మహిళపై సామూహిక లైంగికదాడి.. 1400 సీసీ కెమెరాల జల్లెడ

నవతెలంగాణ – హైదరాబాద్: అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక లైంగికదాడి.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. వేలిముద్రలు, జాగిలాలు, నేర చరిత్ర ఆధారంగా నిందితుల్ని గుర్తించాలనుకున్నా ఆచూకీ చిక్కలేదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూకట్‌పల్లి పోలీసులు.. నిందితులు వాహనంలో ప్రయాణించిన మార్గాల ఆధారంగా 45 కిలోమీటర్ల మేర దాదాపు 1200 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. బైకు నంబరు పసిగట్టి నిందితుల్ని కనిపెట్టారు. కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో మహిళ హత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. నిందితుల్లో ఒకరు మైనరు. కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ డి.కృష్ణమోహన్‌తో కలిసి ఏసీపీ కె.శ్రీనివాసరావు గురువారం వివరాలను వెల్లడించారు. వివరాలోకి వెలితే.. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన మహిళ(45).. భర్త చనిపోవడంతో కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చి ఒంటరి జీవితం గడుపుతోంది. మూసాపేట వై జంక్షన్‌లోని వాహన షోరూంలో స్వీపర్‌గా పనిచేస్తూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉపాధి పొందేది. బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్‌ దేవ్‌(24), బాలుడు సంగారెడ్డిలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. నిత్యం తాగేవారు. ఈనెల 20న స్నేహితుడు బిహార్‌ వెళ్తుండటంతో ఆ ఇద్దరూ అతన్ని కలిసేందుకు బైకుపై ప్యారడైజ్‌ వద్దకు వచ్చి తిరిగి వెళ్తూ కూకట్‌పల్లి సమీపంలోని ప్రశాంత్‌నగర్‌లో టీ తాగేందుకు ఆగారు. అక్కడ ఆ మహిళ ఒంటరిగా కనిపించగా ఆమెను అనుసరించారు. నిర్మానుష్య ప్రాంతంలోని భవనం వద్దకు వెళ్లగానే ఆమెను సెల్లార్‌లోని దుకాణాల వద్దకు లాక్కెళ్లి ఇద్దరూ లైంగికదాడి.. చేశారు. ఆమె పారిపోబోతుంటే ఆమె తలను నేలకేసి కొట్టి చంపేశారు. ఇద్దరూ పరారయ్యారు.నిందితులు సంగారెడ్డిలోని బార్‌లో పనిచేస్తున్నట్లు తేలడంతో పోలీసులు నిందితుడు నితీష్‌కుమార్‌ను, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love