రేవంత్‌రెడ్డి ప్రమాణం చేద్దాం రా

– కుల రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించలేదా?
– రాజీవ్‌గాంధీ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వద్దనలేదా : లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అవుతాయంటూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు అబద్దాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కుల ఆధారితంగా నెహ్రూ రిజర్వేషన్లు వ్యతిరేకించింది వాస్తవం కాదా? బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వద్దని రాజీవ్‌గాంధీ అన్నది నిజం కాదా? దీనిపై భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా?’ అని రేవంత్‌రెడ్డికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సచార్‌, రంగనాథ్‌ మిశ్రా కమిటీలు బీసీల నోట్లో మట్టి కొట్టాయన్నారు. బీసీల్లో మైనార్టీలను చేర్చి అన్యాయం చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందనీ, పదేండ్ల మోడీ పాలనలో మచ్చుకైనా అవినీతి జరగలేదని చెప్పారు.
రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం ఓట్ల కోసం పాకులాడుతున్నారన్నారు. మోడీ మూడోసారి ప్రధాని కాగానే యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలవుతుందని నొక్కి చెప్పారు.

Spread the love