ఓటరు గుర్తింపు కార్డులపై ఈసీ కీలక నిర్ణయం

నవతెలంగాణ హైదరాబాద్‌: ‘ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ ఈ నెల 20లోగా పూర్తి కావాలి. తక్షణం వాటిని ఓటర్లకు స్పీడు పోస్టులో పంపాలి` అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులను ఆదేశించింది. కార్డులు ఓటర్లకు పంపిణీ చేసేందుకు అధికారులను తక్షణమే నియమించాలి కూడా అని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక సాధారణ పరిశీలకుడు అజయ్‌ వి నాయక్‌ స్పష్టం చేశారు. బీఆర్కే భవన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ.. ‘పోలింగు ముగిసిన తరవాత ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాల్లో ఇతర ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు.
‘ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి చివరి దాకా శిక్షణలు నిర్వహించాలి’ అని ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్‌ మిశ్రా సూచించారు. ‘అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి షాడో రిజిస్టర్లను విధిగా అమలు చేయాలి’ అని ప్రత్యేక వ్యయ పరిశీలకుడు ఆర్‌.బాలకృష్ణన్‌ సూచించారు. ‘సాంకేతిక కారణాలతో రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అనుమతులు నిరాకరించవద్దు’ అని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు.

Spread the love