నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీసులు లక్షమంది సిబ్బందితోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనంగా సిబ్బందిని నియమించారు.
అస్సాం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను బద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఇతర రాష్టాల నుంచి హోంగార్డు సిబ్బంది వచ్చారు. కాగా ఇప్పటికే ఎన్నికలు బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఏజన్సీ ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. కేంద్ర బాలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. మద్యం, డబ్బులు పంపిణిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే సిసిటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.