ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌.. బరిలో ప్రముఖులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 15.88 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌ సహా కేరళలో 20 స్థానాలు, కర్ణాటకలోని 28 స్థానాల్లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 8 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 3 స్థానాలకు, మణిపూర్‌, త్రిపుర, జమ్ము కశ్మీర్‌లో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరుతున్నాయి. రెండో విడత పోలింగ్‌తో కేరళ, రాజస్థాన్‌, త్రిపురలోని అన్ని స్థానాలకు పోలింగ్‌ పూర్తవుతుంది. ఇప్పటికే ఏప్రిల్‌ 19న జరిగిన మొదటి విడతలో తమిళనాడు, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, అండమాన్‌, నికోబార్‌ దీవులు, మిజోరం, నాగాలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్‌లో అన్ని స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.
బరిలో ప్రముఖులు
కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, శశి థరూర్‌, కేసీ వేణుగోపాల్‌, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, అరుణ్‌ గోవిల్‌ (రామాయణం సీరియల్‌ రాముడి పాత్రధారి), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, నటి హేమమాలిని, స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తదితర ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Spread the love