బ్రిజ్ భూషణ్ అయోధ్య ర్యాలీకి అనుమతి నిరాకరణ…

నవతెలంగాణ – లక్నో: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు బ్రిజ్‌ భూషణ్‌ శుక్రవారం తెలిపారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నందున సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తానని వెల్లడించారు. బ్రిజ్‌ భూషణ్‌ ఈ మేరకు ఫేస్‌బుక్‌లో హిందీలో ఒక పోస్ట్‌ చేశారు. ‘కొన్ని రాజకీయ పార్టీలు ర్యాలీల ద్వారా ప్రాంతీయవాదం, ప్రాంతీయతత్వం, కుల సంఘర్షణలను ప్రచారం చేస్తూ సామాజిక సామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే సమాజంలో వ్యాప్తి చెందుతున్న ఈ చెడుకు వ్యతిరేకంగా జూన్ 5న అయోధ్యలో సంత్ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. అయితే తీవ్రమైన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను నేను గౌరవిస్తున్నా. జూన్ 5న అయోధ్యలో జరగాల్సిన ‘జన చేతన మహా ర్యాలీ, చలో అయోధ్య కార్యక్రమాన్ని కొద్ది రోజులు వాయిదా వేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే ఆ ర్యాలీని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారు అన్నది ఆయన స్పష్టం చేయలేదు.

Spread the love