రేవణ్ణ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వందల మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వేధింపులకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీ, ఆ రాష్ట్ర ఇంఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ‘బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. వారికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారు. ఇది భిన్నమైన కేసు. గడిచిన 75ఏళ్లలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు’ అని సుర్జేవాలా వెల్లడించారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ కూడా డిమాండ్‌ చేశారన్నారు. బీజేపీ  కూటమిలో జేడీఎస్‌ ఉన్నందున.. వారిని రక్షించేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేక పోయిందని కాంగ్రెస్‌ నేతలు నిలదీశారు. ప్రజ్వల్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీని ప్రశ్నించారు.

Spread the love