మనం కలుసుకుంటే బాగుండు


మా గాలి చేష్టలని
జాడిచ్చి దులిపిన ఈత బరిగెలు
పుస్తకాలని పట్టేలా చేసిన గది గాండ్రింపులు
తిరిగి అస్తే బాగుండు
ఆ మదురాన్ని మరిచి పొకుంటే మంచిగుండు

నల్లబోర్డు మీద సార్లు నేర్పిన
అక్షరాలతో కలిపి దిద్దుకున్న జ్ఞాపకాలని
పంతోమ్మిది ఏండ్లలో
అనుభవించిన ఎత్తు పల్లాలని
వాట్సాప్‌ గోడల మధ్య కూసుండి
ఒకరికొకరం షేర్‌ చేసుకుంటే బాగుండు

మూలకాలను ముప్పావు గంటలో ముల్లెగట్టి
మైండ్‌ లా పెట్టుకున్నట్టే
ఇన్ని ఏండ్ల తర్వాత దొరికిన స్నేహాలని
గుండె గుప్పెట్లో బంధించి
ఆయువంచుల దాకా కొనసాగిస్తే మంచిగుండు

ఎక్కడెక్కడో ఉన్న మనం
అప్పుడప్పుడన్న బారిష్టర్‌ పార్వతీశం
పంచిన నవ్వుల్ని
ఫోన్‌ కాల్స్‌లో తల్సుకుని పువ్వలమై
విచ్చుకుంటే బాగుండు

ఇప్పటికైన అడ్డు గోడలై నిల్సున్న ఇగోలని
షేక్‌ హ్యాండ్స్‌ తో కూలగొట్టి
ముల్లై గీరుకున్న మాటల మనస్పర్థలని
మునుపటి పసితనపు జల్లులతో
చెరిపెస్తే బాగుండు

నోటు బుక్కులు అదిలిబదిలి చేసుకుని
ఒక్కొల్లదంట్లకెల్లి ఇంకోల్ల అండ్లకు
అక్షరాల సోల్పులు సల్లుకున్నట్లే
ఎనుకబడ్డ నేస్తానికి చేయ్యందించి
మనండ్ల కలుపుకుని
ముందుకు నడిపిస్తే మంచిగుండు

నైట్‌ క్లాస్‌లో బెంచిల కింద
దాసిన నిద్ర మబ్బులు
ఒల్డర్లను తిప్పితే ఎగరిపొయిన
వెన్నెల బల్బులు
ఎడ దాగి ఉన్నాయో
ఐదు ఏండ్ల కొసరన్న కలిసి
ఏతుక్కుంటే మంచిగుండు

ఆత్మీయ సమ్మేళనంలోనే గాక
ఏడగలిసిన నాలుగు తియ్యని మాటలతో
స్కూల్‌ రోజుల్ని తల్సుకుంటే మాస్తుగుండు.

– జి.యం.నాగేష్‌ యాదవ్‌
9494893625

Spread the love