హెచ్చరిక

పీఠమెక్కినంత మాత్రాన
రాజు కాలేడెవడు
బూజుపట్టిన కొన్ని చరిత్రలే వాటికి సాక్ష్యం
గాజులు తగిలించుకున్నామని
చిన్నచూపేమో
ఉడుంపట్టు పట్టి
ఉతికి ఆరేయగల నేర్పరులం

కుక్క గతుకుల సొల్లు బుద్ది
పళ్ళు రాలగొట్టుకునే వెకిలి బుద్ది
ఆటల కొమ్మకు పూసిన
విషపు పువ్వువు నీవు
కొవ్వుగా పేరుకుపోయిన
మాయాలీలల గాలానివి
కంటిచెమ్మలకు
మింట చుక్కలకు తేడా తెలుసుకోకనే
మనిషికీ, మగానికి మధ్యలో
కొట్టుమిట్టాడుతున్నావు

అలుసుగా
అలవోకగా
ఈడ్చిపారేయచ్చనుకుంటున్నావేమో
ఏడ్చి ఏడ్చి రక్తాన్ని స్రవిస్తున్న నా కళ్ళు
దీనత్వాన్ని చుట్టుకొని
బేలగా మారాయనుకుంటున్నావేమో

ఎన్నో విజయాలను రుచిచూసిన చేతులివి
అహంకారపు ముళ్ళపొదలను
తొలగించడమెలాగో
అవే పొదల మధ్యలోంచి పొంచి చూసే
కీటకాల కంటకాలను విరవడమెలాగో
దేశదేశాల్లో మన కీర్తిపతాకాన్ని
ఎగిరేసినంత గొప్పగా తెలుసు

ఆర్తనాదాలు కావివి
వర్షం రాకడను తెలిపే కారుమబ్బులు
ఇదిగో
సునామి హెచ్చరికలు జారీ చేస్తున్నా
కుర్చీ ఖాళీ అవ్వటానికి
ఇంకెంతో సమయం పట్టదు

Spread the love