రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

– లబ్ధి పొందేదెవరు..?
– పరిశ్రమలు లేక పెరుగుతున్న నిరుద్యోగ యువత
– బడా వ్యాపారులను వదిలి చిన్నవారిపై జూలుం
నవతెలంగాణ-సిర్పూర్‌(టి)
పేదల కోసం ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు జీవనం కోసం వాటిని అమ్ముకుంటుంటే మరి కొందరు వారి అవసరాలను ఆసరాగా చేసుకోని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని ఆరకట్టాల్సిన అధికారులు బడా వ్యాపారులను వదిలి చిన్నచితకగా జీవనం సాగించేందుకు విక్రయించే వారిపై దాడులు నిర్వహించి పట్టుకుంటున్నారు. బియ్యం అక్రమంగా విక్రయించడం నేరామైనప్పటికి కుటుంబ పోషణకు తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగం లేక యువకులు, ఇతరులు రేషన్‌ బియ్యన్ని పక్కన ఉన్న మహారాష్ట్రలో విక్రయిస్తున్నారు. భూములు లేక ఉపాధి కరువై ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే బియ్యాన్ని మన రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రకు ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లి వారి కుటుంబాలతో మధ్య స్థాయిలో జీవనం కొనసాగిస్తున్నారు.
మహారాష్ట్రలో ప్రత్యేక దుకాణాలు
రాష్ట్రానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని పోడ్సా గ్రామంలో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా మహారాష్ట్ర వారు కొంతమంది దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ దుకాణాలకే మన రాష్ట్ర రేషన్‌ బియ్యం నిరుద్యోగులు తీసుకెళ్తుంటారు. వీరిని ఆసరాగా చేసుకొని రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది వ్యక్తులు కూడా అమ్ముకుంటారు. ఈ రేషన్‌ బియ్యం గ్రామాల్లోని వినియోగదారుల నుండి ఇంటికి తీసుకోక రేషన్‌ డీలర్‌కే అమ్ముకుంటున్నారు. వీరి వద్దనే రేషన్‌ బియ్యం సేకరిస్తారు. బియ్యాన్ని తరలించే ద్విచక్ర వాహనాల నిరుద్యోగులు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు కూడా వీరి వద్దనే సేకరించి ఐచర్‌, బొలోరో వాహనాల్లో తీసుకెళ్లి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు.
బియ్యం అక్రమ రవాణాకు కారణమేంటి..?
వీరందరు ఈ అక్రమ రవాణా దందాకు పాల్పడడానికి ప్రధాన కారణం పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ శాఖలో వివిధ స్థాయిల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయకపోవడం. ఎంతోకొంత చదువుకున్న నిరుద్యోగులు ఉపాధి దొరకక, నియోజకవర్గంలో పరిశ్రమలు లేక నిరుద్యోగులు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చేయడానికి పని లేక కుటుంబాన్ని పోషించడానికి ఇలా అక్రమ మార్గం పట్టినట్టు తెలుస్తోంది.
అధికారుల నిఘా వైఫల్యం…
రేషన్‌ బియ్యం అక్రమ రవాణ కొన్ని రోజుల నుండి కొనసాగుతున్నా నివారించడంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేసే రేషన్‌ దుకాణాల్లో ఎప్పటికప్పుడు నిల్వలను పంపిణీ చేయకపోవడం, ఎవరైన సామాన్యులు ఫిర్యాదు చేస్తే తప్పా అధికారుల్లో చలనం రాదు. ద్విచక్ర వాహనాలపై రేషన్‌ బియ్యాన్ని తీసుకెళ్లే నిరుద్యోగులను పట్టుకొని మామూళ్లు ఇస్తేనే వదిలేస్తారు లేకపోతే కేసులు పెట్టి వారి ప్రతాపం చూపిస్తారు. కానీ రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులపై మాత్రం సుముఖతగా ఉంటున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి…
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం, నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఈ ప్రాంతంలో చిన్న, మద్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలి. స్వయం ఉపాధి చేసుకొనే విధంగా నిరుద్యోగ యువతి, యువకులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, లేకపోతే నియోజకవర్గంలో ఇప్పటివరకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణ కాకుండా ఇతర మారక ద్రవ్యాలు అక్రమ రవాణాకు అడ్డాగా మారబోతుందనే భయం కూడా ఉంది. ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

Spread the love