ఆరోగ్యం అంటే రోగాలు లేకుండా ఉండడమే కాదు శారీరికంగా, మానసికంగా కూడా బాగుండాలి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం. ఇంకా చెప్పాలంటే సామాజికంగా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా కూడా బాగుండటం అని కూడా చెప్పింది. మనిషి జంతు దశ నుండి మానవుడిగా ఎదిగే క్రమంలో పూర్తిగా ప్రకతితో కలసి ప్రయాణం చేశాడు. బతకడం కోసం చుట్టూ ఉన్న జంతువులు, చెట్టుచేమలపై ఆధారపడేవారు. పురాతన కాలం నుండి ఆయుర్వేదం అందుబాటులో ఉండి కొంత మేరకు ప్రజల వ్యాధులు, బాధలను తగ్గించ గలిగింది. అయినప్పటికీ జనంలో ప్రమాదకరమైన జబ్బుల వలన మరణాల సంఖ్య చాలా ఎక్కువగా, ఆయుః ప్రమాణం తక్కువగా ఉండేది.
20 వ శతాబ్దంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి బాగా మెరుగైంది. సేవాభావం కలిగిన వైద్యులు ఎక్కువ మంది రావడం, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కొత్త పరీక్షలు, మందులు, ఆపరేషన్లు కనిపెట్టడంతో ప్రజల మరణాల సంఖ్య తగ్గి, జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ ఈనాటికీ పేదవాడికి ఆరోగ్యం ఇంకా అందని ద్రాక్ష లాగానే ఉంది. అభివద్ది చెందిన ..చెందుతున్న దేశాల మధ్య, ధనిక ..పేదల మధ్య, పట్టణ.. గ్రామీణ ప్రాంతాల మధ్య ఆర్థిక అంతరాలు ఎక్కువగా ఉన్నట్లే వైద్యం విషయంలో కూడా తీవ్రమైన వ్యత్యాసం ఉంది. ఈనాటికీ సాంఘిక జీవనానికి దూరంగా ఉన్న చాలామందికి ఆరోగ్య అభివద్ధి ఫలాలు అందడం లేదు.
ఆరోగ్యం అనేది మనిషి ప్రాథమిక హక్కు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఉత్పాదక శక్తి పెరుగుతుంది. అనవసర చికిత్సల ఖర్చు తగ్గుతుంది. ఏ దేశంలోనైనా జనమంతా ఆరోగ్యంగా ఉండడం దేశానికి మంచి పెట్టుబడి వంటిది. దీనివలన, మంచి జీవితం, సమాజ అభివద్ధి, దేశ సమగ్రత కాపాడబడతాయి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోరు అన్నాడు మహాకవి గురజాడ. అందుకే అభివద్ధి చెందిన దేశాలు తమ బడ్జెట్లలో ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తం కేటాయించే ప్రయత్నం చేస్తారు. వైద్య రంగంలో మరింత మెరుగైన పద్ధతులు, మందుల కోసం నిత్యం ప్రయోగాలు చేస్తుంటారు. మన దేశంలో అలా జరగదు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కేలేదు.
ఇంత అభివద్ధి సాధించామని చెప్పుకుంటున్నా మనదగ్గర పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు, వైద్యులు, నర్సులు, మిగిలిన సిబ్బంది సరిపోయినంతగా లేకపోవడం, బడ్జెట్ కేటాయింపు క్రమంగా తగ్గడం వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కోట్ల మంది చికిత్సకు దూరంగా ఉండి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిరక్షాస్యులైన ప్రజలు దేశంలో మూఢ నమ్మకాలు, మంత్రాలు నమ్మడం వలన అశాస్త్రీయ పద్ధతుల వల్ల అనేకమంది మరణిస్తున్నారు.
కోవిడ్ సమయంలో ప్రతి వారూ సోషల్ మీడియాలో ఎంతో తప్పు సమాచారం, సలహాలు ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడం చూశాం. దేశ నాయకులే ఏ మాత్రం శాస్త్రీయత లేని మాటలు, పనుల ద్వారా అజ్ఞానాన్ని మరింత పెంచి పోషించడం మన దౌర్భాగ్యం. ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే సరైన సేవ శక్తికి మించి చేయడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడినా బిల్లులు కట్టడం తలకు మించి, అప్పుల పాలయ్యారు జనం. ప్రస్తుతం ప్రతి కుటుంబం వచ్చే ఆదాయంలో వైద్యం కోసం పది శాతానికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. జనానికి అండగా ఉండాలనే చిత్తశుద్ధి మన నాయకులకు ఉంటే కదా. ఈ విషయంలో కోవిడ్ సమయంలో కేరళ రోగ నివారణా చర్యలు, చికిత్స మాత్రమే కాకుండా ఆహారం, మందుల సరఫరాలోనూ ఆదర్శప్రాయమైన సేవలు అందించింది.
ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎంతో విలువైన మాట. కానీ అధిక జనాభా, నివాసయోగ్యం కాని అపరిశుభ్ర, కాలుష్య ప్రదేశాల్లో నివసించడం వల్ల వ్యాధులు ఎక్కువ ప్రబలుతున్నాయి. కడుపులో నుండి బయటకు రాకముందే అనేక రకాల రోగాలు, పుట్టిన మరుక్షణం నుండే బిడ్డలు మందులతోనే జీవితం మొదలవుతుంది. ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసు నుండే ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఇది చాలా వరకు మనుషులు చేస్తున్న పొరపాట్ల వల్ల, ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే జరుగుతుంది. ఫలితంగా సమాజాభివద్ధి కుంటు పడుతుంది.
నేటి బాలలే రేపటి పౌరులు. మరి పసిబిడ్డలు ఆరోగ్యంగా లేకపోతే రాబోయే సమాజం ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? మూడేళ్ల వయసు నుండే చదువు, మార్కులు, ఉద్యోగాల వేటలో జీవితమంతా ఒత్తిడితోనే బతకాల్సి వస్తుంది. ఆడపిల్లలకు యుక్త వయసులోనే చదువు పూర్తిచేయకుండా పెళ్ళిళ్ళు చేస్తే, పుట్టే బిడ్డలను ఆరోగ్యంగా పెంచే జ్ఞానం తల్లికి ఎక్కడనుండి వస్తుంది? ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకున్న అభద్రత, ఆర్ధిక స్థితి వల్ల తల్లితండ్రులు ఎంత తొందరగా పిల్లను వదిలించుకోవాలా అనే చూస్తున్నారు. దీనివల్ల మహిళా, శిశు ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టబడుతుంది.
ప్రజలెంత అజ్ఞానాంధకారంలో ఉంటే మన రాజకీయ నాయకుల ఆటలు అంత సాగుతాయి. జనం గొర్రెల మందలా ఉండడమే వారికి కావాలి. చదువు మేధో సంపత్తిని పెంపొందించాలి. కానీ నేడు ఎంతో మంది ఉన్నత చదువులు చదివి కూడా గురువులు, బాబాల కాళ్ళ దగ్గర పడి ఉండడం, వాళ్ళు ఏం చెపితే అది గుడ్డిగా అనుసరించడం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ల వలన సమాజానికి ఏం ఉపయోగం? దీనికి తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం జ్యోతిష్యం, భూత వైద్యం కోర్సులను కూడా విశ్వ విద్యాలయాల్లో ప్రవేశపెట్టింది. ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యం మరింత దిగజారుతుంది.
మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే జీవన ప్రమాణాలు పెరగాలి. చేసే వత్తి లేదా ఉద్యోగంలో భద్రత, పని ప్రదేశంలో రక్షణ ఉండాలి. వినోదం, విశ్రాంతి ఉంటేనే పని శ్రద్ధగా చేయగలుగుతారు. ఆహారం, గహ వసతి, కట్టుకోవడానికి బట్టలు కావాలి. చదువు, సామాజిక భద్రతను ప్రభుత్వాలు కల్పించాలి. దురదష్టవశాత్తూ నేడు మనం ఏం తినాలి, ఎలా బట్టలు ధరించాలి, ఎవరిని పెళ్ళి చేసుకోవాలి, ఎలా మన జీవితం గడపాలో ఎవరో చెపితే వినాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి వాతావరణంలో ప్రతి రోజూ చస్తూ మనశ్శాంతితో ఎలా బ్రతుకుతాం? ఆరోగ్యం అనేది మానవుని ప్రాథమిక హక్కు. కనీస మానవ హక్కులు లేని మనిషి ఆరోగ్యంగా ఎలా ఉంటాడు?
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహనను కలిగి ఉండాలి. జీవితానికి సరైన లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అవకాశం ఉన్నంత వరకూ పోషకాహారం, పరిశుభ్రమైన నీరు తీసుకుంటూ, నడక, ఈత, పరిగెత్తడం వంటి శారీరిక శ్రమలు చేయడం, కనీసం ఏడు నుండి 8 గంటల నిద్ర అలవాటు చేసుకోవాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నేడు యువకులలో సిగరెట్, మద్యం, మత్తు మందులు అలవాటు లేని వారు తగ్గి పోతున్నారు. యువతలో ఇటువంటి చెడు వ్యసనాల వైపు మళ్ళితే భవిష్యత్తు గొప్పగా ఎలా ఉంటుంది?
పిల్లలు, యువకులు వీలైనంత వరకూ ప్రకతికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. అవకాశం ఉన్నవారు పొలంలో పని, తోటపని చేయడం, చెట్లు, పెంపుడు జంతువులతో గడపడం చేయాలి. దీని వలన పర్యావరణం, నేలను, ప్రకతిని కాపాడుకోవడం, వాతావరణ కాలుష్యంపై అవగాహన ఏర్పడుతుంది. తల్లితండ్రుల పని పట్ల గౌరవం, శ్రమ విలువ తెలుస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవన్నీ మానసిక వికాసానికి కూడా ఉపయోగ పడతాయి.
విద్యార్థులు కేవలం తరగతికి సంబంధించినవే కాకుండా బయటి పుస్తకాలు చదవాలి. సామాజిక విలువలతో పాటు జీవితంలో ఎలా ఎదగాలో తెలుస్తుంది. సాహిత్యం చదవడం, క్రీడల్లో పాల్గొనడం వలన శరీర దారుఢ్యంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ అలవాటు అవుతాయి. తనమీద తనకు విశ్వాసం, కష్టాలు తట్టుకునే సామర్థ్యం వస్తుంది. ముఖ్యంగా యువత సాటి మనిషి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలి. నేడు విద్య వ్యాపారంగా మారి, విలువలు నేర్పడం లేదు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునే కషి చేయాలి.
మనిషి సంఘ జీవి. ఒంటరిగా బ్రతకలేడు. బ్రతకకూడదు కూడా. పిల్లలతో కలిసిపోవడం, పెద్దవారి నుండి నేర్చుకోవడం, ఆలోచనలు, జ్ఞానాన్ని పంచుకోవడం వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్, సజనాత్మకంగా ఉండడం, సంగీతం, డాన్స్, యోగా వంటి శరీర వ్యాయామాలు చేయడం వలన ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీని వలన శరీరం మనసు తేలికయిన భావన కలుగుతుంది. నిద్ర, ఆలోచనల స్థిరత్వం రావడానికి, ఇష్టమైన సేవా కార్యక్రమాలు చేసినప్పుడు సెరటోనిన్, డోపమైన్ అనే హార్మోన్స్ మెదడులో విడుదల కావడం వల్ల జీవితం మరింత హాయిగా, తప్తిగా సాగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సమయం వీటికి కేటాయించాలి.
తల్లితండ్రులు పిల్లలకు సంవత్సరం వయసు నుండి మంచి ఆహారపు అలవాట్లు నేర్పించాలి. పోషణను ఇచ్చే పండ్లు కూరగాయలు ఊహ తెలియక ముందునుండి తినిపిస్తే చాలా వరకూ అదే అలవాటు అవుతుంది. అధికంగా తీపి పదార్ధాలు, చక్కెర ఎక్కువగా, రసాయనాలు కలిసిన కూల్ డ్రింక్స్, ఉప్పు ఎక్కువగా వుండే చిప్స్, జంక్ ఫుడ్, అపరిశుభ్ర మైన ఆహారం ఇవ్వకూడదు. మన ఆహారపు అలవాట్లు మన భావి జీవితాన్ని నడిపిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. చెడు అలవాట్లు, పోషక విలువలు లేని అధిక ఆహారం తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు, బిపి, షుగర్, అధిక బరువు, వీటి చెడు పరిణామాలుగా గుండె, మెదడుకు సంబంధించిన ఇంకా అనేక జబ్బులతో జీవితం ముగించుకోవలసి వస్తుంది. ఇవన్నీ వ్యక్తికీ, కుటుంబానికి తద్వారా సమాజానికీ భారం అవుతుంది.
ఆరోగ్యం అందరికీ అందాలంటే ప్రజలకు అంటు రోగాలు రాకుండా నివారించడం, సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం, జబ్బు పడినప్పుడు నాణ్యమైన వైద్యం అందేలా చేయడం ప్రభుత్వం బాధ్యత. ప్రజలు కూడా వ్యక్తిగతంగా ఆరోగ్యకరమైన జీవన శైలి గురించి అవగాహన కలిగి ఉండి, నాణ్యతతో కూడిన జీవితం గడపాలి. వైద్య పరీక్షలు, సలహాలు పాటిస్తూ, బాధ్యతతో ఉండాలి. అటువంటి అవగాహనతో కలిసి పనిచేసినప్పుడు మాత్రమే అందరికి ఆరోగ్యం సాధ్యపడుతుంది.
నేటి బాలలే రేపటి పౌరులు. మరి పసిబిడ్డలు ఆరోగ్యంగా లేకపోతే రాబోయే సమాజం ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? మూడేళ్ల వయసు నుండే చదువు, మార్కులు, ఉద్యోగాల వేటలో జీవితమంతా ఒత్తిడితోనే బతకాల్సి వస్తుంది. ఆడపిల్లలకు యుక్త వయసులోనే చదువు పూర్తిచేయకుండా పెళ్ళిళ్ళు చేస్తే, పుట్టే బిడ్డలను ఆరోగ్యంగా పెంచే జ్ఞానం తల్లికి ఎక్కడనుండి వస్తుంది? ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకున్న అభద్రత, ఆర్ధిక స్థితి వల్ల తల్లితండ్రులు ఎంత తొందరగా పిల్లను వదిలించుకోవాలా అనే చూస్తున్నారు. దీనివల్ల మహిళా, శిశు ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టబడుతుంది.
– డా|| సిహెచ్.శారద, 9966430378