నీ యాది మరువం సదాశివా!

Forget your yadi Sadashiva!సదాశివ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అప్పుడే దశాబ్ది కాలం దాటింది. కాలం ఎవరి కోసం ఆగదు. అయినా సదాశివ ఇంకా అభిమానుల స్మృతుల్లో వున్నాడంటే ఆయన వ్యక్తిత్వమే కారణం. సదాశివ సార్‌ బతికి వున్నప్పుడు ఆత్మీయ కవి మిత్రుడు పి.సి.రాములు గారు పెద్దాయన ఎలా వున్నాడు అంటూ… ఫోన్‌లో ముచ్చట్లు మొదలుపెట్టేవాడు. ఇప్పటికీ పెద్దాయన కుంటుంబం గురించి మాటల మొదట్లోనో, చివర్లోనో అడుగుతారు. ఇంకా చాలామంది ఇలాగే అడుగుతుంటారు.
ఇప్పటి కొమురం భీం జిల్లా కౌటాల మండలం తెనుగు పల్లెలో సామల సదాశివ 1928 మే 11న జన్మించాడు. తండ్రి నాగయ్య పంతులు. వృత్తిరీత్యా టీచర్‌గా ఆదిలాబాద్‌కు బదిలీ కావడం వల్ల ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
సదాశివ మొదట తెలుగు పండితుడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రిన్సిపల్‌గా రిటైర్‌ అయ్యాడు. యుక్త వయసులోనే తన గురువుగారైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారి ప్రోత్సాహంతో ‘ప్రభాతము’ అనే పద్య సంకలనాన్ని, రేవతి నవలను తరువాత సాంబశివ శతకాన్ని, నిరీక్షణం అనే పద్య కావ్యం తదితర రచనలు చేశాడు. తరువాత సురవరం ప్రతాపరెడ్డి సూచన మేరకు అనువాదం వైపు మళ్లాడు. అప్పటికే ఉర్దూ, ఫారసి, మరాఠి, సంస్కృతాంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. అదే విధంగా ఉర్దూ, ఫారసీ, మరాఠీ భాషల్లోని మేలిమి సాహిత్యాన్ని తెలుగు వారికి అందించి వారధిగా నిలిచాడు. ఉర్దూ కవుల కవితా సమాగ్రి, ఫారసీ కవుల చరిత్ర, అమ్జద్‌ రుబాయిలు, మరాఠి కవి కేశవసుత్‌ గారి కవిత్వం తదితర గ్రంథాలను తెలుగులోకి అనువదించి వాటి మాధుర్యాన్ని తెలుగువారికి అందించాడు. తెలుగులోని ఉత్తమ సాహిత్యాన్ని దారికందించాడు.
సదాశివ సాదా సీదా మనిషి. నిరాడంబర జీవి. తనలాగే తన కావ్యమూ అంతే. తెలుగువారి పంచెకట్టు, లాల్చీ మెడలో రుద్రాక్షమాల. ఎప్పుడూ అరుగుమీద వాలుకుర్చీలో కూర్చొని తన కోసం వచ్చేవాళ్లతో ముచ్చటించేవాడు. పక్కనే తనంతటి వయసున్న రేడియో, హిందూస్థానీ సంగీతాన్ని చెవిలో నింపుకుంటూ తన్మయత్వాన్ని పొందేవాడు. ఉదయం లేస్తూనే దినపత్రికలు చదవడం వాటిలో నచ్చిన అంశాలను వచ్చిన వారితో చర్చించడం తాను ఉన్నంత వరకూ జరిగింది. వివిధ తెలుగు దిన, వార పత్రికల్లో వ్యాసాలు రాయడం వల్ల సి.కృష్ణ, పొత్తూరి వెంకటేశ్వర్లు, వాకాటి పాండురంగారావు, జి.రామచంద్రమూర్తి తదితరులు సదాశివాకు పరిచయమయ్యారు. తరువాత కొంతకాలానికి తెలుగు పత్రికలకు రాయడం మానుకున్నాడు.
ఉర్దూ, ఫారసీ, హిందీ సాహిత్యాన్ని ఆసాంతం అధ్యయనం చేయడం వల్ల అతని ఆలోచన కూడా వాటిలోని భావుకత, భాషా సంక్షిప్తత వైపు మళ్లింది. సదాశివగారు తన వాక్యాన్ని కూడా నిరాడంబరంగా రాసి, గంభీరమైన భావాన్ని చెప్పేవాడు. ఎవరైనా చందో పద్యాలు రాసుకుని వచ్చి చూపిస్తే ఈ కాలంలో ఇంకా ఎవరు చదువుతున్నారయ్యా, పద్యాలు రాసే కొందరిలా ఎందరు రాస్తున్నారు. ఎందరు పద్యాల్లో కవిత్వం చెబుతున్నారు. అదే కథనో, నవలనో వచన కవితనో రాయొచ్చు గదా! అని సూటిగా చెప్పేవాడు. ఈ ముక్కు సూటి తనమే ఆయన మాటల్ని అపార్థం చేసుకుని కొందరు దూరమయ్యారు.
సదాశివగారితో మాట్లాడుతున్నప్పుడు సాహిత్య లోకంలో విహరించినట్లు అనిపించేది. తెలుగు, ఉర్దూ, ఫారసి కవుల అమూల్య వాక్యాలను ఎక్కడెక్కడినుంచో యాది చేసుకుని చెప్పేవాడు. ఆ వాతావరణంలో గంటలు, నిమిషాలుగా కరిగిపోయేది. సదాశివ వాక్యాలలో క్రియా పదాలైన వచ్చినాడు, వెళ్లినాడు లాంటి పదాలు వాడేవాడు. సర్‌ వచ్చాడు, వెళ్లాడు రాయొచ్చుగదా అని సాహసించి అడిగితే అదే ఇట్ల రాస్తే తప్పా అనేవాడు. తానూ తెలంగాణ బుద్ధి జీవుల్లాగే భాషా సాహిత్యాల విషయంలో ఆంధ్రావాళ్లతో అవమానానికి గురైనవాడె. గాయపడ్డవాడే.
సదాశివ కవిత్వంలోనూ నిరాడంబరతను ఆశించేవాడు. ఎంత తక్కువ పదాలు వాడితే అంత చిక్కదనమొస్తుందనేవాడు.
కాళోజీ సోదరులకు అత్యంత ఆత్మీయుడు సదాశివ. పెద్ద కాళోజీ (రామేశ్వరరావు) రాసిన ‘కానికాలం రాకముందే కడతేర్చిరావే కాలమా’ అనే వాక్యాన్ని ఎప్పుడూ గుర్తు చేసేవాడు. పెద్ద కాళోజీ మరణానంతరం ప్రతి నవంబర్‌ నెలలో అతని వర్ధంతికి వెళ్లేవాడు. అక్కడ రాత్రంతా ముషాయిరాలు, హిందూస్థాని సంగీత కచేరీ, కవి సమ్మేళనాలలో పాల్గొనేవాడు. ఇది ప్రతి సంవత్సరం సదాశివ వెళ్లే ప్రత్యేక కార్యక్రమం నన్నూ వాళ్ల రెండో కుమారుడు రాజవర్ధన్‌ను రా పుస్తకం ముందు మాట కోసం తీసుకెళ్లాడు. అదొక గొప్ప అనుభూతి నాకు. నారాయణ రావు చనిపోయిన తరువాత సోదరుల గురించి ‘బతికినంత కాలం బతికారు’ అన్నారు. ఈ వాక్యం అర్ధం చేసుకున్నవారికి అర్ధం చేసుకున్నంత వుంటుంది.
సాహిత్యంలో అన్ని దృక్పధాల వారితో సఖ్యతగా వుండేవాడు. కృష్ణబాయి, చలసాని ప్రసాద్‌ గార్లతో సంగీత సాహిత్య ముచ్చట్లు సమయమే విసిగిపోయేంత దాకా జరిగేవి.
బీద కవుల ప్రచురణ సందర్భంలో బాబాలకు, స్వాములకు వేలకు వేలు చందాలిస్తారు. బీద రచయితలకు చిల్లి గవ్వైనా ఇవ్వరని బాధ పడేవారు. చెప్పేటప్పుడు ఇతరులకు ఎంత ఉత్సాహంగా చెప్పేవారో వినేటప్పుడూ అంత ఆసక్తిగా వినేవారు. అదీ సదాశివలోని సంస్కారం.
సదాశివ సంగీత ప్రియుడు. చాలా రోజులు హిందుస్థాని సంగీత విషయాల గురించి, ఆంధ్రప్రభ, భూమి తదితర పత్రికలలో వ్యాసాలు రాసేవాడు. హిందుస్థానీ సంగీత విధ్వాంసులు, నాయికలు, ఘరానాలు, కచేరీలు నిర్వహణ మొదలగు అంశాలను ఆయన చెప్తూవుంటే ఏరుకొని మూటగట్టుకోవడమే మన పని. పండిత్‌ జస్‌రాజ్‌, ఉస్తాద్‌ బడే గులామ్‌ అలీఖాన్‌ సాహెబ్‌, హిరాబాయి బరోడ్‌కర్‌, బేగం అక్తర్‌ మొదలగు వాళ్లు వాళ్లింటికి ముచ్చట్ల రూపంలో వచ్చేవారు. వీళ్ల గురించి చెప్తుంటే చెట్టుకొమ్మలు లయాత్మకంగా ఊగుతుంటే పూలను దోసిలి నిండా పట్టి సువాసన పీలుస్తున్నట్లు వుండేది. ఉర్దూ సాహిత్యానికి సంబంధించిన విలువైన ఎన్నో వ్యాసాలు రాసినా ఎటువంటి ఉర్దూ పురస్కారం దొరకక పోవడం విచారకరం.
సదాశివ సాహిత్యంలోనే కాకుండా నిజజీవితంలోనూ ఆచరించాడు. వాళ్లింట్లో పనిచేసే వాళ్లు. అన్ని వర్గాల వాళ్లూ వుండేవారు. వారిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఎవరైనా ప్రజల మనిషి చనిపోతే అతని కనుకొలకుల్లోంచి అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు రాలిపడేవి. జయశంకర్‌ గారు మరణించినరోజు జయశంకర్‌ సార్‌ చనిపోయాడు సర్‌ అని చెప్పేసరికి ‘అయిపాయ. ఒక్కొక్కరు అందరు పోతున్నరని విషాద వదనంతో ఒక్కసారి కండ్లు మూసుకుని తెరిచాడు.
ఇన్ని సాహిత్య ప్రక్రియలు ఒకెత్తు. అతని ‘యాది’ ఒకెత్తు. ‘యాది’ అంటే కేవలం అనుభవాల పేటిక కాదు. తెలంగాణ జీవిత ముఖచిత్రమని చెప్పొచ్చు. దానిలో తన 50 ఏండ్ల జీవితానుభవాలు వున్నాయి. తన గురువు గార్లైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ గార్ల గురించి విలువైన ముచ్చట్లు చెప్పేవాడు. రావు బాలసరస్వతీదేవి గారి గురించి ఒక చోట ‘ఆమె గొంతులో ఏదో వున్నది’ అన్నాడు. ఏ అలంకారాలకు లొంగని వాక్యం సదాశివ సొంతం. ఈ యాది అప్పట్లో ‘వార్త’ ఆదివారం పత్రికలో ధారావాహికగా రావడం వల్ల తెలుగు నేలంతా చేరిపోయింది.
సదాశివ అన్నిటికీ మించి తన ఆదివాసీల కోసం పోరాడి అమరుడైన కొమురం భీం పాఠంను 1972 సంవత్సరంలో 7వ తరగతి తెలుగు పాఠంలో పట్టుబట్టి పెట్టించి తాను పుట్టిన మట్టి రుణం తీర్చుకున్నాడు.
ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరాడంబర జీవి నిరంతర అధ్యయన శీలికి ఆలస్యంగానే అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. సంగీత సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసినందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి గౌరవించింది. తెలుగు, కాకతీయ రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సత్కరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజీవ్‌ ప్రతిభా పురస్కారం ఇచ్చి గౌరవించింది. కేంద్రం ప్రభుత్వం సంగీతరంగంలో తన స్వర లయలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును తన 83వ ఏట బహూకరించింది.
ఒక మామూలు బడి పంతులు తన జీవితంలోని ఎన్నో ఎత్తు పల్లాలను అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. తాను ఆస్తిపాస్తులేవి సంపాదించుకున్నా ఎందరో గొప్ప గొప్ప మిత్రులను, శిష్యులను సంపాదించుకున్నాడు. ప్రిన్స్‌పల్‌గా రిటైర్‌ అయినా తాను తెలుగు పండితుడిననే చెప్పుకున్న నిగర్వి. బతికినంత కాలం జీవితాన్ని సౌందర్యవంతంగా, కళాత్మకంగా అనుభవించిన ధన్యజీవి.
పెద్దాయన మన నుండి తన 84వ ఏట 7.8.2012 న వెళ్లి పోయి పదేండ్లు గడిచి పోయింది. ఈ సాహిత్య వటవృక్షం నీడలో అంబాడిన ఎందరో నేడు గొప్ప కవులూ, రచయితలయ్యారు. నిజంగా అతని రూపం, వాక్యం, గిరిజనుల నిశ్శబ్దం, తెలంగాణ తనాన్ని ఇప్పటి తరం వారు కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్‌ కవిత్వమైనా, కథైనా, నవలైనా శైలి శిల్పంలో సదాశివ కనబడతాడు. అందుకే అతడు సదా సదాశివుడు.
(రేపు సదాశివ 11వ వర్ధంతి)
– డా||ఉదారినారాయణ, 9441413666 

Spread the love