యువతకు స్ఫూర్తినిచ్చిన ‘చే’

చే అంటే ఓ చైతన్య వేదిక
చే అంటే ఓ సోషలిస్టు భావ ప్రసార వీచిక
చే అంటే ఓ విప్లవ వీరత్వానికి సూచిక
తెలిసినవారెవరూ ‘చే’ను మరవలేరిక…
అన్యాయమే చట్టమైనఫుడు ఎదిరించడం నీ బాధ్యత కావాలి.
రోజు జుట్టును సరిచేసుకున్నట్టే హదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవర్చుకోవాలి.
ఎప్పుడైతే జీవితంలో భయం పోతుందో అప్పుడే జీవితం ప్రారంభమవుతుంది.
నువ్వు నన్ను చంపడానికే వచ్చావు, కాల్చు పిరికివాడా! నువ్వు కేవలం మనిషిని మాత్రమే కాల్చ గలవు మనిషి లోని భావాల్ని కాదు… అంటాడు చే.
యువతకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి అనేకమైన భావాలను అందించిన ‘చే’ ఒక అర్జెంటీనా మార్క్సిస్ట్‌ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, గెరిల్లా నాయకుడు, దౌత్యవేత్త, సైనిక సిద్ధాంతకర్త, క్యూబన్‌ విప్లవం యొక్క ప్రధాన శక్తి, ప్రధాన వ్యక్తి. అందుకే ”20వ శతాబ్దపు 100మంది అతిప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు”గా పేర్కొంది టైం మ్యాగజైన్‌.
ఆ మహా వ్యక్తి 1928, జూన్‌ 14న అర్జెంటీనాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చే కు నలుగురు సంతానం. వారిలో బాగా గుర్తింపు పొందిన వ్యక్తి అలైడా మార్చ్‌. అర్జెంటీనా రాజధాని బ్యూనెస్‌ అయిరెస్‌ కళాశాలలో డాక్టర్‌ చదువు పూర్తి చేశాడు. డాక్టర్‌ వృత్తి చేసుకుంటూ సుఖంగా జీవితం గడపాలని అనుకున్నారు. కానీ తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, జరుగుతున్న దోపిడీలను చూసి బాధపడ్డాడు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో పెరుగుతున్న సమస్యలకు సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి పోరాటమే శరణ్యమనుకున్నాడు. దక్షిణ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో స్వయంగా తిరిగి అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను గుర్తించాడు. ఆ సమస్యలన్నీ స్వార్థ రాజకీయాలనుండే ఉత్పన్నమైనవని భావించాడు. అవి సమసిపోయి మెజారిటీ ప్రజలకు చైతన్యం కల్గించడం, యువతను ఏకం చేయడం, ఐక్య ఉద్యమాలు సృష్టించడం ప్రధానమని అనుకున్నాడు. సాయుధ పోరాటం చేస్తే తప్ప ఈ దోపిడీ వ్యవస్థను మార్చలేమనుకున్నాడు. దాని కోసం ప్రపంచాన్ని చదవడం ఆరంభించాడు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అలవర్చుకున్నాడు. ఆయా కాల, ప్రాంత, పరిస్థితులను అన్వయించుకుంటూ విప్లవ పంధాను అనేక కరపత్రాలు, వ్యాసాలు, కవితలు, కొటేషన్లు రాశాడు. అంతేకాక, ఆయన ఒక నైపుణ్యంగల రచయిత, డైరిస్ట్‌, గెరిల్లా యుద్ధతంత్రంపై ఒక మూలాధార పుస్తకాన్ని రూపొందించారు, దానితో పాటు దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్‌ మోటర్‌ సైకిల్‌ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా అధిక ప్రజాదరణ పొందిన గ్రంథాన్నికూడా రచించారు. యువతకు సభలు ఏర్పాటు చేసి ఉపన్యాసాల ద్వారా ఉధ్యమాల వైపు మళ్ళించ గలిగాడు. అలా విప్లవ సైన్యానికి మార్గదర్శిగా నిలిచాడు. ఆయన చేసిన పర్యటనలో భాగంగా ఎక్కడ చిన్న సమస్య కనిపించినా ఫొటోలు తీసుకుని ప్రచారం చేయడంలో కూడా దిట్ట. అలా ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన ఫొటోగ్రాఫర్లలో ఒకడుగా గుర్తించ బడ్డాడు.
గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో-కిన్షాసా లోను తరువాత బొలీవియాలోను యుద్దాలను ప్రేరేపించారు. ఆఖరికీ సిఐఏ వేటాడి పట్టుకుని అక్టోబర్‌ 8, 1967, బొలివియ మిలిటరీచే బంధింపబడ్డాడు. చేతులు నరికేయ బడ్డాడు. రెండవ రోజు ఉరి తీశారు.
ఆ తరువాత అనేక మంది చే జీవిత చరిత్రలు రాశారు. తన పర్యటనలో భాగంగా రాసిన డైరీ ఆధారంగా ‘చేగువేరా మోటర్‌ సైకిల్‌’ పేరుతో తీసిన సినిమా ప్రపంచ యువతను ఉర్రూతలూగించింది. అనేక భాషల్లో నవల రూపంలో, సినిమా రూపంలో తర్జుమా చేయబడింది. ఈ మధ్య మన తెలుగు దర్శకుడు రాజమౌళి తీసిన త్రిబుల్‌ ఆర్‌ కూడా చేగువేరా సైకిల్‌ డైరీ చదివినప్పుడు వచ్చిన ఆలోచన అని తెలిపారు. అదీ చే గొప్పతనం.
– మహేష్‌ దుర్గే , 8333987858

Spread the love