మిగిలింది మూడు రోజులే

– ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు
– ముగిసిన కాంగ్రెస్‌, బీజేపీ అధినేతల పర్యటనలు
– 9న ఆసిఫాబాద్‌లో కేటీఆర్‌ బహిరంగసభకు ఏర్పాట్లు
ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమాప్తికి ఇక మూడు రోజులే మిగిలింది. ఈ ఎన్నికల ప్రచారం 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ మూడు రోజుల వ్యవధిలో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ అధినేతలు జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో పర్యటించి వెళ్లగా, ఈ నెల తొమ్మిదో తేదీన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసిఫాబాద్‌కు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాలలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి వచ్చే ఈ రెండు స్థానాలలో కూడా వివిధ పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేపట్టారు. లోక్‌సభ బరిలో ఈ స్థానం నుండి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యే పోటీ నెలకొని ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున సీఎం రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్‌కు వచ్చి ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థి గొడం నగేష్‌ తరపున ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఇద్దరు అధినేతల బహిరంగసభలు విజయవంతం కావడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రెండు పార్టీలకు చెందిన స్థానిక నేతలు కూడా ప్రతిరోజు ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ కోసం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పలు పర్యాయాలు ఈ రెండు నియోజకవర్గాలలో పర్యటించి ప్రచార సభలలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్‌, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్‌ తదితరులు ఆత్రం సుగుణ కోసం ప్రచారం చేపడుతుండగా, సిర్పూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్‌తో పాటు జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు ప్రచారం చేపడుతున్నారు. తాజాగా బుధవారం మంత్రి సీతక్క సిర్పూరు నియోజకవర్గంలో పర్యటించి ఆయా ప్రచార సభలలో పాల్గొన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గొడం నగేష్‌ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కొత్తపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఇటీవలే పార్టీలో చేరిన జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు ప్రతీ రోజు ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభలలో పాల్గొంటున్నారు. ఈ నెల పదో తేదీన బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్‌ కాగజ్‌నగర్‌లో ప్రచారానికి రానున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు.
బీఆర్‌ఎస్‌కు అన్నీ తామై…
ఇక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆత్రం సక్కుకు ఎమ్మెల్సీ దండె విఠల్‌తో పాటు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు అన్నీ తామై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రచారంలో పాల్గొంటుండగా, సిర్పూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌ ప్రచారం చేపడుతున్నారు. ఈ పార్టీ నుండి ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వం ప్రచారానికి రాలేదు. కాని తొమ్మిదో తేదీన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసిఫాబాద్‌కు రానున్నారు. స్థానికంగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒక పర్యాయం వచ్చి వెళ్లారు. అంతే తప్ప పెద్దగా రాష్ట్ర నాయకులు ఎవరూ ప్రచారానికి రాలేదు. కాగజ్‌నగర్‌లో సిర్పూరు పేపర్‌ మిల్లు పున:ప్రారంభంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషి ఉన్నందున కేటీఆర్‌ను కాగజ్‌నగర్‌కు కూడా రప్పించి బహిరంగసభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా పెద్దగా ఈ రెండు నియోజకవర్గాలలో పర్యటించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేస్తోంది.

Spread the love