నల్లగుర్రం నాలుక్కాళ్లు దట్టమైన అడవిలోకి అడుగుపెట్టాయి. ఆ వెనుక మరో ఇరవై కాళ్లు గిట్టలు చప్పుడు చేశాయి. నాలుగు టైర్ల జీపు కూడా మరో వైపు నుంచి కీకారణ్యంలోకి ప్రవేశించింది. గుర్రాల మీద వున్నవాళ్లు ఆరుగురైతే జీపులో వచ్చిన వాళ్లూ ఆరుగురే. నాలుక్కాళ్ల నల్లగుర్రం తోలుతున్నోడు గ్యాంగ్ లీడర్ అయితే, జీపు నడిపేవాడి పక్కన కూచున్నాడు స్టేట్ రౌడీ.
అడవిబాట పట్టాం. అందరూ కేర్‌ఫుల్‌గా వుండండి. అవసరమైతే ప్రాణాల్తీయాలి. గన్నులు గట్టిగా పట్టుకోండి అన్నాడు జీపులో వున్న స్టేట్‌రౌడీ. యస్ బాస్, రడీ బాస్ అన్నారు జీపులో వెనుక కూర్చున్న గుండెలు తీసే బంట్లు. జీపు డ్రైవ్ చేస్తున్న వాడికి ఓ చెవి లేదు. ఎప్పటిలాగే ఓ ఆడ లేడీని బలవంతం చేయబోతే వాడి కుడి చెవిని నమిలి తినేసిందంటారు. సింగిల్ చెవి ఓనరైతేనేం, వాడు మంచి డ్రైవరే. చెట్ల మధ్య నుంచి ఎగుడూ దిగుడూ దారి మీద జీపును జంపు చేయిస్తున్నాడు. పక్కన కూచున్న బాస్ స్టేట్‌రౌడీకి నెత్తిమీద జుట్టయితే లేదు. ఖాళీ బుర్ర కొంచెం ఎత్తుగా గుండ్రంగా కోడిగుడ్డులా వుంది. వాడి చెంప మీద పెద్ద పులిపిరి చిన్న గొంగళి పురుగులా వుంది. వాడి కళ్ళల్లో చింతనిప్పుల స్టాక్ వుంది. వెనక కూచున్న వాళ్లందరి ముఖ్యాల్లో గాట్లూ, కళ్లల్లో కైపూ, పళ్లల్లో పాన్‌పరాగూ వున్నాయి. ఒకడు ఊక బస్తాలా వుంటే మిగిలిన ముగ్గురూ దొంగ మేకలు పట్టేవాళ్లలా వున్నారు.
అడవిలోకి వచ్చాం. అందరూ జాగ్రత్తగా వుండాలి. అవసరమైతే ప్రాణాలు తీయాలె. లోడెడ్ గన్నులున్నాయి. భయపడేదే లేదు అన్నాడు నల్ల గుర్రం నడుపుతున్న గ్యాంగ్‌లీడర్. వీడికున్న రెండు కళ్లల్లో ఒకటి గాజుకన్ను. ఒకప్పుడు గ్యాంగ్‌వార్‌లో అవతలి వాడ్ని పొడవబోయి తన కన్ను తానే పొడుచుకున్నాడు. సింగిల్ ఐ ఓనర్ అయితేనేం మంచి జాకీయే. చెట్లమధ్య గతుకుల బాట మీద గుర్రాన్ని ‘గ్యాలప్’ చేయిస్తున్నాడు. వాడి తల మీద జుట్టులో ఇది వరకు ఓ పిట్ట గూడు కట్టుకుని వుండేది. ఇప్పుడు లేదు, ఎగిరిపోయినట్టుంది. బాస్ వెనుక గుర్రాలెక్కి తొక్కుతున్న వాళ్లల్లో ఒకడు చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ ఎప్పుడు ఎవర్ని వేసేస్తాడో తెలీదు. మిగిలిన నలుగురిలో ఇద్దరికి సూపర్ డూపర్ సినిమాకు సరిపోయే స్టోరీ వుంది కానీ మరో ఇద్దరికి చెప్పుకోదగ్గ హిస్టరీ లేదు. మహా యితే పది.. పదిహేను దోపిడీలు, పదికి తక్కువ కాకుండా మర్డర్లు, పది దాటేసిన రేప్ కేసులు ఒంటిమీద వున్నవాళ్లు.
చీకటి అనకొండ వెలుతుర్ని కొంచెం కొంచెం చప్పరిస్తూ మింగేస్తుండడంతో జీపు ఆపు అనరిచాడు స్టేట్‌రౌడీ. ఇక్కడ బాగుంది. ఈ రాత్రికిక్కడే వుండిపోదాం అన్నాడు. ఆగిన జీపులోంచి దిగినవాళ్లంతా వొళ్లు విరుచుకున్నారు. కర్రలు పోగేసి నిప్పు ముట్టించి దాని చుట్టూ కూచున్నారు. బాస్ అరుగు మీద కూచుని మందు సిప్ చేస్తుంటే కింద మంట చుట్టూ కూచున్నవాళ్లు తెచ్చుకున్న తిండి తింటూ మందు తాగుతున్నారు. మందు బాగుంది. తలకాయ కూర వుంటే మజా వచ్చేది అన్నాడు బాస్. ఆన్‌లైన్‌ల ఆర్డర్ చెయ్యాల్నా బాస్ అన్నాడొకడు. లొకేషన్ పెట్టండి ఎవడొస్తడ్రా అన్నాడు బాస్ పెద్దగా నవ్వుతూ. అందరూ పళ్లికిలించారు.
చీకటి పడిందిరో. గుర్రాలు టైరైనయి. ఇక్కడ ఈ నైట్‌కు ఆగిపోదం అన్నాడు గ్యాంగ్ లీడర్. అందరూ గుర్రాలు దిగారు. హమ్మయ్య అనుకున్నవి గుర్రాలు గుగ్గిళ్లు తినవచ్చని. మంట పక్కన కూచుని గ్లాస్‌లో మందువైపు చూస్తూ ‘ఐస్’ దొరుకుతదార అన్నాడు బాస్ తన జోక్ కు తనే నవ్వుతూ. నేనైతే ‘రా’ కొడ్త అన్నాడొకడు. మంచింగ్‌కు లీషియన్ మటన్ కర్రీ తెచ్చిన అన్నాడింకొకడు. చీకటి చిక్కబడే టైమ్‌కి ఐదుగురు మట్టిలో దొర్లుతుంటే, ఒక్కడు మాత్రం గన్‌తో కాపలా వున్నాడు.
తెల్లారింది. మ్యాప్ చూస్తూ జీపు ఎక్కాడు స్టేట్ రౌడీ. మ్యాప్ చూసుకుని గుర్రం ఎక్కాడు గ్యాంగ్ లీడర్. ఇవాళ నిధి సాధించాల్సిందే అనుకున్నారిద్దరు అనుచరులు. జీపు గ్యాంగూ, గుర్రాల గ్యాంగూ ఒక చోట కలిశాయి. తుపాకులు పేలాయి. ఇటోడూ, అటోడూ పైలోకం ప్రయాణం కట్టారు. మనం ఇలా కొట్టుకుంటే అందరం చస్తాం. నిధి ఎవ్వరికీ దొరకదు. మనిద్దరి దగ్గర మ్యాప్‌లున్నాయి. వజ్రాలు మనిద్దరివీ అనరిచాడు జీపు గ్యాంగు లీడర్. తెల్ల కర్చీపు ఊపాడు గుర్రం గ్యాంగు రౌడీ.
అందరూ షేక్ హేండ్లిచ్చుకున్నారు. ఓ చోట కూచుని రెండు మ్యాపులూ పక్కన పెట్టి చూసుకున్నారు. తెలివైన వాడొకడు రూట్ డిసైడ్ చేశాడు. వజ్రాలు దొరికాక ‘ఫిఫ్టీ ఫిఫ్టీ’ అనుకున్నారు బాస్‌లిద్దరు. మధ్యాహ్నం దాటింది. సూర్యుడు కొంచెం ‘డల్’ అయ్యాక అందరూ ఓ కొండ ఎక్కారు. దారిలో ఓ పాము వెనక నడుస్తున్న ఇద్దర్నీ కాటేసి కాటికి పంపేసింది. ఎనిమిది మంది వజ్రాల వేట గాళ్లు కొండ అంచున ఇరుకు దారిలో నడిచారు. బ్యాలెన్సు అవుట్ అయి ఇద్దరు కేకలు వేస్తూ లోయలో పడిపోయారు. ఆరుగురు గాలిలో ఊగులాడే బ్రిడ్జి మీద నడుస్తుంటే మధ్యలో దుంగలు విరిగి తిరిగి రాలి లోకానికి చడీచప్పుడూ చేయకుండా వెళ్లిపోయేరు ఇద్దరు.
మిగిలిన నలుగురు బ్రిడ్జి దాటాక ఓ గుహ కనిపించింది. నిధి ఇక్కడే వుంది అన్నాడొక అనుచరుడు. వజ్రాలు దొరికినట్టే, వేట ముగిసినట్టే అన్నాడింకొకడు. పెద్ద పెద్ద సాలెగూళ్లను చించుకుంటూ లోపలికి వెళ్లిన వాళ్లకు ఓ పెద్ద చెక్క పెట్టె కనిపించింది. వజ్రాలు, వజ్రాలు, ఎర్ర వజ్రాలు అని అరిచారందరూ గుహలో ‘రీ సౌండ్’ వచ్చేట్టు. చెక్క పెట్టెకు వున్న తుప్పు పట్టిన తాళాన్ని పిస్టల్‌తో పేల్చి, ఆ చేత్తోటే గ్యాంగ్ లీడర్‌కు మిగిలిన ఒక్క అనుచరుడ్ని కాల్చేశాడు స్టేట్ రౌడీ. జవాబుగా గ్యాంగ్‌లీడర్ చేతిలో పిస్టల్ పేలి స్టేట్ లీడర్ కు మిగిలిన ఏకైక అనుచరుడూ కిక్కురుమనకుండా కుప్పకూలాడు.
మంచిపని చేసినవు. ఇక వజ్రాలు ఎర్ర వజ్రాలు కిలో అయితే సగం సగం మనిద్దరికే అన్నాడు గ్యాంగ్ లీడర్. మనం ఇంక జిగ్రీ దోస్తులం అన్నాడు స్టేట్ రౌడీ. ఇద్దరూ కల్సి చెక్కపెట్టె మూత తీశారు. లోపల ఇంకోటి వుంది. దాన్ని బయటకు తీసి తెరిస్తే మరోటి కనిపించింది. ఇలాగ తెర్చుకుంటూ పోతే చివరికి ఓ బుల్లి పెట్టె కనిపించింది. ఇందులోనే గ్యారంటీగా వజ్రాలున్నయి. బయటకు వెళ్లి పంచుకుందాం అన్నాడు స్టేట్‌రౌడీ. ఇద్దరూ బైటికి వచ్చారు. గ్యాంగులీడర్ బుల్లిపెట్టె తెరుస్తుంటే స్టేట్‌రౌడీ పిస్టల్ పేలింది. వజ్రాలు మొత్తం తనవే అనుకున్న స్టేట్ రౌడీ గ్యాంగ్ లీడర్ పిస్టల్ పేలడం గమనించలేదు. బోర్లాపడుతూ చూశాడు. తెర్చుకున్న బుల్లి పెట్టెలో నుంచి గుండ్రటి, ఎర్రటి టమాటాలు కిందపడి దొర్లసాగినయి. సన్‌లైట్‌కు మెరుస్తున్న టమాటాలను తనివితీరా చూడలేక గ్యాంగు లీడర్ కన్నుమూశాడు.
ఎర్రగా గుండ్రంగా వున్నవివేమిటి డాడీ అనడిగాడు కొడుకు తండ్రిని పుస్తకంలో బొమ్మ చూపిస్తూ. వీటిని ఒకప్పుడు ‘టమాటాలు’ అనేవారు. ఇప్పుడివి వజ్రాలు. ఒకప్పుడు అంగళ్లల్లో రత్నాలు అమ్మేవారుట. కొన్నాళ్లకింద ఈ టమాటాల్ని మార్కెట్లో అమ్మేవారు. నేను చూశాను. వజ్రాలు కొనే స్తోమత మనకు లేదు బాబూ అన్నాడు తండ్రి.
– చింతపట్ల సుదర్శన్
9299809212