ఇదొక ప్రయత్నం

నిత్యం తమ ప్రజల కోసం తపించే కేరళ ప్రభుత్వం వరకట్నంపై రెండేండ్ల కిందట ఓ ప్రతిష్టాత్మకమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. ‘నేను వరకట్నం తీసుకోను.. ఇవ్వను.. ప్రోత్సహించను..’ ఇది కేరళలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ సమయంలో ప్రతి విద్యార్థీ ఇవ్వవలసిన హామీ. ఈ ప్రకారం అంగీకార పత్రంపై విద్యార్థులు సంతకం చేయాలి. అలాగే తల్లిదండ్రుల సంతకం కూడా తీసుకున్న తర్వాతే విద్యార్థులకు యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక వాళ్ళు భవిష్యత్తులో వారు వరకట్నం అడిగినా, తీసుకున్నా పోలీసులతో పాటు యూనివర్సిటీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై వర్సిటీ విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తుల డిగ్రీని శాశ్వతంగా రద్దు చేస్తుంది. కేరళలో అమలవుతున్న ఈ విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇప్పుడు రాష్ట్రాల్లో పెండిండ్ల హడావుడి నడుస్తోంది. తెలిసిన వారి ఇంట్లో పెండ్లి జరుగుతుంటే మొదట అడిగే ప్రశ్న ‘కట్నం ఎంత..?’. వాస్తవానికి కట్నం అడగడం, ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. సమాజం ఎన్ని కొత్త పుంతలు తొక్కినా, కట్నం తీసుకోవడం సాంఘిక దురాచారమని తెలిసినా కట్నం విషయంలో ఎవ్వరూ వెనకడుగు వేయడం లేదు. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు కట్నం డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నానా కష్టాలు పడి, అప్పులు చేసి ఎలాగో పెండ్లి చేసి పంపుతారు. అలా ఊపిరి పీల్చుకుంటారో లేదా అదనపు కట్నం కోసం వేధింపులు. ఇక అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ అయితే వాళ్ళ కోర్కెలకు అంతం ఉండదు. వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వడానికి, గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి అమ్మాయి తరపు వాళ్ళు ఉన్న భూములు అమ్ముకోవల్సిందే.
వరకట్న వేధింపుల కేసులు దేశంలో ప్రతి ఏటా పెరుగుతున్నాయని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘వుమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా-2022’ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా గృహహింస కేసులు పెరుగుతుండగా ఈ జాబితాలో 75 శాతంతో అసోం మొదటి, 48.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి. గృహహింసలో అత్యధిక కేసులు వరకట్న వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. మన తెలంగాణ రాష్ట్రమైతే 50.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలో గృహహింసను నిరోధించాలనే ఆలోచన చేస్తున్నది. దీని కోసం కేరళ అనుసరిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకోబోతోంది.
నిత్యం తమ ప్రజల కోసం తపించే కేరళ ప్రభుత్వం వరకట్నంపై రెండేండ్ల కిందట ఓ ప్రతిష్టాత్మకమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. ‘నేను వరకట్నం తీసుకోను.. ఇవ్వను.. ప్రోత్సహించను..’ ఇది కేరళలో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ సమయంలో ప్రతి విద్యార్థీ ఇవ్వవలసిన హామీ. ఈ ప్రకారం అంగీకార పత్రంపై విద్యార్థులు సంతకం చేయాలి. అలాగే తల్లిదండ్రుల సంతకం కూడా తీసుకున్న తర్వాతే విద్యార్థులకు యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక వాళ్ళు భవిష్యత్తులో వారు వరకట్నం అడిగినా, తీసుకున్నా పోలీసులతో పాటు యూనివర్సిటీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై వర్సిటీ విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తుల డిగ్రీని శాశ్వతంగా రద్దు చేస్తుంది. కేరళలో అమలవుతున్న ఈ విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ అనుసరిస్తున్న ఈ విధానంపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్‌ ఫ్యాకల్టీగా ఉన్న శ్రీనివాస్‌ మాధవ్‌ అధ్యయనం చేశారు.
కేరళలో ఈ విధానం అమల్లోకి వచ్చి రెండేండ్లే అయినా వరకట్నంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనల్లో గణనీయమైన మార్పు వచ్చిందని శ్రీనివాస్‌ యాదవ్‌ తన అధ్యయనంలో గుర్తించారు. ఇలాంటి విధానం మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కూడా అమలు చేస్తే మంచిదని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన పంపారు. దీనిపై కమిషన్‌ కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం. కేరళ ప్రభుత్వం దీన్ని ఎలా అమలు చేస్తుందో పరిశీలించి, విధి విధానాలపై మన రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నది. త్వరలో చర్చించి తమ నిర్ణయం ప్రకటించబోతున్నారు. కేరళ ప్రభుత్వంలా మన దగ్గర ఇది ఆచరణలోకి వస్తుందో లేదా కాగితాలకే పరిమితం అవుతుందో చూడాలి. నిజంగా రాష్ట్రంలో ఈ విధానం అమల్లోకి వస్తే మహిళల కష్టాలు కొంత వరకైనా తగ్గుతాయని భావించవచ్చు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురౌతున్న వారికి కాస్త ఊరట దొరుకుతుంది. అమ్మాయిల తల్లిదండ్రులకు ఇదొక సంతోషకర విషయం.

Spread the love