ఎంత చేశావు!

మొదటిసారి నిన్ను
నెలరోజులప్పుడు చూశాను
నీ నవ్వుచెట్ల నీడల్లో ఇక
భూమి హాయిగా నిద్రపోగలదనే నమ్మాను
పిడికిట్లో ఏం తెచ్చుకున్నావో
బహుశా చిన్నదైన నీ ఊపిరిగుట్టేమో
తెరిచి చూడనిస్తేనా?

అంతా ఒక ఆటగానే ముగించావు
నీతో ఆటల్లో పడి
పదేళ్ళుగా నీ శరీరం చెదలుపట్టిపోవడం
గమనించుకోలేదు
నవ్వుతూ ఎంత పని చేశావు
నువ్వు శిథిలమవుతున్న సంగతి
చివరి వరకూ రహస్యంగానే ఉంచావు

ఎలా చెప్పినా
అనగనగా ఒక స్టెతస్కోపు అశ్రద్ధ అనే
నీ కథను మొదలుపెట్టాలి
విషం నిండిన పేగులు
తేటబడ్డానికి ఎంత పోరాడావు

ఎంత చేశావు నువ్వు
నాన్నని ధైర్యంకొండను చేశావు
అమ్మని ఓర్పుశిఖరం మీద కూర్చోబెట్టావు
ఓటమి భారంతో
మౌనంగా నిష్క్రమించే మృత్యువుని
వెనుక నుండి చూడడాన్ని అలవాటు చేశావు

ఈ ఉదయం కూడా
నువ్వు పిలిస్తేనే మరణం వచ్చి వుంటుంది
నువ్వే దాన్ని ఒక గుర్రంబొమ్మను చేసి
పైన కూర్చొని చెవులు మెలేస్తూ
త్వరగా త్వరగా అని అల్లరి చేసివుంటావు
అమ్మా నాన్నా లేచే లోపే
పొలిమేరలు దాటిపోవాలని నీ పన్నాగం

నిన్ను గాజుబొమ్మను చూసుకున్నట్టు
అంతిదిగా చూసుకుందే
అమ్మతో ఏం గొడవ నీకు

నవ్వుల్ని చిటికెనవేలుగా చేసుకుని
సాయంత్రాలు మైళ్ళకు మైళ్ళు నడిచే వాడివే
నాన్నతో ఇదేం పంతం నీకు

దోసిట్లోకి ఇంత చీకటిని తీసుకుని
లోకం మీదకు విసిరేసి వెళ్ళిపోయావు
(కొడుకు వరసయ్యే ధీరజ్‌ కు నివాళిగా)
– సాంబమూర్తి లండ, 9642732008

Spread the love