గుండెకు వల వేసిన వలపు పాట

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో ప్రేమ పాటలున్నాయి. ఒక్కో పాటది ఒక్కో ప్రత్యేకత. ప్రేయసీప్రియులిద్దరు కలిసి పాడుకునేవి కొన్నైతే, ప్రేయసిని ఉద్దేశించి ప్రియుడు పాడేవి కొన్ని. ప్రియుడిని ఉద్దేశించి ప్రేయసి పాడేవి మరికొన్ని. ఏది ఏమైనా ప్రతి ప్రేమపాటలో ఒక మధురానుభూతి తొంగిచూస్తుంది. అలాంటి తీయని అనుభూతికి లోనై ప్రియుడు పాడే పాటను ‘విరూపాక్ష’ (2023) సినిమా కోసం కె.కృష్ణకాంత్‌ రాశాడు. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
తెలుగు సినీగీత రచయితల్లో ఇప్పుడు ధ్రువతారలా వెలుగుతున్నాడు కె.కృష్ణకాంత్‌. ఆయన ఏది రాసినా కొత్తగా ఉంటుంది. తీసుకున్న వస్తువుకు పదబంధాల్ని ఎన్నుకోవడంలో ఎంతో ప్రత్యేకతను చూపిస్తాడు. తేలికైన పదాల్లో అందమైన భావాల్ని ఎంతో ఇంపుగా పొదుగుతాడు.
ఈ మధ్యే విడుదలై ఓ సంచలనం సృష్టించిన సినిమా ‘విరూపాక్ష’. ఆ సినిమాలో కథ మిస్టరీగా ఉన్నా, కథ మొత్తంలో ఓ ప్రేమపాట లేకపోలేదు. అదే ‘నచ్చావులే నచ్చావులే’ అనే పాట. ఈ పాట కథానాయకుడు తన ప్రేయసిని గూర్చి పాడే పాట. ఈ పాట మొత్తంలో ఎక్కడా కూడా ప్రేయసి ప్రియున్ని ఉద్దేశించి పాడదు. కేవలం ప్రియుడే ప్రేయసిని ఉద్దేశించి పాడుతాడు. అతడు మొదటి చూపులోనే కథానాయికను ఇష్టపడతాడు. అనుకోని పరిస్థితుల్లో ఆమెతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెలో ఉన్న కొంటెదనం, గడుసుదనం అతనికి బాగా నచ్చాయి. ఆమె సుకుమారమైన అందం, ఆమెలో ఉన్న మొండితనం, గుండెధైర్యం అతన్ని బాగా ఆకర్షించాయి. ఇక ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమెపై తనకు కలిగిన ప్రేమానుభూతిని ఈ పాటలో స్పష్టం చేస్తాడు..
నువ్వు నాకు నచ్చావు. నిన్ను ఏ రోజైతే చూశానో ఆరోజే నచ్చావు. తొలిచూపులోనే ఓ తెలియని పరవశం, వింతమైకం నన్ను కమ్మేసిందని అంటాడు. ఇక్కడ ఈ మాటలన్నీ ఆమెతో నేరుగా చెప్పడం లేదు. తన మనసుతో ఆమె మనసుకి మాత్రమే వినబడేలా చెబుతున్నాడు. ఇదీ ఈ పాటలోని ప్రత్యేకత. ఆమె వేసే కొంటె వేషాలు చూశాక ఇంకా ఎంతో నచ్చిందని, ఆమెకే మనసిచ్చానని చెబుతాడు.
ఆమె తెగబడుతూ దూకుతుంది. అయినా తడబడని తీరు ఆమెది. చిన్నపిల్లలా అల్లరివేషాలు వేస్తూ ఉంటుంది. ఆ చిలిపి వయసు గల తెల్లని మనసు అతనికి బాగా నచ్చుతుంది. ఆమెకు అతడు పరిచయం లేదని కాదు. పరిచయమే. కాని, ఎదురుపడినప్పుడు మాత్రం ఎవరో ఏమో పరిచయం లేదన్నట్టుగా చూస్తుంది..
అమాయకంగా ఉంటూనే హుషారుతనాన్ని చూపిస్తుందామె. ఏ మాత్రం భయం లేకుండా తాననుకున్న పనినే చేస్తుంది. అప్పుడే అర్థమైనట్టు ఉంటుంది కాని అర్థం కాదు. పొగరుకే అణకువ అద్దినంత అందంగా ఉంటుంది. పొగరు, అణకువ రెండూ కలిస్తే ఆమెనే. ఆమె అందంతో, సుగుణంతో తనను ఏమార్చేసిందని అంటాడు. పద్ధతి పరికిణీ కట్టి అమ్మాయి రూపం దాల్చితే ఆమెలా ఉంటుందట. అలా అని నమ్మితే మాత్రం నేను మోసపోయినట్టే. అంటే పద్ధతిగా ఉన్నట్టే ఉండి మాయ చేసేయగలదని అంటున్నాడిక్కడ. పైకి మామూలుగా కనిపిస్తుంది. కాని మాటలతో మరిపిస్తుంది. తన మనసుకు ముసుగును వేస్తుంది. ఎంత పెద్ద కష్టమొచ్చినా అవలీలగా దాటేయగలదు. ఎంత ఇష్టమున్నా బయటికి చెప్పదు. మనసులోనే దాచేసుకుంటుంది. తను పైకి అలా సామాన్యంగా కనబడుతున్నా లోపల మాత్రం ఇంకో లోకమొకటుంది. అందులో ఓ మూలనో తనకు చోటివ్వమని కోరుకుంటున్నాడతడు. అంటే.. ఆమె మనసులో తనకు స్థానమివ్వమని అడుగుతున్నాడని ఇక్కడ అర్థం.
తన మనసులోని మాటల్ని, దాచిపెట్టలేనంత ప్రేమని మౌనంగానే తన ప్రేయసికి ఇలా పాట రూపంలో వినిపిస్తున్నాడు ప్రియుడు. ప్రేయసి తన చూపులతో ప్రియుని గుండెకు వలవేసి లాగిన వలపుపాట ఇది..
పాట:-
నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే/
నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే
తడబడని తీరు నీదే/ తెగబడుతు దూకుతావే/
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే/
బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే/
అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థంకావే/
పొగరుకే అణకువే అద్దినావే/
పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టుందే/
అమ్మడూ నమ్మితే తప్పునాదే/
నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే/
పైకలా కనిపిస్తావే/ మాటతో మురిపిస్తావే/
మనసుకే ముసుగునే వేసినావే/
కష్టమే దాటేస్తావే.. ఇష్టమే దాచేస్తావే/
లోపలో లోకమే ఉంది లేవే/
నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే..
– డా||తిరునగరి శరత్‌ చంద్ర, [email protected]

Spread the love