అంతా పోగొట్టుకున్నటు

కాళ్ళు చాచుదామనుకున్నా
ఒళ్ళు విరుచుకుందామనుకున్నా
నోరు బార్లా తెరిచి
ఆవలిద్దామనుకున్నా
గుండెలనిండా ఊపిరి
పీల్చుకుందామంటే
కొండచిలువ చుట్టేసినట్టుగా ఉంటది

వీరుడిని తలుచుకొని
ఒక అమర గీతం
పాడుకోబోతే
పెదవులూ నాలుకా చలిస్తాయే కానీ
గొంతు పెగలదు
ఏడ్చిఏడ్చి గుండె కడిగేసుకోవాలంటే
కన్నీటి వరదకు ఎవడో
మోకాలొడ్డినట్టూ ఉంటది

నాతో వచ్చే నీడ కూడా
నా లాగే అనిపించదు
ఎవడో వికృతంగా గీకేసినట్టూ ఉంటది

తోడు వచ్చిన భుజాలూ పాదాలూ
నన్ను ఒంటరిచేసి తోవ తప్పి
పోయినట్టూ ఉంటది

ఎవడో పొద్దుపొడుపును సైతం
అరిచేతుల నడుమ నలిపి
గుట్కా నమిలి ఉమ్మేస్తున్నట్టూ అనిపిస్తది

వీధి కుక్కల మూతులకు
గోవతాళ్ళు చుట్టేసి కట్టి
ఎవడో గడీల వదులుకున్నట్టూ ఉంటది

చూర్లలో మడిచిపెట్టిన గొంగళ్లకు
చెదలు పట్టినట్టూ

చిలుక్కొయ్యకు తగిలించిన
గజ్జెల పేర్ల తాళ్లు చీకిపోయినట్టూ
కీచురాళ్ల కంఠాలకు
తాటినారల తోటి
ఉరులు పోసినట్టూ ఉంటది

మందమీద తోడేలు పడితే
తల్లి మేకలు చెల్లాచెదరై పరుగెడుతున్నట్టూ
అనిపిస్తుంది

కళ్ళు తెరిస్తే చాలూ
భావ వీధులన్నీ ఖాళీయే
గుండెలు బాదుకుంటే
అగ్గిపెట్టి బండలు చీరుకుంటున్నట్టున్నది

కృష్ణబిలం ఏ క్షణం ఏ జీవిని
మింగేస్తుందోమోనని భయం
– పర్కపెల్లి యాదగిరి, 9299908516

Spread the love