బడి అంటే…

పిల్లలు జీవితంలోని మొదటిదశ బడిలోనే గడుపుతారు. మొదటిసారి బడికి వెళ్ళే పిల్లలకు అది ఓ కొత్త ప్రపంచం. అటువంటి బడి ఆహ్లాదంగా ఉండాలి. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేదై ఉండాలి. చెంగుచెంగున గెంతులేసే పిల్లలకు బడెప్పుడూ జైలుకావొద్దు. సీతాకోక చిలుకల్లా స్వేచ్ఛగా విహరించే అందమైన ప్రపంచంగా ఉండాలి. బడిని పిల్లలు మనసుతో ఆస్వాదించాలి, ఆనందించాలి, ఆటలాడాలి, నేర్చుకోవాలి, సమాజాన్ని తెలుసుకోవాలి. అటువంటి బడే మంచి పౌరులను తయారు చేస్తుంది. దేశ భవిత తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందంటారు. కానీ ఇప్పుడు ఆ గది మార్కులు, ర్యాంకులకే పరిమితం.
అపురూపమైన ఆనంద లోకం బడి.. అబ్బురపరిచే అందమైన ప్రపంచం బడి.. ఆచరణమార్గం చూపే దివిటీ బడి.. ఆటలతో అన్నీ నేర్పి పాఠాలను పరిచయం చేసే విజ్ఞాన గని బడి. రేపటి నుండి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త ‘సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌’ చెప్పినట్టు పసితనంలో హృదయాలను తాకిన అనుభవాలే వారి భావిజీవిత విధానానికి మూలం అవుతాయి. కుటుంబం, బడి, స్నేహితుల నుండే పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. సూటిగా చెప్పాలంటే పసితనంలో తమ జీవితంలోకి చేరువైన అంశాలనుండే సామాజికతని నేర్చుకొంటారు. పిల్లల క్రమాభివృద్ధికి సక్రమ సామాజికత తప్పనిసరి. సత్ప్రవర్తనకు మొదటి కారణం కుటుంబమైతే, రెండోది పాఠశాల. పిల్లలు జీవితంలోని మొదటిదశ బడిలోనే గడుపుతారు. మొదటిసారి బడికి వెళ్ళే పిల్లలకు అది ఓ కొత్త ప్రపంచం. అటువంటి బడి ఆహ్లాదంగా ఉండాలి. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేదై ఉండాలి. చెంగుచెంగున గెంతులేసే పిల్లలకు బడెప్పుడూ జైలుకావొద్దు. సీతాకోక చిలుకల్లా స్వేచ్ఛగా విహరించే అందమైన ప్రపంచంగా ఉండాలి. బడిని పిల్లలు మనసుతో ఆస్వాదించాలి, ఆనందించాలి, ఆటలాడాలి, నేర్చుకోవాలి, సమాజాన్ని తెలుసుకోవాలి. అటువంటి బడే మంచి పౌరులను తయారు చేస్తుంది. అందుకే దేశ భవిత తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందంటారు. కానీ ఇప్పుడు ఆ గది మార్కులు, ర్యాంకులకే పరిమితం అవుతుండటం ఓ విషాదం. ఇక దేశ భవిష్యత్‌ ఎలా ఉంటుంది? మార్కుల కోసం అందమైన బాల్యాన్ని, నాణ్యమైన చదువును పిల్లలకు దూరం చేస్తున్నారు. విలువలతో కూడిన విద్య అందినపుడే పిల్లలు అసలు సిసలైన పౌరులుగా తయారవుతారు. ఇది కేవలం బడితోనే సాధ్యం. అలాంటి విద్యా విధానంలో కేరళ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా వుంది. అక్కడి వామపక్ష ప్రభుత్వం ప్రాధమిక స్థాయి నుండే పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా పాఠశాలలు, తరగతి గదులను ఏర్పాటు చేస్తుంది. తమ రాష్ట్ర పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో కేరళ ప్రభుత్వం, ప్రజలు ముందుంటున్నారు. ఆ రాష్ట్ర సీపీఎం ఎంపీ రాజేష్‌ తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ఇందుకో ఉదాహరణ. మన దగ్గర పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపాలంటే కూలీ చేసుకునే తల్లిదండ్రులు కూడా వందసార్లు ఆలోచిస్తున్నారు. అప్పు చేసైనా సరే పిల్లల్ని ప్రయివేటు బడిలో చేర్చాలని తపన పడుతున్నారు. సర్కారు బడులు వసతుల లేమి, సౌకర్యాల కరువుతో కునారిల్లడమే దీనికి కారణం. బడుల్లోని సమస్యలను పరిష్కరించకుండా ఉత్తమ పౌరులను ఆశించడం మన అత్యాశే అవుతుంది. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ధ్యానం, యోగాకు ఐదు నిమిషాలు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఓ అరగంట నీతి కథలు, సామాజిక విలువలు నేర్పేందుకు కేటాయిస్తే మన భావి భారతం మరింత మెరుగవుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుల బాధ్యతా ముఖ్యమే. పిల్లలకు నచ్చే విధంగా పాఠాలు చెప్పాలి. వాళ్ళను ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాలి. చిట్టి చేతులకు మట్టి మరిమళాలు పరిచయం చేయాలి. ఆ లేత మనసుల్లో చదువుపై ఆసక్తి రేకెత్తించాలి. చక్కటి అవగాహనతో విద్యార్థులు ప్రావీణ్యతను సాధించేలా తీర్చిదిద్దాలి. నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే భరోసా ఇవ్వాలి. పిల్లల్లో ఉన్న లోపాలను పరిశీలించి అధిగమించే ధైర్యం వారి గుండెల నిండా నింపాలి. దానికి తగ్గట్టు బోధనా పద్దతులు ఉండాలి. దీనికోసం ఉపాధ్యాయుల కృషి మరింత పెరగాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నైపుణ్యం ఏ రంగంలో ఉందో గుర్తెరిగి ఆ వైపుగా ప్రోత్సహించాలి.

Spread the love