తొలి తెలుగు సినిమా

మూకీ చిత్రాల నిర్మాణ సమయంలో బొంబాయిలో అడుగుపెట్టిన వారిలో వీరు కూడా ఒకరు. ‘టాకీపుటి’ గా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంపై, దేశ ప్రజలపై వున్న అభిమానంతో వుద్యోగాన్ని వదిలేశారు. హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. అప్పటికే మూకీ నిర్మాణాలు నగరంలో ఎక్కువ కావడంతో వాటి ప్రభావానికి గురయ్యారు. అలా చిత్రపరిశ్రమలో అగుడుపెట్టి ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తొలి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ను రూపొందించారు. ఆయనే ప్రముఖ నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి. జూన్‌ 12 ఆయన జయంతి సందర్భంగా ఆయన సినీ జీవిత పరిచయం ఈ వారం ‘సోపతి’ కవర్‌ స్టోరీ….
‘నిర్దోషి’లో ఒక చిన్న పాత్రలో నటించిన తెలంగాణకు చెందిన టీ ఎల్‌ కాంతారావును ఆ వెంటనే తాను తీయబోయే చిత్రానికి హీరోగా తీసుకున్నారు. అట్లా 1953లో వై ఆర్‌ స్వామి డైరెక్షన్లో కాంతారావు హీరోగా, రాజనాల విలన్‌ గా ‘ప్రతిజ్ఞ’ తీశారు దీనినే తమిళంలో ‘వంజమ్‌’ పేరుతో విడుదల చేశారు. నిజానికి హెచ్‌ఎం రెడ్డి గారు లేకుంటే టీ.ఎల్‌. కాంతారావును సినీ హీరోగా నేడు మనం గుర్తుంచుకునే వారమే కాదు. ‘ప్రతిజ్ఞ’ తర్వాత వైయస్‌ స్వామి చేత ‘వద్దంటే డబ్బు'(54)తమిళంలో పనం పాడుతుం పాడు (54) డిఎల్‌ రామచందర్‌ డైరెక్షన్లో ‘బీదల ఆస్తి'(55) తీసి వరుసగా అపజయాలను చవి చూసి కోలుకోలేని నష్టాలలో కూరుకు పోయారు.
‘కాళిదాస’ విజయం రెడ్డి గారిని వెంటనే తెలుగు టాకీ తీయడానికి పురికొల్పింది. అదే ‘భక్త ప్రహ్లాద’. చిత్ర నిర్మాణానికి ముందుకు వచ్చింది బొంబాయిలోని మాణిక్‌ లాల్‌ పటేల్‌ కు చెందిన కష్ణా ఫిలిమ్స్‌ కంపెనీ. అందరూ ఇప్పటివరకు రాసినట్లుగా అర్దేశీ ఇరానీ ఇంటీరియల్‌ కంపెనీ భక్త ప్రహ్లాదను నిర్మించలేదు.
అప్పటికే ధర్మవరం రామకష్ణమాచార్యులు రాసిన ‘ప్రహ్లాద’ నాటకాన్నే సినిమాకు వాడుకున్నారు. నాటకంలో అప్పటికే పోతన పద్యాలను, ధర్మవరం రాసిన పాటలను అలాగే ఉంచి మరికొన్ని పాటలను సినిమా కోసం నాటి ప్రఖ్యాత నాటక రచయిత చందాల కేశవదాసుచే ప్రత్యేకంగా రాయించారు.
    హెచ్‌ఎం రెడ్డి గారు భక్త ప్రహ్లాద తర్వాత 1933లో సతీసావిత్రి తీశారు. ఈ చిత్రంలో సుబ్బయ్య మునిపల్లె కాంతామణి, ఎల్వి ప్రసాద్‌ నటించారు. భక్త ప్రహ్లాద తీసిన వారే దీని నిర్మాతలు. దీనికి పోటీగా సి పుల్లయ్య ఈస్ట్‌ ఇండియా వారికి మరో ‘సతీ సావిత్రి’ తీశారు. దీంతో ఏకకాలంలో మొదటిసారిగా ఒకే కథాంశంతో పోటీగా వచ్చిన మొదటి చిత్రాలుగా ‘సతీ సావిత్రి చరిత్ర కెక్కినవి. సతీ సావిత్రి’ కన్నా ముందు రెడ్డిగారు బొంబాయిలో ‘జాజ్‌ ఆఫ్‌ లైఫ్‌”(32), తర్వాత ‘సీతా స్వయంవర్‌(33,) హిందీ చిత్రాలను డైరెక్ట్‌ చేశారు.
c   1895లో ప్యారిస్‌లో పుట్టి 1896లో భారతదేశంలో అడుగుపెట్టిన సినిమా కళ సామాన్యులను ఆకట్టుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. తొలత సావే దాదా బొంబాయిలో లూమియర్‌ సోదరుల ప్రదర్శనకు హాజరై సినిమా కళ పట్ల ఆకర్షితులైనారు. ఆయన లండన్‌ నుండి కెమెరాను తెప్పించి 1897లో కొన్ని వాస్తవిక సంఘటనలను చిత్రీకరించాడు. ఆ తర్వాత 1895లో కలకత్తాలో హీరాలాల్‌ సేన్‌ కొన్ని నాటకాలను చిత్రీకరించాడు. 1912లో దాదా టోర్నీ ‘పుండలీక’ అనే ఒక సైలెంట్‌ మూవీని తీసి ఒక విదేశీ చిత్రంతో పాటు విడుదల చేశాడు. ఇవన్నీ ఇలా ఉండగా బొంబాయిలో దాదా ఫాల్కే 1910 లో ‘లైఫ్‌ ఆఫ్‌ క్రీస్తు’ అనే విదేశీ మూకీని చూసి మన దేవతలను కూడా తెరపై చూపించవచ్చని ‘రాజా హరిశ్చంద్ర’ అన్నమూకీ చిత్రాన్ని తీసి 1913 మే 3న విడుదల చేయగా భారతీయ సినిమా ప్రారంభమైంది. దాంతో దాదాఫాల్కే భారతీయ సినీ పితామహుడయ్యారు. ఫాల్కే ప్రేరణతో బాబురావు పెయింటర్‌, బాలాజీ పెండర్కర్‌, చందులాల్‌ షా, మనీలాల్‌ జోషి, శాంతారామ్‌. ఆర్దేశీర్‌ ఇరానీ, మనీక్‌ లాల్‌ పటేల్‌ జె.ఎఫ్‌. మదన్‌, ధీరేన్‌ గంగూలీ వంటి వారు మూకీయుగంలోనే సినిమా రంగంలోకి వచ్చారు. ఇవన్నీ ఉత్తర భారత దేశ పరిణామాలు.
    మన దక్షిణ భారతదేశం కూడా సినిమా కళను వెంటనే సొంతం చేసుకున్నది. ప్రొఫెసర్‌ స్టీవెన్సన్‌ అనే విదేశీయుడు 1895లోనే మద్రాసులోని 167, మౌంట్‌ రోడులో ‘మద్రాస్‌ ఫోటోగ్రాఫిక్‌ స్టోర్‌’ ను నెలకొల్పాడు. ఈ స్టీవెన్సన్‌ మద్రాసులో 1896 డిసెంబరు మొదటి వారంలో యానిమేషన్స్‌ పద్ధతిలో తయారు చేసిన స్లైడ్‌ షోను నిర్వహించాడు. ఆ తర్వాతనే 1897లో ఏం ఎడ్వర్డ్‌ అనే విదేశీయుడు మద్రాసులోని విక్టోరియా హాల్లో మూకీ ప్రదర్శన చేశాడు. అయితే స్టీవెన్సన్‌ మద్రాసు ప్రదర్శన తర్వాత దక్షిణ దేశం అంతా పర్యటించి తన ప్రదర్శనలు ఇవ్వాలనుకుని మొదట హైదరాబాదు వచ్చి 1897 ఆగస్టులో తొలిప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత బెంగళూరులో తన ప్రదర్శనలు నిర్వహించి కలకత్తా వెళ్లాడు. అక్కడ హీరాలాల్‌ సేన్‌ కు కెమెరా నిర్వహణలో శిక్షణ ఇచ్చాడు. దక్షిణ భారతదేశంలో స్టీవెన్సన్‌ నిర్వహించిన ఈ భూమిక అంతా వందేళ్లుగా తెర మరుగుననే ఉండిపోయింది. 2010లో స్టీఫెన్‌ హ్యూస్‌ అనే పాశ్చాత్యుని పరిశోధన వలన సేజ్‌ పబ్లికేషన్‌ బయోస్కోప్‌ 2010 మొదటి అర్ధవార్షిక సంచికలో ఈ విషయాలన్నిటినీ ‘వెన్‌ ఫిలిం టు మద్రాస్‌’ అన్న పరిశోధన పత్రం ద్వారా ఆయన వెలుగులోకి తెచ్చారు. ఈ అంశాలను తొలుత తెలుగు సమాజానికి అందించినది ఈ వ్యాసకర్తనే.
మరోవైపు మద్రాసులో 1905లో మూకీలను తొలుత ప్రదర్శించిన దక్షిణ భారతీయుడు స్వామికణ్ణు విన్సెంట్‌. ఆ తర్వాత ఆంధ్రుడైన రఘుపతి వెంకయ్య 1910లో తన సినీ ప్రదర్శనలను ప్రారంభించారు. అనంతరం తన కుమారుడు ఆర్‌.ఎస్‌. ప్రకాష్‌ చే 1921లో ‘భీష్మ ప్రతిజ్ఞ’ అన్న సైలెంట్‌ చిత్రాన్ని తీయించారు. ఇదే తెలుగువారి తొలిమూకీ. కాగా ఇంతకు ముందే నటరాజ మొదలియార్‌ 1916లో ‘కీచక వధమ్‌’ అనే మూకీ తీసి తమిళ సినీ పితామహుడయ్యారు. ఆ తర్వాత ఏ. శ్రీనివాసన్‌, కే. సుబ్రహ్మణ్యం, వై.వి.రావు, సి. పుల్లయ్య వంటి వారు సైలెంట్‌ యుగంలోనే సీనియర్‌ రంగ ప్రవేశం చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాదులో 1922లో ధీరేన్‌ గంగూలీ అనే బెంగాలీయుడు వచ్చి చింతామణి, ఇంద్రజిత్‌, హర గౌరీ, యయాతి, లేడీ టీచర్‌ వంటి 8 సినిమాలను 1923 వరకు నిర్మించాడు. ఆ తర్వాత మహావీర్‌ కంపెనీ, నేషనల్‌ ఫిలిం కంపెనీలు 1932 వరకు మరో 12 సైలెంట్‌ చిత్రాలు తీసినవి. ఈ కాలంలోనే హైదరాబాద్‌ నుండి సునాళిని, మణాళిని, రామ్‌ ప్యారి, పైడి జయరాజ్‌, ఎండి బేగ్‌, ఎంఏ రెహమాన్‌ వంటి వారు బొంబాయి వెళ్లి మూకీలకు పనిచేశారు. వీరి తర్వాతనే బొంబాయి వెళ్ళిన వారు ఎల్వి ప్రసాద్‌. ఈ పరంపరలో మూకీల నిర్మాణ సమయంలోనే బొంబాయికి వెళ్ళిన మరో తెలుగు వాడు హెచ్‌ఎం రెడ్డి. ఈయన పేరు చెప్పగానే ఆయనకున్న ‘టాకీపులి’ అన్న మరో పేరు మనకు గుర్తొస్తుంది.
పుట్టింది ఎక్కడీ ఎప్పుడు?
తెలుగు టాకీపులిగా ప్రఖ్యాతి పొందిన హెచ్‌ఎం రెడ్డి పూర్తి పేరుతో ‘హనుమప్ప మునియప్ప రెడ్డి’. ఆయన 1892 జూన్‌ 12న జన్మించారు. మరికొన్ని చోట్ల ఆయన పుట్టింది 1882 అని రాశారు. కానీ ఆయన షష్టిపూర్తి 1952లో జరిగినట్లు టీఎల్‌ కాంతారావు తన ఆత్మ కథలో రాసుకున్నారు. అంటే ఆయన పుట్టింది 1892లో అన్నది నిజం. కాగా ఆయన జన్మస్థలం గురించి ఒకే లాగా రాయలేదు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు రాసుకున్నారు. ఆయన బెంగుళూరులో జన్మించారని కొందరు. ఎలహంకలో జన్మించారని మరికొందరు. ‘గీత తెక్కవరి’ అనే సినిమా అభిమాని హెచ్‌ఎం రెడ్డి హవేరీ జిల్లా ‘హెరికరూరు’లో పుట్టారని రాసుకున్నారు. కాగా ప్రసిద్ధ రచయిత, పరిశోధకులు ప్రొద్దుటూరు కెవి రమణారెడ్డి ‘ఈభూమి’లో రాస్తూ ”ఆయన పుట్టింది ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లాలో. ఆ ప్రాంతం అప్పట్లో మిగతా తెలుగు ప్రాంతం వల్లే మద్రాసు ప్రెసిడెంట్‌ లో భాగంగా ఉండేది” అని. అయితే ఇవన్నీ కూడా బెంగళూరు పరిసరాల్లో లేదా మైసూరు ప్రావెన్సీ లో పుట్టినట్లు ధవపరుస్తున్నారు. ఏది ఏమైనా వందల ఏళ్ళ క్రితం కర్ణాటకకు వలస వెళ్ళిన రాయలసీమ రెడ్లని వారిని మనం భావించవచ్చు.
చలో బొంబాయి
హెచ్‌ఎం రెడ్డి బెంగళూరులోనే ఎఫ్‌.ఏ. చదువుకున్నారు. ఆ కాలంలో అది గ్రాడ్యుయేషన్‌తో సమానం. విద్యాభ్యాసం పూర్తి కాగానే ఆయన తన దేహదారుఢ్యానికి సరిపోయేలా నాటి పోలీస్‌ డిపార్ట్‌మెంట్లో చేరారు. అది స్వాతంత్ర ఉద్యమ కాలం. బ్రిటిష్‌ అధికారుల ఆజ్ఞ మేరకు ప్రజలపై పోలీసులు అణిచివేతలకు పాల్పడేవారు. స్వతంత్రం కోసం పోరాడుతున్న తమ దేశీయులపైనే హింసకు పాల్పడటం రెడ్డి గారికి నచ్చలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వేశారు. ఆ తర్వాత హైదరాబాదు నగరానికి బతుకుదెరువు వెతుక్కుంటూ వచ్చి ఆయన నాటి జాగిర్ధార్‌ కళాశాలలో ఇంగ్లీష్‌ టీచర్‌గా కుదురుకున్నారు. 1924 నాటికి ఇది జరిగింది. నిజానికి అప్పటికే హైదరాబాదులో మూకీల నిర్మాణం జరిగి ఉండింది. ఒక సినీ స్టూడియో డజనుకు పైగా థియేటర్లు నెలకొని ఉన్నవి. ఇవన్నీ హెచ్‌ఎం రెడ్డి గారిని ప్రభావితం చేయకుండా ఉండవను కోవడానికి వీలు లేదు. అయితే కొందరు 1924 నాటికే ఆయన బొంబాయి వెళ్లినట్లు రాశారు. కానీ మరికొందరు 1927లో హైదరాబాదులో ప్రబలిన ప్లేగు వ్యాధికి భయపడి బొంబాయి వెళ్లారని రాశారు. 1927 లోనే వెళ్లారనేది నిజం. ఎందుకంటే ఈయన దర్శకత్వం వహించిన సైలెంట్‌ చిత్రాలు 1927 తర్వాత తయారైనవి కావడం.
హెచ్‌ఎం రెడ్డి కన్నా ముందుగానే అతని బాబాయి కొడుకు అయిన హెచ్‌.వి.(హనుమప్ప విశ్వనాథ) బాబు బొంబాయి వెళ్లి సినిమా రంగంలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ధైర్యంతోనే బొంబాయి వెళ్లిన రెడ్డి గారు ముందుగా అక్కడి ప్రొడ్యూసర్‌ శారదా ఫిలిం కంపెనీ యజమాని భోగిలాల్‌ దవేను కలుసుకున్నారు. చక్కటి భాషా జ్ఞానం గల రెడ్డిని తన వద్ద అసిస్టెంటుగా కుదుర్చుకున్నాడు. ఇంతలో భోగిలాల్‌ దవే జర్మనీకి వెళ్లాల్సి రావడంతో రెడ్డి గారిని తీసుకెళ్లి తన మిత్రుడు అద్దేశీర్‌ ఇరానీకి పరిచయం చేసి ప్రోత్సహించమన్నారు. రెడ్డిగారి ప్రతిభను గుర్తించిన ఇరానీ వెంటనే అతనికి దర్శకులుగా అవకాశం ఇచ్చి ఇంపీరియల్‌ కంపెనీ బ్యానర్‌ పై ‘విజరు కుమార్‌'(30) అనే మూకీని తీయించారు. పథ్వీరాజ్‌ కపూర్‌ నటించిన తొలిమూకీ ఇదే కావడం విశేషం. ఆ తర్వాత 1931 లో వీరు’ ఏ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అనే మరో మూకీ చిత్రంతీశారు. అయితే 1930లోనే ‘సినిమా గార్ల్‌ ‘అనే మూకీలో హెచ్‌ఎం రెడ్డి ఒక చిన్న వేషం వేసిన సంగతి చాలామందికి తెలియదు.
టాకీల శకం
సరిగ్గా ఈ కాలంలోనే అద్దేశీర్‌ ఇరానీ ‘ఆలం ఆరా’అనే తొలి భారతీయ టాకీ చిత్రాన్ని తీసి 1931 మార్చి 14న విడుదల చేశారు. ఈ సినిమా ఇరానీకి కనక వర్షం కురిపించింది. దాంతో ఆ వెంటనే ఇతర భాషల్లోనూ టాకీలు తీయాలని మొదట తమిళంలో దక్షిణాదియుడైన హెచ్‌ఎం రెడ్డి దర్శకత్వంలో ఇంపీరియల్‌ బ్యానర్‌ పై ‘కాళిదాస’ తీశారు. మాటలు పాటలు సంగీతం సమకూర్చినవారు భాస్కర దాస్‌. కాగా తెరపై నరసింహారావు, టి.పి. రాజ్యలక్ష్మి, పీజీ వెంకటేశన్‌, రాజంబాళ్‌, పి.సుశీలాదేవి, ఎల్వి ప్రసాద్‌ లు నటించారు. అయితే ఈ తమిళ టాకీలో నటించిన వారు ఎవరి మాతభాషలో వారు డైలాగులు చెప్పారు. కాళిదాసు, నారద పాత్రలు వేసిన వారు తెలుగులో మాట్లాడితే, హీరోయిన్‌ రాజ్యలక్ష్మి తమిళంలో మాట్లాడింది. ఎల్‌ వి ప్రసాద్‌ మరియు పూజారి హిందీలో మాట్లాడారు. ఆ రకంగా తొలి తమిళ సినిమానే అయినా ‘కాళిదాస’ బహుభాషా చిత్రమైంది. రాజ్యలక్ష్మి గారు తమిళ లిపిలో త్యాగరాయ కతులను రాసుకుని తెలుగులో పాడింది. ఈ విధంగా బహు భాషలు ఉన్న ఈ సినిమా తమిళుల ఖాతా లోనికి పోయినా, ఫిలిం న్యూస్‌ ఆనందం వంటి వారు ”కాళిదాసు’ తొలి తమిళటాకీ అనడాన్ని వ్యతిరేకించారు. బొంబాయిలో నిర్మాణం జరుపుకున్న ‘కాళిదాస’ విడుదలై ఘన విజయం పొందింది. ఆ రోజుల్లో 8 వేల పెట్టుబడికి 75 వేల రూపాయలు వసూలు అయినవి.
తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద
‘కాళిదాస’ విజయం రెడ్డి గారిని వెంటనే తెలుగు టాకీ తీయడానికి పురికొల్పింది. అదే ‘భక్త ప్రహ్లాద’. చిత్ర నిర్మాణానికి ముందుకు వచ్చింది బొంబాయిలోని మాణిక్‌ లాల్‌ పటేల్‌ కు చెందిన కష్ణా ఫిలిమ్స్‌ కంపెనీ. అందరూ ఇప్పటివరకు రాసినట్లుగా అర్దేశీ ఇరానీ ఇంటీరియల్‌ కంపెనీ భక్త ప్రహ్లాదను నిర్మించలేదు.
కాళిదాస అనుభవాన్ని దష్టిలో పెట్టుకుని రెడ్డి గారు పూర్తిస్థాయి తెలుగు టాకీ తీయాలని నాటి ‘సురభి’ కంపెనీ వారిని కాంట్రాక్టు మాట్లాడుకుని బొంబాయికి తరలించారు. ఐతే సినిమా అంతా నాటకం వలెనే సాగుతుంది, పాత్రలు వారి వారి వంతు వచ్చినప్పుడు వచ్చి నటించి పోతుంటాయని ఈ సినిమా చూసిన తొలితరం జర్నలిస్టు మద్దాలి సత్యనారాయ శర్మ 2011లో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అప్పటికే ధర్మవరం రామకష్ణమాచార్యులు రాసిన ‘ప్రహ్లాద’ నాటకాన్నే సినిమాకు వాడుకున్నారు. నాటకంలో అప్పటికే పోతన పద్యాలను, ధర్మవరం రాసిన పాటలను అలాగే ఉంచి మరికొన్ని పాటలను సినిమా కోసం నాటి ప్రఖ్యాత నాటక రచయిత చందాల కేశవదాసుచే ప్రత్యేకంగా రాయించారు.
‘పరితాప భారంబు భరింపతరమా,’
‘తనయా ఇటులన్‌ తగదుర పలుక తండ్రిమాట వినకా’,
‘భీకరమగు నా ప్రతాపంబునకు
భీతిలేక ఇటు చేసేదవా’ అనేవి ఆ మూడు పాటలు. సినిమాకు సంగీతం చేసినది హెచ్‌.ఆర్‌. పద్మనాభ శాస్త్రి.
ఇట్లా తయారైన తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద లో ప్రధానమైన ప్రహ్లాదుని గా నటించిన వారు ఖమ్మం జిల్లాకు చెందిన కష్ణాజి రావు సిందే. వీరు సురభి కంపెనీలోనే బాల వేషాలు వేసేవాడు. హిరణ్య కశ్యపునిగా నటించిన వారు నాటక రంగంలో నాడు ప్రఖ్యాతిగాంచిన మునిపల్లె సుబ్బయ్య నాయుడు. వీరిది గుంటూరు జిల్లా మునిపల్లె. ఇక లీలావతిగా నటించిన సురభి కమలాబాయి సురభి నాటక సమాజంలో నాయక వేషాలు వేసేవారు. ఈమె 1908లో హైదరాబాదులో ఒక నాటకం జరుగుతుండగా ఆమె తల్లి రంగస్థలంపై నటిస్తుండగా నొప్పులు రావడంతో అక్కడే ఆమె జన్మించింది. ఇంకా మొద్దబ్బాయి గా తెలుగువాడైన ఎల్వీ ప్రసాద్‌ నటించారు. ఇలా తొలి మూడు టాకీలలో నటించిన ఖ్యాతిని సొంతం చేసుకున్నారాయన.
1932 ఫిబ్రవరి 6న విడుదల
సుమారు 18 వేల రూపాయల ఖర్చుతో తయారైన ప్రహ్లాద 1931 సెప్టెంబర్‌ 15న విడుదల అయిందని గడచిన 70 ఏళ్లుగా సినీ చరిత్రకారులు పేర్కొంటూ వచ్చారు. కానీ ఈ తేదీననే విడుదలైనట్లు ఇలాంటి రుజువులు లేవని కేవలం తమిళ ‘కాళిదాస’ కన్నా తెలుగు టాకీనే ముందుగా విడుదలైందని చెప్పుకొనడానికి ‘ప్రహ్లాద’కు సెప్టెంబరు 15వ తేదీని ఖరారు చేశారని భావించిన జర్నలిస్టు రెంటాల జయదేవ పూర్తిస్థాయి పరిశోధన చేసి విడుదల తేదీని తేల్చారు. భక్త ప్రహ్లాద 1932 జనవరి 22న సెన్సార్‌ అయిందని, 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కష్ణ టాకీస్‌ లో విడుదలైనట్లు తేల్చారు. అలా బొంబాయిలోనే తయారై బొంబాయిలోనే విడుదలైన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. తెలుగు నాట ఈ చిత్రం రాజమండ్రి కష్ణ, విజయవాడ మారుతి టాకీస్‌ లలో 1932 మార్చి నెలలో విడుదలైంది. ఆ తర్వాత 1932 ఏప్రిల్‌ 2న మద్రాస్‌ నేషనల్‌ పిక్చర్‌ ప్యాలెస్‌ నేటి బ్రాడ్వెలో విడుదలైంది. అట్లా ఒక సినిమా మూడు రాష్ట్రాల్లో మూడు వివిధ తేదీలలో విడుదల కావడం ఒక చరిత్ర. ఈ చరిత్రను వెలికి తీసి నిరూపించిన వారు రెంటాల జయదేవ. ప్రస్తుతం వీరు తేల్చిన 1932 ఫిబ్రవరి 6వ తేదీనే తెలుగు సినిమా పుట్టిన రోజుగా జరుపుకోవడం ఆయన కషికి నిదర్శనం.
హెచ్‌ఎం రెడ్డి గారు భక్త ప్రహ్లాద తర్వాత 1933లో సతీసావిత్రి తీశారు. ఈ చిత్రంలో సుబ్బయ్య మునిపల్లె కాంతామణి, ఎల్వి ప్రసాద్‌ నటించారు. భక్త ప్రహ్లాద తీసిన వారే దీని నిర్మాతలు. దీనికి పోటీగా సి పుల్లయ్య ఈస్ట్‌ ఇండియా వారికి మరో ‘సతీ సావిత్రి’ తీశారు. దీంతో ఏకకాలంలో మొదటిసారిగా ఒకే కథాంశంతో పోటీగా వచ్చిన మొదటి చిత్రాలుగా ‘సతీ సావిత్రి చరిత్ర కెక్కినవి. సతీ సావిత్రి’ కన్నా ముందు రెడ్డిగారు బొంబాయిలో ‘జాజ్‌ ఆఫ్‌ లైఫ్‌”(32), తర్వాత ‘సీతా స్వయంవర్‌(33,) హిందీ చిత్రాలను డైరెక్ట్‌ చేశారు.
ఇంతలో బెజవాడకు చెందిన పారుపల్లి శేషయ్య, కురుకూరి సుబ్బారావులు సరస్వతీ టాకీస్‌ బ్యానర్‌ పై కొల్హాపూర్‌ లో” ద్రౌపతి వస్త్రాపరణం” తీయడానికి హెచ్‌.వి. బాబును దర్శకునిగా ఎంపిక చేసుకుని, రెడ్డి గారిని దర్శకత్వ పర్యవేక్షణ చేయమన్నారు. వస్త్రాపహరణంలో సి.ఎస్‌. ఆర్‌., కన్నాంబ, దొమ్మేటి సూర్యనారాయణ, కడారు నాగభూషణం, సూరిబాబు, రామతిలకం, కొచ్చర్లకోట వంటి వారు నటించగా నిర్మాణ పర్యవేక్షణ చేసిన వారు గూడవల్లి రామబ్రహ్మం. ఇదే సమయంలో పోటీగా జగన్నాథ్‌ డైరెక్షన్లో లక్ష్మీ ఫిలిమ్స్‌ వారు బళ్ళారి రాఘవ, బందా కనక లింగేశ్వర రావు, సురభి కమలాబాయి, దైతా గోపాలం, జంధ్యాల గౌరీనాథ శాస్త్రి, మాధవ పెద్ది వెంకట్రామయ్య, పారుపల్లి వంటి వారితో ‘ద్రౌపదీ మానవ సంరక్షణం’ తీశారు. 1936 ఫిబ్రవరి 29న వస్త్రాపహరణం, మార్చి 20న మానసరక్షణం పోటీపడి విడుదలైనవి. కానీ రెడ్డి గారి ముద్ర ఉన్న ద్రౌపదీ వస్త్రాపహరణం ఘనవిజయం సాధించింది. ఈ రెండు చిత్రాలను సమీక్షించిన నాటి యువ పాత్రికేయుడు ఒకరు రెడ్డి గారి చిత్రం కన్నా కళాత్మకంగా మాన సంరక్షణమే గొప్ప చిత్రమని రాశారు. అది చదివిన ఆయన ఆ సమీక్షకుడి నిజాయితీని మెచ్చుకుంటూ తన రోహిణి సంస్థలో సహాయ దర్శకుడిగా అవకాశమిచ్చారు. అతనే పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వర రావు.
రోహిణి పిక్చర్స్‌ ఆవిర్భావం
కొల్హాపూర్‌ లో చిత్ర నిర్మాణం పూర్తవగానే రెడ్డి గారు మద్రాసు తిరిగివచ్చి కన్నాంబ, బి.ఎన్‌.రెడ్డి, మూలా నారాయణస్వామి తదితరులతో కలిసి ‘రోహిణి పిక్చర్స్‌’ సంస్థను ప్రారంభించారు. ఆ కాలంలో ప్రఖ్యాత ‘రంగూన్‌ రౌడీ’ నాటకాన్ని సినిమాగా తీయాలని నిర్ణయించి ‘గహలక్ష్మి’ గా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కాంచనమాల, కన్నాంబ, రామానుజాచార్యులు ప్రధాన పాత్రధారులు కాగా, చిత్తూరు నాగయ్యను సినిమా రంగానికి ఈ చిత్రం ద్వారానే పరిచయం చేశారాయన. ఈ చిత్రంలో నాగయ్య పాడిన ”కల్లుమానండోరు బాబు”, ”భారత వీరుల్లారా” పాటలు ఆ రోజుల్లో చాలా పాపులర్‌ అయినవి. 1939 మార్చి 12న విడుదలైన గహలక్ష్మి ఆర్థికంగా మంచి విజయం సాధించింది. అప్పటికి తెలుగులో ఒకటి రెండు సాంఘికలు వచ్చినా ‘గహలక్ష్మి’ చిత్రంతోనే సాంఘికాలకు ఒక ఒరవడి మొదలైంది. కాంచనమాల అందం, కన్నాంబ నటనా కౌసల్యం సినిమా విజయానికి ప్రధాన కారణాలు. అయితే గహలక్ష్మి విజయం తర్వాత రోహిణిలోని భాగస్వాములు విడిపోయారు. కారణం రెడ్డి గారి ఫక్తు వ్యాపార ధోరణి వారికి నచ్చలేదు. వారంతా బి.యన్‌.రెడ్డి తోబాటు బయటికి వెళ్లి వాహిని పిక్చర్స్‌ పెట్టుకుని ఆ తర్వాత కళాఖండాలనదగిన చిత్రాలు తీశారు.
దేశభక్తి చిత్రం మాతభూమి
గహలక్ష్మి విజయంతో హెచ్‌. యమ్‌.రెడ్డికి ఒక భారీ తమిళ చిత్రం తీసే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పేరు ‘మాత భూమి’. తమిళ చెట్టియార్లకు చెందిన ఏ.ఎల్‌.ఆర్‌.ఎం. కంపెనీ వారికి ‘మాతభూమి’ తీశారు. ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతమిచ్చేలా తీసిన చారిత్రక చిత్రం మాతభూమి. క్రీ.పూ.321 కాలంలో అలెగ్జాండర్‌ ఇండియాకు వచ్చి వెళ్లిన తర్వాత ఆయన ప్రతినిధి మినాండర్‌ అనే గ్రీకు పాలకుడికి, ఉదయగిరి రాజు ఉగ్రసేనుడికి మధ్య జరిగిన పోరాటమే ఈ చిత్రం. ఆ రోజుల్లోనే రెండు లక్షల భారీ బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించింది. వేలాది మంది జూనియర్‌ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాలు తీయడంలో రెడ్డి గారి ప్రతిభ సినీ చరిత్రలో నిలిచిపోయింది. 1939 అక్టోబర్‌ 29న విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో కనకవర్షం కురిపించి. తమిళ సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా గురించి చాలామంది తెలుగు వారికి తెలియదు. మాతభూమి సినిమాకే భరణి రామకష్ణ, కెమెరామెన్‌ పి శ్రీధర్‌ ఆయన వద్ద అసిస్టెంట్లుగా పని చేశారు.
మాతభూమి తర్వాత తిరిగి తన సొంత రోహిణి బ్యానర్‌ పై తన బావమరిది డి.ఎల్‌.రామచందర్‌ దర్శకత్వంలో ‘బోండాం పెళ్లి’, ‘చదువుకున్న భార్య’ అన్న రెండు తక్కువ నిడివి చిత్రాలు తీసి 1940లో ఆర్‌.ప్రకాష్‌ ‘బారిష్టర్‌ పార్వతీశం’ తో పాటు విడుదల చేశారు. ఆ తర్వాత 1941లో ‘తెనాలి రామకష్ణ’ తీశారు. తెనాలి రామకష్ణుడుని హాస్య పాత్రలో కాకుండా సంఘసంస్కర్తగా చూపించారాయన. ఈ చిత్రంలో ఎల్వి ప్రసాద్‌ కరటక శాస్త్రి, తిమ్మరుసు రెండు వేషాలను వేయడం విశేషం. ఈ చిత్రం ద్వారానే సదాశివబ్రహ్మం సినీ రచయిత అయ్యారు. ఆ వెంటనే 1942లో తన అసిస్టెంట్‌ ఎల్వీ ప్రసాద్‌ ను హీరో చేసి ‘ఘరానా దొంగ’ (ధర్మమే జయం) చిత్రం తీశారు. ఈ రెండింటికి రెడ్డి గారే దర్శకులు. ఆ వెంటనే ‘అమత హస్తం’ సినిమా ప్రారంభించినా యుద్ధ కారణంగా ఆగిపోయింది. ఇంతలో తను పుట్టి పెరిగిన కన్నడ నేలపై బెంగళూరులో 1943లో మైసూర్‌ మూవీ టోన్‌ స్టూడియోను నెలకొల్పారు (ఆ తర్వాత ప్రీమియర్‌). అటు నుండి 1945లో బొంబాయి వెళ్లి ‘జస్టిస్‌’ అనే చిత్రం తీశారు. తిరిగి మద్రాసు వచ్చి 1950లో రోహిణి సంస్థ పై ముక్కామల, కోన ప్రభాకర్‌ రావు, జీ.వరలక్ష్మి, అంజలీ దేవి ప్రధాన పాత్రలుగా ‘నిర్దోషి’ తీశారు. దీనినే తమిళంలో ‘నిరపరాధి’గా విడుదల చేశారు. దర్శకునిగా ఆయనకు ఇదే చివరి సినిమా.
కాంతారావు తో ప్రతిజ్ఞ
‘నిర్దోషి’లో ఒక చిన్న పాత్రలో నటించిన తెలంగాణకు చెందిన టీ ఎల్‌ కాంతారావును ఆ వెంటనే తాను తీయబోయే చిత్రానికి హీరోగా తీసుకున్నారు. అట్లా 1953లో వై ఆర్‌ స్వామి డైరెక్షన్లో కాంతారావు హీరోగా, రాజనాల విలన్‌ గా ‘ప్రతిజ్ఞ’ తీశారు దీనినే తమిళంలో ‘వంజమ్‌’ పేరుతో విడుదల చేశారు. నిజానికి హెచ్‌ఎం రెడ్డి గారు లేకుంటే టీ.ఎల్‌. కాంతారావును సినీ హీరోగా నేడు మనం గుర్తుంచుకునే వారమే కాదు. ‘ప్రతిజ్ఞ’ తర్వాత వైయస్‌ స్వామి చేత ‘వద్దంటే డబ్బు'(54)తమిళంలో పనం పాడుతుం పాడు (54) డిఎల్‌ రామచందర్‌ డైరెక్షన్లో ‘బీదల ఆస్తి'(55) తీసి వరుసగా అపజయాలను చవి చూసి కోలుకోలేని నష్టాలలో కూరుకు పోయారు. ఈ పరిస్థితుల్లో కూడా తెలుగు, తమిళ, కన్నడంలో ‘గజదొంగ’ సినిమాను మొదలు పెట్టారాయన. ఫలితంగా తాను 1952లో నెలకొల్పిన రోహిణి స్టూడియోను అమ్ముకోవలసి వచ్చింది. అప్పటివరకు ఆయన వల్ల పైకి వచ్చిన వారెవరు ఆయనకు సహాయ పడలేదు.
కానీ అది పూర్తికాకుండానే 1960 జనవరి 15న తన 68వ ఏట కన్నుమూశారు. ఆయన కడవరకూ తలవంచని వీరుడు గానే వెళ్లిపోయారు. పరిశ్రమలో ‘టాకీపులి’గా పేరొందిన ఆయనను అంతా ‘పప్పాజీ’అని, ‘డాడీ’అని గౌరవంగా పిలుచుకునేవారు.
నిజానికి రెడ్డి గారి సినిమాలన్నీ కళాఖండాలని చెప్పలేం. ఆయన అద్వితీయ విజయలేమీ సాధించలేదు. కానీ చాలా చారిత్రక పరిణామాలకు మూలకారకులు. వాహిని సంస్థ ఆవిర్భావానికి పరోక్ష కారకులు. ఎల్వి ప్రసాద్‌ వంటి నటుడిని పైకి తీసుకువచ్చి అతని భావి జీవితానికి గట్టి పునాది వేసింది రెడ్డి గారే.
టీఎల్‌. కాంతారావు వంటి జానపద హీరోను తెలుగు సినిమాకు అందించడం, కమలాకర కామేశ్వరరావు వంటి పౌరాణిక చిత్రబ్రహ్మను దర్శకుడుగా మారేందుకు కారకులు కావడం. ఎటొచీచ్చి ఆయనకు లౌక్యం తెలియదు. తెలిసింది సినిమాలు తీయడమే. తన మూడు దశాబ్దాల సినీ జీవితంలో 16 సినిమాలకు దర్శకత్వం వహించి, 12 సినిమాలను నిర్మించారు.
హెచ్‌.ఎం.రెడ్డి గారు సినిమా రంగ అభివద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డారు. సౌత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కి 1943-44, 1951-52 ల్లో రెండుసార్లు అధ్యక్షులుగా పనిచేశారు. 1957 జనవరిలో భారతీయ సినిమా రజతోత్సవం సందర్భంగా తెలుగు టాకీ పితామహుడుగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఈనాడు తెలుగు చలనచిత్ర రంగం అంతర్జాతీయంగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి ఉండవచ్చు. వందల కోట్ల వ్యాపారం చేయవచ్చు. కానీ అట్టి సినిమాకు పాదులు తీసి, మొక్కను నాటి, వెళ్ళునుకునేలా నీరు పోసిన తొలినాటి మహనీయులలో ఆద్యులు రెడ్డి గారు, ఆయన తెలుగు సినిమాపై తొలి వెలుగులు ప్రసరింప జేసిన ఆది పురుషుడు. టాకీపులిగా హెచ్‌.ఎం.రెడ్డిది చిర కీర్తి.
(జూన్‌ 12న హెచ్‌ఎం రెడ్డి 131 వ జయంతి)
– హెచ్‌.రమేష్‌ బాబు, 77807 36386

Spread the love