స్పాట్‌ వాల్యుయేషన్‌

పిల్లల మెదళ్లని జల్లించి
తూర్పారా పట్టి గ్రేడులుగా
విభజించి ఫలితాలని
ఎక్కడికక్కడ ఎగజల్లే కార్యక్రమం..!

ఈ చిన్నోళ్లంతా
ఎక్కడోల్లో ఎట్లా ఉంటారో ఎవరికీ
కనబడరు గానీ,
వాళ్ల మేధో పాఠవాలని ఇంచించూ
సున్నితపుత్రాసులో పెట్టి తూస్తున్నాం ..!

పేపర్ల కట్ట మా చేతుల్లోకి రాగానే..
ఆ అక్షరాల బరువును బట్టే
కనబడని వాళ్ళ శక్తి సామర్థ్యాలను
అంచనా వేస్తాం..!

ఒక్క పూటకి.. ఇరవై పత్రాలచొప్పున
వస్త్రగాలం పట్టి కంప్యూటరీకరించాలి
ఆ లెక్కన.. స్పాట్‌ క్యాంపు చివరికంతా..
నన్నూరుగురి చిన్నారుల
భవిష్య ఫలాలని శాసనాల్లా చెక్కి
పంపుతామన్న మాట..!

గుత్తకు పట్టిన పత్తి చేనులా
టక టకా కొట్టేస్తూ..
చీడ పీడలనిట్టే ఏరేస్తూ ఉంటాం..!
వెంట్రుక వాసి తప్పిదాన్ని కూడా
జారి పోనివ్వనంత ఏకాగ్రత మాది
నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోకుండా
నీళ్లన్నా మింగని మరయంత్రాలం..!
ఒక్క మెతుకు చూస్తే చాలు..
అన్నాన్నంతా..చదివేస్తాం..!

అయ్యో,..మాడం..! ఒక్క మార్కు కలిపి
వాడిని గడ్డకేయ్యండంటూ
ప్రాధేయపడుతోంది
నా దోస్త్‌ దయార్డ్ర వేణి..!

మూడు పొరల్లోంచి కదా
వాడిని వడబోసి ఫలితం చెప్పేది .
చూసీ చూడక జాలిపడ్డానే అనుకో..
పై అధికారుల వేటుకి
వివరణలు ఇచ్చుకోవాలి..!

అయ్యయ్యో.. వీడిప్పుడు ఫెయిల్‌ అయ్యాడు..
రంధి పడకు రేపు ఏ శాసనకర్తగానో
మరే వ్యాపార వేత్తగానో
శిఖరాలధిరోహించడూ వాడు లోక జ్ఞాని.

విభిన్న ప్రతిభా సామర్ధ్యాలని
ఒక్క గాటన కట్టి ఒక్క స్కేలుతో కొలవడం..
నాకెందుకో అసంబద్దమనిపిస్తోంది.

చెట్టు నెక్కే కోతి= చెరువు నీద గలదా..!
చెరువు నీదే చాప చెట్టునెక్కగలదా..!
మార్కులు కాదు ప్రామాణికం..
మానవీయ పరిమళాలు
వెల్లివిరియడమే ముఖ్యం ..!
– నాంపల్లి సుజాత, 9848059893

Spread the love