చర్చల్లో, పత్రికల్లో, వ్యాసాల్లో తరచూ ఒక సాకు చెప్తూ వుంటారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తులను పట్టుకోవడం తేలిక కాదని. అదే రాజకీయ నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎంత సామాన్యమైన కామెంట్‌ పెట్టినా, ఒక కార్టూన్‌ వేసినా వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటారు.
ముంబైలో బాల్‌ థాకరే మరణించినప్పుడు, రోడ్లు మూసేసి హంగామా జరుగుతుంటే ఒక అమ్మాయి తన స్నేహితురాలితో ‘ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇంత గందరగోళం అవసరమా’ అని కామెంట్‌ చేసింది. ఒకమ్మాయిని పోస్ట్‌ పెట్టినందుకు, ఆమె స్నేహితురాలు దానికి లైక్‌ కొట్టినందుకు అరెస్ట్‌ చేసి 14 రోజులు జుడీషల్‌ కస్టడీకి పంపారు. పోస్టు పెట్టిన షాహీన్‌ ఢాకా వాళ్ల మామయ్య నడుపుతున్న ఆర్థోపెడిక్‌ క్లినిక్‌ని శివసైనికులు ధ్వంసం కూడా చేశారు. అప్పటి ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ పింగ్లి, ”ఫేస్‌బుక్‌లో ఎవరైనా కామెంట్లు పెట్టొచ్చు కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి” అని ప్రవచించాడు కూడా.
ఇటువంటి కేసులే బెంగాల్‌లో, తమిళనాడులో, ఇతర రాష్ట్రాలలో జరిగినాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో జరిగే చర్చల్లో, వివాదాల్లో షేర్‌ చేసే కార్టూన్లలో, వార్తల్లో, వీడియోల్లో ఏదైనా ప్రభుత్వాలను విమర్శించేది వుంటే ఒకటికి రెండు సార్లు చూసుకోవడం అలవాటయింది జనాలకి. చాలా మంది ఈ మాధ్యమాల నుంచి అవి తెచ్చిపెట్టే వివాదాలకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నవాళ్లూ వున్నారు.
అదే విచ్చలవిడిగా మహిళా జర్నలిస్టులని, ఆక్టివిస్టులని అవమానిస్తూ బూతులు తిడుతున్నా వ్యవస్థలో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ స్పందించరు. ఇది రాజకీయంగా ట్రోల్‌ ముఠాలతో ఏకీభావం వుండబట్టా లేక జర్నలిస్టుల, ఆక్టివిస్టుల ప్రతిష్ట, గౌరవం కాపాడాల్సిన అవసరం వీళ్లకి లేదని అర్ధం చేసుకోవాలా?
ఇదే ధోరణి సామాజిక మాధ్యమాలు వుండే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా ఎదురవుతుంది. ఇవి అంతర్జాతీయ, అత్యంత పెద్ద స్థాయి సంస్థలు. ఫేస్‌బుక్‌కి దేశంలో 314 మిలియన్‌ వినియోగదార్లు వున్నారు. అట్లానే యూట్యూబ్‌ వాడేవాళ్లూ 467 మిలియన్ల మంది వున్నారు. ఈ ప్లాట్‌ఫాంలు తమకు కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ వున్నాయని చెప్పుకుంటూ వుంటాయి.
ఫేస్‌బుక్‌కి అంతర్జాతీయంగా ఇస్లామోఫోబియా (అంటే ఇస్లాంని విద్వేష పూరితంగా చిత్రించే తత్వ్తం) పెంపొందించే సంస్థగా పేరుంది. మ్యాన్‌మోర్‌లో రోహింగ్యాల మీద ఏళ్ల తరబడి విద్వేష ప్రచారం కొనసాగించి, చివరికి వాళ్ల మీద ఊచకోత జరిగేవరకూ కూడా ఫేస్‌బుక్‌ది ఒక కీలకమైన పాత్ర వుందని ఒక ఐక్యరాజ్య సమితి నివేదిక చెప్తోంది. ఆ నివేదిక వచ్చినప్పుడు ఫేస్‌బుక్‌ క్షమాపణ కూడా చెప్పుకుంది.
రోహింగ్యాల వ్యతిరేక ప్రాపగాండా నడుస్తున్నంత కాలం ఫేస్‌బుక్‌ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, ఎవరేమన్నా నిమ్మకు నీరెత్తినట్టు వుండి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దాని పర్యవసానం నిజజీవితంలో కొన్ని లక్షల మంది రోహింగ్యాలు జాత్యహంకారానికి దాడులకి గురై నిర్వాసితులు అయ్యారు.
ఫేస్‌బుక్‌ ధోరణి భారత్‌లో కూడా అదేవిధంగా వుంది. ఇక్కడ ఇస్లామోఫోబియాతో పాటు, ప్రగతిశీల జర్నలిస్టులు, మహిళల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంటే, ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా ఏమీ చర్యలు తీసుకోదు. అధికారంలో వున్న ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతూ తన పబ్బం గడుపుకుంటుంది.
ఫేస్‌బుక్‌లో అసభ్యంగా, తీవ్రమైన పదజాలంతో మహిళా కార్యకర్తల మీద నిత్యం దాడి జరుగుతూ వుంటుంది. ఈ మూకలకి ఫేస్‌బుక్‌, ప్రభుత్వ వ్యవస్థ అండగా వుంటున్నాయి.
ట్విట్టర్‌లో పోస్టులు తీసివేయమంటూ, అకౌంట్లు నిలిపివేయమంటూ ప్రభుత్వం నుంచే కొన్ని వేల సార్లు డిమాండ్లు వస్తుంటాయి. చివరికి ఈ దేశ రాజ్యాంగం ప్రకారం వాక్‌ స్వాతంత్య్రం వుంది కాబట్టి ప్రభుత్వం ఇన్ని సార్లు ట్వీట్లు, అకౌంట్లు తీసివేయమనడం రాజ్యాంగ విరుద్దం అంటూ ట్విట్టర్‌ కోర్టుకి వెళ్లింది.
కర్నాటక హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే అంటూ ట్విట్టర్‌ మీద 50 లక్షల జుర్మానా విధించింది. ఈ తీర్పుని ప్రజల డిజిటల్‌ హక్కులని పూర్తిగా కాలరాచేదిగా విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో 2009లో రూపొందించిన ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ప్రొసీజర్‌ అండ్‌ సేఫ్‌గార్డ్స్‌ ఫర్‌ బ్లాకింగ్‌ ఫర్‌ ఆక్సెస్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ బై పబ్లిక్‌) రూల్స్‌ సెక్షన్‌ 69 ఎ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆక్ట్‌ ప్రకారం ఏదైనా కంటెంట్‌ని తీయాలన్నా, రద్దు చేయాలన్నా ఎటువంటి ప్రక్రియ పాటించాలన్నది స్పష్టంగా వివరిస్తాయి. వీటి ప్రకారం స్పష్టంగా లిఖిత పూర్వకంగా వివరాలతో ఆర్డర్‌ జారీ చేయాలి. ఇంటర్మీడియరీ ప్లాట్‌ఫాం కి (ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటివి) నోటీసులు ఇవ్వాలి. అట్లానే ఎవరి పోస్టులు గాని, అకౌంట్లు గానీ తీస్తున్నారో వాళ్లకి కూడా ఏ కారణాల వల్ల తీస్తున్నారో తెలియజేయాలి. ఇవేవీ లేకుండా మినిస్ట్రీలో కూచున్న అధికారులు నిత్యం నిఘా పెట్టి, రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే సమాచారాన్ని ఇష్టారాజ్యంగా అడ్డుకుని, తమకు సానుకూలంగా వున్న వాళ్లు అసాంఘిక శక్తులైనా సరే పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరుగుతోంది.
ప్రభుత్వాలు, కోర్టులు, వ్యవస్థ నిజంగా నియంత్రించాల్సిన సందర్భాల్లో చూసీ చూడనట్లు వూరుకొని, జర్నలిస్టులని ఆక్టివిస్టులని రకరకాలుగా వేధింపులకి గురిచేసి వారు పనిచేస్తున్న ఆయా రంగాలనుండి విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు కల్పిస్తూ మరోవైపు రాజ్యం అధికారాలని విచ్చలవిడిగా ఉపయోగించి అంతర్జాతీయ సంస్థలని కూడా బెదిరించి దేశంలో స్వేచ్ఛగా చర్చలు జరగకుండా నియంత్రిస్తోంది.
మహిళా జర్నలిస్టులు, ఆక్టివిస్టులపై జరిగే దాడులని వీధి మూకల ఆధ్వర్యంలో నడిపించి, కొంతమందిని, కొన్ని సంస్థలని, ప్రత్యర్థులని అధికార దుర్వినియోగం ద్వారా నియంత్రిస్తున్నారు. ఇంక ఇవేవీ చాలనట్టు కొత్తగా డిజిటల్‌ కంటెంట్‌ని ఇంకా నియంత్రించేందుకు వచ్చే 2024 ఎన్నికల లోపల మరో చట్టం తీసుకురాబోతున్నారు.
ఒకే ఆశ ఏమిటంటే 142 కోట్ల మంది జనాభా వున్న దేశంలో అన్ని ఆటంకాల మధ్య ప్రజలు తమ పరిష్కారాలు వెతుక్కుంటారు. అప్పటి వరకు మరుగుజ్జులతో, భూతాలతో తలపడక తప్పదు.
– ప్రొ|| పద్మజ షా

Spread the love