అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు వేతన బకాయిలు తక్షణమే  చెల్లించాలి: తమ్మినేని వీరభద్రం 

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 48 యేళ్ళుగా 65వేల మంది అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ ఐసీడీఎస్‌ ద్వారా సేవలందిస్తున్నారు. వీరంతా బడుగు, బలహీనవర్గాలకు చెందిన మహిళలే. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన హామి మేరకు ప్రతి నెలా 14వ తేదీన వేతనాలు చెల్లించింది. కానీ మీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వీరికి 2024 మార్చి, ఏప్రిల్‌ నెలల వేతనాలను నేటికీ చెల్లించలేదు. దీంతో వీరు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసే స్థితికి  నెట్టబడుతున్నారు. బకాయి ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నాను. అంగన్‌వాడీ  ఉద్యోగులకు కనీస వేతనం, పిఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు లేవు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.26వేలు అవసరం. కానీ అంగన్‌వాడీ టీచర్స్‌కు రూ.13,650లు, హెల్పర్స్‌కు రూ.7,800లు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీరిని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ అతితక్కువ వేతనాలను కూడా సకాలంలో చెల్లించకపోవడం సరైందికాదు. అంగన్‌వాడీ ఉద్యోగులకు రెండు నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని,  ప్రతినెలా 14వ తేదీన వేతనాలు చెల్లించాలని, వీరి వేతనాల పెంపుపై తగు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Spread the love