‘మేడిపండుచూడు మేలిమై ఉండు… పొట్టవిప్పిచూడు పురుగులుండు’ అనే నానుడి రాష్ట్ర బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. శుద్ధపుష్పంగా భావించే ఆ పార్టీ బురద బండారం బట్టబయలైంది. ఒక్కొక్కటిగా అసంతృప్త గళాలు విచ్చుకుంటున్నాయి. ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీపై మబ్బులు కమ్ముకుంటున్నాయి. లుకలుకల తెప్పలు తరుముకొస్తున్నాయి. చివరకు ఆ పార్టీ అధ్యక్షుడినే తొలగించాల్సిన పరిస్థితి తెచ్చాయి. ఉన్న ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలది తలోదారి. పదవుల కోసం వెంపర్లాట. ముఠాల పోరు, ట్విట్ల వార్ నడుస్తున్నది. తాజా పరిణామాలే ఇందుకు సాక్ష్యం. నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి కాస్తా, ఎమ్మెల్యే రఘనందన్‌రావు రూపంలో పెల్లుబుకింది. ‘దుబ్బాకలో గెలుపు నా స్వయం కృషే తప్ప, కమలానిది కాదనడంతోనే’ బీజేపీ డొల్లతనం తేటతెల్లమైంది. అలాగే పార్టీ గురించి ఉన్నది ఉన్నట్టు కక్కేశాడాయన. బండి సంజరు అవినీతిపరుడనీ, తన కులమే తన ఎదుగుదలకు పెద్ద అడ్డంకి అంటూ చెప్పుకొచ్చాడు. భార్య పుస్తెలతాడమ్మి నామినేషన్ వేసిన బండికి, వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ ప్రశ్నించడం కూడా ఊరువాడా కోడై కూస్తున్నది. ఇకపోతే ఆ పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, నడ్డాతోపాటు ఇతర నేతలపైనా ప్రధాని మోడీ కోర్టులో వకాల్తా వేస్తానని విరుచుకు పడటం గమనార్హం. ఇది ఆ పార్టీలోని అంతర్గత కుమ్ము లాటలను కండ్లకు కట్టింది. మరి దీనిపై కమలనాథులు ‘చింతన్‌బైటక్’ చేస్తారో ? లేదో ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సారథ్య బాధ్యతలు అప్పగించినా, ఆయనా అసంతృప్తితోనే అంగీకరించాడని వార్తలు. తమది క్రమశిక్షణ గల పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ, తాజా ఘటనలతో ఇరుకున పడుతున్నది. ఇక కాంట్రాక్టులు, పదవుల ఆశతో కాషాయ కండువా కప్పుకున్న ఇతర పార్టీ నేతలంతా తిరుగు ప్రయాణానికి మూటాముల్లే సర్దేస్తున్నారు. తొలి నుంచీ ఈటల బీజేపీలోకి రావడం బండికి ససేమిరా ఇష్టం లేదు. అసంతృప్తితో ఆయన చేసిన ఢిల్లీ టూర్లు, ఆయనకు ఎన్నికల నిర్వహణ అధ్యక్ష పదవీ వచ్చేలా చేయడమేగాక బండి కొంపకు నిప్పుపెట్టాయి. కర్నాటక ఎన్నికలకు ముందు నుంచే రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదనే సంగతిని కేంద్ర నిఘా సంస్థ ఎప్పుడో హెచ్చరించిదట. మతమనే ఇంధనంతో మంటకాచుకోవడమే తప్ప, రాష్ట్రానికి బీజేపీ ఏం వెలగబెట్టిందో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు నిధులిమ్మంటే పక్కనున్న కర్నాటక, మహారాష్ట్రతోపాటు గుజరాత్‌కు తప్ప మరే రాష్ట్రం కేంద్రానికి గుర్తేరాదు. పేదల ఉపాధి నిధులను రూ. 85 వేల కోట్ల నుంచి రూ 35 వేల కోట్లకు తగ్గించిన ఘనత బీజేపీది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీలుస్తూ దుష్ట రాజకీయాలు చేస్తున్నది. సుపరిపాలన, సుస్థిర ప్రభుత్వాలంటూ గప్పాలు కొడుతూ కాంగ్రెస్ మాదిరిగానే తరచూ ముఖ్యమంత్రులను మార్చడం, ఆయా రాష్ట్రాల అధ్యక్షులను ఇంటికి పంపడం చేస్తూనే ఉంది. అధికారమే పరమావధిగా దుశ్చర్యలన్నీ చేస్తూనే, కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తుతున్నది.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి, రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు బీజేపీ చేసే కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే ప్రయత్నంలో విలువల వలువలూడగొడుతున్నది. ఆయా రాజకీయ పార్టీల నేతలకు వలవేయడం, ఆనక పట్టించుకోకపోవడమే ఆపార్టీ నైజం. దాన్నే విధానంగా పాటిస్తూ సాగుతున్నది. కలహాల కమలంలో ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఆ పార్టీ సంస్కృతిని తెలియజేస్తున్నవి. కాగా పొంగులేటి, జూపల్లిని లాగి తమ గంపకింద కమ్మేసుకుందామనుకున్న ఆ పార్టీ ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి బదులు, నేతలకు పదవుల పంపకాలు చేస్తే సరిపోతుందని భావించిన ‘మోషా’లకు ఇప్పుడు తెలంగాణ పార్టీలో నెలకొన్న పరిణామాలు దిమ్మె తిరిగేలా చేస్తున్నాయి. త్వరలో జరగనున్న ప్రధాని రాష్ట్ర పర్యటన నేపథ్యంలో, ఆ పార్టీలోని గొడవలు అగ్రనాయకత్వానికి సవాలే. రాజకీయాలు ప్రజలకోసమే గానీ, పదవులు కోసం కాదు. కాకూడదు. ఇప్పుడు తెలంగాణలో తాను తవ్విన గోతిలో తానే పడుతుండటం బీజేపీ వక్ర బుద్ధికి, కుత్సిత రాజకీయాలకు తార్కాణం.